అమరావతి: టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి (Nallapareddy prasanna kumar reddy) చేసిన వ్యాఖ్యలను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు. కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి ఇదివరకు పలుమార్లు వేమిరెడ్డిపై ఆయన భార్య ప్రశాంతి రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాజాగా మహిళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఆయన చేసిన వ్యాఖ్యలు నెల్లూరు జిల్లాలో దుమారం రేపుతున్నాయి. ఆమె నుంచి భర్త వేమిరెడ్డి ప్రాణాలకు సైతం ముప్పు ఉందంటూ ప్రసన్నకుమార్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేయడంపై పవన్ కళ్యాణ్ మండిపడ్డారు.
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ‘మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేయడం వైసీపీ నేతలకు అలవాటు. మహిళా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమైనవి. మహిళల ఆత్మగౌరవం దెబ్బతీసేలా మాట్లాడితే సహించేది లేదు. మహిళా ఎమ్మెల్యేలనే వైసీపీ నేతలు ఇంతలా టార్గెట్ చేసుకుంటే, సాధారణ మహిళల పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుంది. కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి వ్యక్తిగత జీవితాన్ని లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేయడం సరికాదు. మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలను ప్రజాస్వామిక వాదులు, మహిళా వాదులు ఖండించాల్సిన అవసరం ఉంది. మహిళల గౌరవానికి భంగం వాటిల్లేలా మాట్లాడితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం. గతంలో అసెంబ్లీలో ఇలాంటి తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన కారణంగానే వైసీపీకి బుద్ధి చెబుతూ రాష్ట్ర ప్రజలు సరైన తీర్పు ఇచ్చారు. మహిళలను కించ పరిచేలా మాట్లాడటం అలవాటుగా మారిన వైసీపీ నేతలకు మహిళలు, రాష్ట్ర ప్రజలు తగిన రీతిలో బదులిస్తారని’ అన్నారు.