శుక్రవారం అర్ధరాత్రి మొదలైన హడావుడి ఇంకా కొనసాగుతూనే ఉంది. నంద్యాలలో బాబు ష్యూరిటీ భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమంలో పాల్గొని అక్కడే బస చేసిన చంద్రబాబును ఏపీ సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. శుక్రవారం రాత్రి 3 గంటలకు మొదలైన హైడ్రామాకు ఇంకా తెరపడలేదు. వేకువజాము 3 గంటల తర్వాత ఆయన్ని సిట్ కార్యాలయం నుంచి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించారు.
శనివారం ఉదయం ఆరు గంటలకు చంద్రబాబును అరెస్టు చేసిన సీఐడీ అధికారులు వెంటనే అక్కడి నుంచి విజయవాడ తరలించారు రోడ్డు మార్గంలో సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. సాయంత్రం నాలుగు గంటల నుంచి సిట్ కార్యాలయంలో కూర్చోబెట్టి చంద్రబాబును ప్రశ్నించారు అధికారులు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఇప్పటి వరకు సేకరించిన మెటీరియల్‌తో చంద్రబాబును ప్రశ్నించినట్టు తెలుస్తోంది. రాత్రి ఏదో టైంలో ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు పూర్తి చేసి న్యాయమూర్తి ముందు హాజరు పరుస్తారని అంతా భావించారు. కానీ రాత్రంతా ఆయన్ని సిట్ కార్యాలయంలోనే ఉంచారు.
మధ్య మధ్యలో భోజనానికి, ఫ్యామిలీతో మాట్లాడేందుకు ఆయనకు బ్రేక్ ఇచ్చారు. ఈ విచారణ టైంలో కనీసం ఆయన తరఫున లాయర్లతో మాట్లాడేందుకు కూడా అనుమతి ఇవ్వలేదు. అక్కడకు వెళ్లిన న్యాయవాదులను రోడ్డుపై నుంచే బయటకు పంపేశారు. ఒక్క ఫ్యామిలీ మెంబర్స్‌ను మాత్రమే లోనికి రప్పించారు. వారిని కూడా గంటల తరబడి వెయిట్ చేయించి ఓ పావు గంట పాటు మాట్లాడించారు.
అర్ధరాత్రి రెండున్నర గంటలకు పోలీస్ బెటాలియన్‌ను రెడీ చేశారు. ఆసుపత్రికి తరలిస్తారనే ప్రచారం మొదలైంది. పోలీసులు ఆయన కాన్వాయ్‌ను సిద్ధం చేశారు.
స్థానిక ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు చేయడానికి ఏర్పాట్లు చేశారు. అక్కడ భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆసుపత్రి ప్రాంగణంలోకి ఎవర్నీ అనుమతించడం లేదు. భారీ పోలీసు బందోబస్తు మధ్య సిట్ కార్యాలయం నుంచి చంద్రబాబును విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
వైద్య పరీక్షల అనంతరం ఆయన్ని ఏసీబీ కోర్టు ముందు హాజరుపరచనున్నారు. అక్కడ న్యాయమూర్తి తీసుకున్న నిర్ణయం బట్టి అధికారులు చర్యలు తీసుకోనున్నారు.
లంచ్‌మోషన్ పిటిషన్ తిరస్కరించిన జడ్జి
చంద్రబాబు అరెస్టు అక్రమమని ఆయన తరఫు లాయర్లు లంచ్‌మోషన్ పిటిషన్ వేశారు. అయితే రిమాండ్ రిపోర్టు రానందున పిటిషన్‌పై విచారణ చేపట్టలేమని తేల్చేశారు. టీడీపీ లీగల్ సెల్ వేసిన పిటిషన్ తిరస్కరించారు.
కుటుంబసభ్యులు చంద్రబాబును పరామర్శించారు. అయితే మీరెవరు ఆందోళన చెందవద్దు అంటూ కుటుంబసభ్యులకు చంద్రబాబు ధైర్యం చెప్పారు. ధర్మం తనవైపే ఉందని, కుట్ర రాజకీయాలను తాను సమర్థవంతంగా ఎదుర్కొంటానని పేర్కొన్నారు. చంద్రబాబుతో మాట్లాడాక కుటుంబసభ్యులు సిట్ కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. మొదటగా భువనేశ్వరి, లోకేష్ మరికొందరు కుటుంబసభ్యులు సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం హైదరాబాద్ నుంచి బయలుదేరిన బాలక్రిష్ణ, బ్రాహ్మణి గన్నవరం ఎయిర్ పోర్టు చేరుకున్నారు. అక్కడి నుంచి సిట్ ఆఫీసుకు చేరుకున్న కొంత సమయానికి చంద్రబాబును కుటుంబసభ్యులు కలిసి కేసు విషయంపై చర్చించారు. విచారణ మధ్యలో తన లాయర్ ను చంద్రబాబును కలిసి కేసు విషయం వివరించినట్లు తెలుస్తోంది.