Sajjala Ramakrishna Reddy comments on Election Commission: తాడేపల్లి: ఏపీ ఎన్నికల్లో కుట్ర జరిగిందని, ఎన్నికల కమిషన్‌ నిష్పక్షపాతంగా వ్యవహరించలేదని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. టీడీపీ శ్రేణులు వైసీపీ వర్గీయులపై దాడులు చేస్తున్నా పోలీసులు పట్టించుకోలేదని, ఎక్కడైతే పోలీసు ఉన్నతాధికారుల బదిలీ జరిగిందో అక్కడే ఎక్కువ దాడులు జరిగాయని చెప్పారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎన్నికల సమయంలో ఈసీ ఉదాసీనంగా వ్యవహరించింది. టీడీపీ గూండాలు దాడులు జరిపినా, పోలింగ్ ను ప్రభావితం చేసినా చర్యలు తీసుకోలేదన్నారు. ఈ పరిస్థితిని గమనిస్తే ఓట్ల లెక్కింపుపై సైతం వైసీపీ తరఫున సజ్జల పలు అనుమానాలు వ్యక్తం చేశారు. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపులో సైతం ఏదైనా కుట్ర జరగొచ్చు అని వ్యాఖ్యానించారు.


కూటమి నేతల పార్టీకి పోలీస్ అబ్జర్వర్ హాజరు !
‘ఎన్నికల సమయంలో రిగ్గింగ్‌ చేయాలనే ఆలోచనతో టీడీపీ నేతలు, కార్యకర్తలు  దాడులకు తెగబడ్డారు. టీడీపీ నేతలు ఇచ్చిన పార్టీకి పోలీసులు, పరిశీలకులు హాజరయ్యారు. మరోవైపు వారం రోజుల కిందట పోలీస్ ఉన్నతాధికారులు, డీజీపీని ఈసీ బదిలీ చేసింది. కొత్త వారికి రాష్ట్రంపై కనీస అవగాహన కూడా లేదు. తెలుసుకునే టైం కూడా వారికి దొరకలేదు. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల కూటమి చెప్పిన చోటే పోలిసుల బదిలీ జరిగింది. పోలీస్ అధికారులను ఎక్కడ మార్చారో అక్కడే ఎక్కడ గొడవలు, హింస జరిగాయి. అంటే ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించిందని మేం ఎలా నమ్మాలి. ఎన్నికల రోజు నుంచి టీడీపీ చేస్తున్న దాడులపై డీజీపీకి, ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశామని’ సజ్జల వివరించారు. 


టీడీపీ దాడులు చేస్తుంటే.. వైసీపీ నేతల హౌస్ అరెస్టులు


పోలింగ్‌ రోజు ఓవైపు టీడీపీ అభ్యర్థులు మాత్రం యథేచ్చగా తిరుగుతుంటే.. వైసీపీ నేతలను మాత్రం పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారని మండిపడ్డారు. గురజాలలో ఓ గుడిలో తలదాచుకున్న వారిపై దాడులు జరగడం పోలీసులు, ఈసీ వైఫల్యాలానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. కడప, పల్నాడు, చంద్రగిరి సహా పలు ప్రాంతాల్లో ఈసీ వైఫల్యం కారణంగా గొడవలు జరిగాయి, కనుక ఈసీనే వీటికి బాధ్యత వహించాలన్నారు. ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి ఫ్యామిలీపై దాడి జరిగినా చర్యలు లేవు. మంత్రి అంబటి రాంబాబును అన్యాయంగా హౌస్ అరెస్టు చేశారు. 


పురంధేశ్వరి ఫిర్యాదు చేశారని సైతం బదిలీ చేశారు. మొత్తం 29 మంది అధికారులను ట్రాన్స్ ఫర్ చేశారు. సుజనాచౌదరికి దగ్గరి మనిషి, రిటైర్డ్ ఆఫీసర్ అయిన విష్ణువర్ధనరావు ఇచ్చిన విందుకు పోలీసు అబ్జర్వర్ దీపక్ మిశ్రా వెళ్లడాన్ని సజ్జల ప్రస్తావించారు. టీడీపీ కూటమి ప్లాన్ లను దీపక్ మిశ్రా ద్వారా ఈసీ అమలు చేసిందని ఆరోపించారు. పోలీసు అబ్జర్వర్ దీపక్ మిశ్రాని వెంటనే వెనక్కి పిలవాలని డిమాండ్ చేశారు. ఫిర్యాదు వస్తే, ఎవరిపైనా విచారణ చేయకుండానే వెంటనే వెంటనే బదిలీ చేయడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. కౌంటింగ్ సజావుగా జరుగుతుందో లేదో నని ఈసీ తీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తూనే.. ఏపీలో రెండోసారి వైసీపీ అధికారంలోకి రాబోతుందన్నారు.