ఆంధ్రప్రదేశ్‌లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ దూసుకుపోతోంది. టీడీపీ పోటీలో లేకపోవడంతో ఆ పార్టీ ప్రాభవం ఎక్కడా కనిపించడం లేదు. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నేత, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించారు. ఆయన తాడేపల్లిలోని వైఎస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. పరిషత్ ఎన్నికల గురించి ఆయన మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ మొత్తం ఐపీ పెట్టిందా అన్నట్లు ఉందంటూ ఎద్దేవా చేశారు. తాము పోటీలో లేని ఎన్నికల్లో గెలిచారని టీడీపీ నేతలు అంటున్నారని అన్నారు. టీడీపీ నేతలు మళ్లీ ఇప్పుడు ఎన్నికలు పెట్టాలని వితండవాదం చేస్తున్నారని సజ్జల రామకృష్ణా రెడ్డి మండిపడ్డారు.
40 ఇయర్స్ ఇండస్ట్రీ చేసిన కుట్రలు ఫలించలేదని చంద్రబాబును ఉద్దేశిస్తూ సజ్జల రామకృష్ణా రెడ్డి ఎద్దేవా చేశారు. సీఎం జగన్ పాలనకు ప్రజలు మరోసారి పట్టం కట్టారని సజ్జల ఆనందం వ్యక్తం చేశారు. 98 శాతం జడ్పీటీసీల్లో వైఎస్ఆర్ సీపీ గెలిచిందని, పరిషత్ ఎన్నికల నుంచి టీడీపీ తప్పుకోవడం పెద్ద డ్రామా అని రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. ఇంత సుదీర్ఘంగా ఎన్నికల ప్రక్రియ జరగడం దేశంలోనే ఇది తొలిసారి అని సజ్జల రామకృష్ణా రెడ్డి పేర్కొన్నారు.
ఈ ఎంపీటీసీ ఫలితాలు తమకు మరింత శక్తి ఇచ్చాయని సజ్జల అన్నారు. రెండేళ్ల పాలన తర్వాత జనం మెచ్చిన తీర్పు ఇదే అని వివరించారు. దాదాపు 98 శాతం జడ్పీటీసీ ఎన్నికల్లో విజయం సాధించడం సామాన్య విషయం కాదని అన్నారు. ప్రజలు ప్రభుత్వం తమకు నచ్చితే, విశ్వసనీయతకు ఓటేస్తారని అనడానికి ఈ ఎన్నికలే ఉదాహరణ అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఇప్పటికైనా టీడీపీ నేతలు అవనసర సవాళ్లు మానుకుని నిర్మాణాత్మకమైన సలహాలు ప్రభుత్వానికి ఇవ్వాలని సజ్జల రామకృష్ణా రెడ్డి సూచించారు.
కుట్రలు దాటుకుని ఫలితాలు: అంబటి
‘‘ఈ ఎన్నికలకు గడువు గత ప్రభుత్వంలోనే గడువు ముగిసింది. రాజ్యాంగపరంగా ఎన్నికలు జరపాల్సి ఉన్నా.. గెలవలేమని భావించి చంద్రబాబు ఎన్నికలు పెట్టకుండా పారిపోయాడు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నికలు పెట్టాలని ప్రయత్నించారు. ఈలోపు చంద్రబాబు, ఆయనతో కలిసి కొన్ని దుష్ట శక్తులు ఎన్నో కుట్రలు చేశారు. అర్ధాంతరంగా వాయిదా వేయడం నుంచి ఎన్నికలు జరిగినా ఫలితాలను ప్రకటించకుండా చేశారు. అన్ని అవరోధాలు దాటుకుని ఈ రోజు ఫలితాలు వస్తున్నాయి. పంచాయితీ, మున్సిపల్ ఎన్నికల్లో నువ్వు, నీ కొడుకు కాలికి బలపం కట్టుకుని తిరిగారు. ఫలితాలు ఏమైనా మారాయా? కుప్పం కూడా కుప్పకూలి పోయింది. చంద్రగిరి శంకరగిరి మాన్యాలు పట్టింది. ఇక టీడీపీ మూసేయడానికి సిద్ధంగా ఉంది’’ అని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు.