Sajjala Ramakrishna Reddy Comments: రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించేందుకు సీఎం జగన్‌ ఢిల్లీ వెళ్లారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. జగన్ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీ వెళ్తే.. చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం వెళ్లారని అన్నారు. టీడీపీలో బలహీనత కనబడుతోందని.. పొత్తుల కోసం ఎక్కడికైనా వెంపర్లాడుతారని అన్నారు. అందుకే బీజేపీతో పొత్తు కోసం ఢిల్లీకి వెళ్లొచ్చారని సజ్జల ఎద్దేవా చేశారు. 


వైఎస్ షర్మిల గురించి మాట్లాడుతూ.. చంద్రబాబు స్క్రిప్ట్‌ను షర్మిల చదువుతోందని విమర్శించారు. చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడాలో వాటిని మాట్లాడిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఏపీలో కాంగ్రెస్‌ పార్టీకి ఉనికి లేదని.. అద్దె మైకులా షర్మిల ఇక్కడ విమర్శలు చేస్తున్నారని అన్నారు. సీఓటర్‌ సంస్థ 2019లో కూడా గతంలో కూడా టీడీపీకి అనుకూలంగా ఫలితాలు ఇచ్చిందని అన్నారు. దాని విశ్వసనీయత ఏంటో ఫలితాల తరువాత అందరికీ తెలుసని అన్నారు. ‘‘వారి క్రెడిబిలిటీ ఏంటో వారికే తెలియాలి. మిగిలిన సర్వేలు అన్నీ మాకు అనుకూలంగా రిజల్ట్స్‌ ఇస్తున్నాయి. పొత్తులకు పోయి చంద్రబాబు నాలుగు ఓట్లు దండుకోవాలని చూస్తోంది. 


మేము చేసిన మంచిని తెలియజేసి ఒంటరిగా పోటీచేస్తున్నాం. చంద్రబాబు పాలన చూశారు.. ఇప్పుడు జగన్‌ పాలన చూశారు. ప్రజలకు ఎవర్ని గెలిపించుకోవాలో వారికే ఓట్లు వేసి తీర్పు ఇస్తారు. చంద్రబాబుతో బీజేపీ పొత్తుకు ప్రయత్నిస్తోందని ఎల్లో మీడియా విచిత్రంగా రాస్తోంది. కానీ బీజేపీకి అంత అవసరం టీడీపీతో లేదు. తెలంగాణ వ్యవహారాలు మేం పట్టించుకోం. కాంగ్రెస్‌ పార్టీ ఇబ్బందుల నుంచి వచ్చిన పార్టీ మాది. మా నాయకుడిని 16 నెలలు జైల్లో పెట్టించింది. దాని ఫలితం కూడా ఇప్పుడు కాంగ్రెస్‌ అనుభవిస్తోంది. 


జగన్‌ పీఎంతో పాటు  ఇతర కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. రాజ్యసభ ఎన్నికలో పోటీ చేయడానికి వారికి అర్హత లేదు. వాళ్లు పోటీ చేయడం అనైతికం. వారికి సరైన సంఖ్యా బలం లేదు. ఎల్లో మీడియాలో లేనిపోనివి రాసి కొన్ని రోజులు ఆనందం పొందుతారు అంతే’’ అని సజ్జల మాట్లాడారు.