తన ప్రాణాలకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నుంచి ప్రమాదం ఉందని ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పోసాని కృష్ణ మురళి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. మంళగిరిలోని పోలీస్ కేంద్ర కార్యాలయానికి వెళ్ళిన పోసాని నేరుగా డీజీపీతో సమావేశం అయ్యారు. డీజీపి కి తన ఫిర్యాదు అందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. నారా లోకేష్ నుండి తన ప్రాణాలకు ముప్పు ఉందని, లోకేష్ మాట్లాడిన వీడియోల ఫుటేజ్ ను కూడా డీజీపీకి అందించారు.


లోకేష్ పై ఘాటు వ్యాఖ్యలు చేసిన పోసాని..


తన పరువుకు భంగం కలిగించేలా పోసాని కృష్ణ మురళి వ్యవహరించారంటూ తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళగిరి కోర్టులో పరువు నష్టం కేసును దాఖలు చేశారు. దీనిపై పోసాని కృష్ణ మురళి ఘాటుగానే స్పందించి కీలక వ్యాఖ్యలు చేశారు. తనను చంపేందుకు లోకేష్ కుట్ర చేస్తున్నాడని, నిన్ననే ప్రెస్ మీట్ లో పోసాని వ్యాఖ్యానించారు. లోకేష్ పీఏ చైతన్య తనకు ఫోన్ చేసి తెలుగు దేశం లో చేరాలని ఆహ్వానించినట్లు తెలిపారు.


తాను ఒప్పుకోకపోవడంతో చంపేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.  లోకేష్ అక్రమాలపై విమర్శలు చేసినందుకు తనపై రూ.4 కోట్ల పరువు నష్టం కేసు వేశారని ఆరోపించారు. ఇకపై నుంచి తాను కూడా కేసులు వేస్తానని, లోకేష్ గతంలో ఎవరిపైన అయినా విమర్శలు చేయలేదా అని ప్రశ్నించారు. తప్పుడు ఆరోపణలు, విమర్శలు లేకుండానే యువగళం పాదయాత్ర జరుగుతోందా అని పోసాని ప్రశ్నించారు. లోకేష్ ఆస్తులు కొనుగోలు చేశారని,  తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని, లోకేష్ కుటుంబంలో ఎవరు ఆస్తులు కొన్నా, అతనికి సంబంధం ఉండదా అని పోసాని ప్రశ్నించారు. లోకేష్ వ్యవహర శైలితో తనకు ఉన్న ఇబ్బందులను డీజీపీకి వివరించారని పోసాని తెలిపారు.


లోకేష్ ఇగో హర్ట్ అయ్యిందనే..


తనను తెలుగు దేశం పార్టీలో చేరాలని లోకేష్ అనేక సార్లు పిలిపించేందుకు ప్రయత్నించారని పోసాని అన్నారు. అయితే తాను తెలుగు దేశం పార్టీలో చేరుకండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరానని, దీంతో లోకేష్ ఇగో హర్ట్ అయ్యి ఉండవచ్చని పోసాని వ్యాఖ్యానించారు.