వివేకానంద రెడ్డి హత్య కేసులో అసలు దోషులను బయటపెట్టాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణా రెడ్డి డిమాండ్ చేశారు. అసలు వివేకానంద రెడ్డి కేసు దర్యాప్తు సక్రమంగా జరుగుతుందా అని ప్రశ్నించారు. హత్యలో ఆధారాలు, మర్డర్ జరిగిన ప్రదేశం ఒక వైపు ఉంటే, ప్రకటనలు మాత్రం రకరకాలుగా ఉన్నాయని అన్నారు. ఈ కేసులో ఒక కల్పితమైన కథ సీబీఐ ఛార్జ్‌ షీట్‌లో కనిపిస్తోందని విమర్శించారు. మంగళవారం (జూలై 25) సజ్జల విజయవాడలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఎల్లో మీడియా, టీడీపీకి మసాలాతో కూడిన సరకుగా ఛార్జిషీట్‌ ఉపయోగపడుతుందని మండిపడ్డారు. సీబీఐ కూడా దర్యాప్తు పేరుతో ఎంత చెత్తగా ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసిందో చూస్తున్నామని అన్నారు.


వివేకానంద రెడ్డి హత్య వల్ల నష్టం ఎవరికో చిన్న పిల్లాడిని అడిగినా చెప్తారని అన్నారు. వ్యవస్థలను ప్రభావితం చేయడం వల్లే దర్యాప్తు తప్పుడుగా జరిగిందని ఆరోపించారు. నాలుగేళ్ల తర్వాత కొత్త కథ అల్లారని విమర్శించారు. వివేకా కుమార్తె సునీత ఇప్పటి వరకు ఆరు, ఏడు స్టేట్‌మెంట్లు ఇచ్చారని.. కొన్ని అంశాలను మాత్రమే తీసుకుని విషం చిమ్ముతున్నారని అన్నారు. వివేకా పేరు మీద మచ్చ పడకూడదని అవినాష్‌ రెడ్డి, ఆయన ఫ్యామిలీ మౌనంగా ఇన్నాళ్లు భరిస్తూ వచ్చారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో దోషులు బయటకు రావాలని మొదటి నుంచి తాము కోరుతున్నామని అన్నారు.


వివేకానంద రెడ్డి హత్య కేసు ఆధారాలను సీబీఐ ఏం చేసిందని, కథ ఎలా మలుపు తిరగాలో ఆ విధంగా స్టేట్‌మెంట్‌ వస్తుందని అన్నారు. గూగుల్‌ టేక్‌ అవుట్‌ నిలబడదని వారికి అర్థమైందని సజ్జల చెప్పారు. వివేకా అల్లుడు కూడా కడపలో పోటీకి రెడీ అన్నాడు. వివేకా  మళ్ళీ  వైసీపీ లోకి  వచ్చిన  తర్వాత  జగన్ పూర్తి  గౌరవం ఇచ్చారు. చనిపోయిన  వారి  గౌరవానికి  భంగం  కలిగించకూడదు అనే ఉద్దేశ్యంతో మేమున్నాం’’ అని సజ్జల అన్నారు.