AP News: వైసీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో ప్ర‌క‌ట‌నల పేరుతో భారీగా నిధుల దుర్వినియోగం జ‌రిగింద‌ని అసెంబ్లీ వేదిక‌గా కూట‌మి మంత్రులు ఆరోప‌ణ‌లు చేశారు. అసెంబ్లీ స‌మావేశాల ముగింపు రోజైన శుక్ర‌వారం ఏపీ అసెంబ్లీలో ప‌త్రిక‌ల‌కు యాడ్స్ ఇవ్వ‌డంలో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయని, వాటిపై విచార‌ణ జ‌ర‌పాల‌ని టీడీపీ స‌భ్యులు డిమాండ్ చేశారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, తెనాలి శ్రవణ్‌కుమార్‌, ధూళిపాళ్ల నరేంద్ర, బెందాళం అశోక్‌ మాట్లాడారు. 2019-24 మధ్య రూ.850 కోట్ల మేర పత్రికల్లో ప్రకటనలకు ఖర్చు చేశారని తెలిపారు. దీనిపై హౌస్ కమిటీ వేయాలని వారు డిమాండ్ చేశారు. డిజిటల్ మీడియా ద్వారా వందల కోట్లు దోచి పెట్టారని, మీడియాను అడ్డుపెట్టుకుని జగన్ అడ్డగోలుగా వ్యవహరించారని పలువురు మంత్రులు ఆరోపించారు. ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేశారన్నారు. వారికి కావాల్సిన మీడియాకే నిబంధనలకు విరుద్ధంగా యాడ్స్ ఇచ్చి లబ్ధి చేకూర్చారని ఆరోపించారు.


ప్రతి 15 రోజులకు తమకు కావాల్సిన పత్రికలు, మీడియాలో నిబంధనలకు విరుద్ధంగా ప్రకటనలు ఇచ్చి అనుచిత లబ్ధి కలిగించారన్నారు. నాటి సీఎం జగన్‌ సతీమణి ఆధ్వర్యంలో నడిచిన సాక్షి పత్రికకు పెద్ద ఎత్తున ప్రకటనల డబ్బు చెల్లించారని ఆరోపించారు. ఈ సమావేశంలో కూటమి మంత్రులు అసెంబ్లీ వేదికగా గత వైసీపీ ప్రభుత్వం పై మండిపడ్డారు. ఐదేళ్లలో సాక్షి పత్రికకు రూ.403 కోట్లు, . ఈనాడుకు 190 కోట్లు, ఆంధ్రజ్యోతికి కేవలం రూ.21 లక్షలు మాత్రమే ఇచ్చారని శ్రావణ్ కుమార్ అన్నారు. మిగతా పత్రికలన్నింటికీ రూ.488 కోట్ల మేర ప్రకటనలు ఇచ్చారని అని మంత్రి పార్థసారథి తెలిపారు. ఇది పెద్ద కుంభకోణం..వెంటనే విచారణ చేయాలని డిమాండ్ చేశారు.


అనంతరం సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి దీనిపై వివరణ ఇచ్చారు. సభ్యుల డిమాండ్‌ మేరకు హౌస్‌ కమిటీ వేసే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. ఈ అంశంపై స్పీకర్‌తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. 2019-24 మధ్య ప్రకటనల్లో పక్షపాత ధోరణి వాస్తవమేనని.. దీనిపై విచారణ జరిపిస్తామని వెల్లడించారు. ఒక్క సాక్షి పత్రికకే రూ.400కోట్ల మేర కేటాయించారని మంత్రి తెలిపారు.


గ‌తేడాది యాడ్స్ లెక్క‌లు బ‌య‌ట‌పెట్టిన వైసీపీ ప్ర‌భుత్వం


గ‌త ఏడాది మార్చిలో జ‌రిగిన అసెంబ్లీ స‌మావేశంలోనూ ఇదే విధంగా అంత‌కుముందు అధికారంలో ఉన్న చంద్ర‌బాబు ప్ర‌క‌ట‌న‌ల కోసం భారీగా ఖ‌ర్చు చేసింద‌ని వైసీపీ ప్ర‌భుత్వం ఆరోపించింది. 2014-19 వ‌ర‌కు తెలుగుదేశం ప్రభుత్వం యాడ్స్ కోసం రూ.449 కోట్లు ఖర్చు చేసింద‌ని అసెంబ్లీలో నాటి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ వివ‌రించారు. యాడ్స్ ఇచ్చే వ్యవహారంలో పారదర్శకత లేకుండా  ఇష్టానుసారంగా ఎవరికి పడితే వాళ్లకి యాడ్స్ ఇచ్చారని ఆరోపించారు. రాష్ట్రానికి సంబంధం లేని ఇతర రాష్ట్రాలకు చెందిన పేపర్లకు కూడా యాడ్స్ ఇచ్చార‌ని వివ‌రించారు. తెలుగుదేశం ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న పత్రికలకు పెద్దపీట వేశారని విమ‌ర్శించారు. ఈనాడు పత్రికకు 50 శాతం రేటు పెంచి రూ.120 కోట్లు యాడ్స్ ఇచ్చారన్నారు.


సర్కులేషన్‌ లో మూడో స్థానంలో ఉన్న ఆంధ్రజ్యోతికి నిబంధనలను తుంగలోకి తొక్కి రూ.72 కోట్ల యాడ్స్ ఇచ్చారని వేణు మండిపడ్డారు. రెండో స్థానంలో ఉన్న సాక్షి పేపర్‌కు కేవలం రూ.30 కోట్ల యాడ్స్ మాత్రమే ఇచ్చారని తెలిపారు. చంద్ర‌బాబు ప్రభుత్వంలో ఒక ఏజెన్సీ ద్వారా యాడ్స్ ఇచ్చేవారని, ఆ ఏజెన్సీకి 15 శాతం కమిషన్ ఇచ్చేవారని ఆరోపించారు. తాము మాత్రం డైరెక్టుగా యాడ్స్ ఇవ్వటం వల్ల రూ.80 కోట్లు ఆదా చేశామ‌ని మంత్రి చెల్లుబోయిన వేణు ఆరోజు అసెంబ్లీలో వివ‌రించారు.