పల్నాడు జిల్లా మాచర్లలో టీడీపీ, వైసీపీ శ్రేణులు మధ్య ఘర్షణకు ఫ్యాక్షన్ లీడర్లపై కారణమని పోలీసులు తేల్చారు. ఈ ఘటనపై మాట్లాడిన పల్నాడు జిల్లా ఎస్పీ రవి శంకర్ రెడ్డి... ఫ్యాక్షషన్‌ నేర చరిత్ర ఉన్న వ్యక్తుల రావడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని అన్నారు. 


వెల్దుర్తికి సంబంధించిన ఫ్యాక్షన్ నేరచరిత్ర కలిగిన వ్యక్తులు మాచర్ల పట్టణంలో తిరుగుతున్నారని తమకు సమాచారం అందిందన్నారు రవిశంకర్‌రెడ్డి. ముందస్తు చర్యల్లో భాగంగా ఉదయం నుంచే అక్కడ తనిఖీలు చేపట్టామన్నారు. సాయంత్రం జరిగిన ఇదేమి ఖర్మ రా కార్యక్రమంలో వాళ్లంతా పాల్గొన్నారని వివరించారు. 


రాష్ట్రానికి ఇదేమి ఖర్మ రా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఫ్యాక్షన్ నేరచరిత్ర కలిగిన వ్యక్తులు ఉద్దేశ పూర్వకంగా ప్రత్యర్థులను రెచ్చగొట్టారని వాళ్లపై రాళ్లతో విచక్షణారహితంగా దాడులకు పాల్పడ్డారన్నారు. పూర్తిగా ఫ్యాక్షన్‌్కు  సంబంధించిన గొడవకు రాజకీయ రంగు పులిమే ప్రయత్నం చేస్తూ ప్రత్యర్థులపై దాడులకు పాల్పడ్డారని తెలిపారు. 


గత 20 నుంచి 30 సంవత్సరాలుగా ఈ ఫ్యాక్షన్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయని.. దాడులకు పాల్పడిన వాళ్లందర్నీ అదుపులోకి తీసుకుంటున్నామన్నారురవిశంకర్‌రెడ్డి. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని వివరించారు. మాచర్ల సంఘటన స్థలానికి చేరుకున్న జిల్లా ఎస్పీ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.


మాచర్ల పట్టణంలో శుక్రవారం సాయంత్రం టీడీపీ, వైసీపీ శ్రేణులు పరస్పరం దాడులు చేసుకున్నాయి. కర్రలు, రాళ్లు, గాజు సీసాలతో దాడులకు పాల్పడ్డారు. టీడీపీ ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా ఆ పార్టీ కార్యకర్తలు స్థానిక రింగురోడ్డు వద్ద ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో మున్సిపల్‌ కార్యాలయం వద్దకు వైసీపీ శ్రేణులు భారీగా చేరుకున్నారు. చిన్న కాన్వెంట్‌ సమీపంలో టీడీపీ, వైసీపీ కార్యకర్తలు ఎదురుపడ్డారు. ఇరు పార్టీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. ఒక్కసారిగా ఇరు పార్టీల కార్యకర్తలు రాళ్లు, సీసాలు విసురుకుని దాడులకు పాల్పడ్డారు. ఇరువర్గాలు రాళ్లు, కర్రలతో దాడులకు దిగాయి. ఈ ఘటనలో ఇరువర్గాలకు చెందిన పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం పోలీసులు అక్కడకు చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. ప్రదర్శన నిలిపివేసి అక్కడి నుంచి వెళ్లిపోవాలని టీడీపీ నేతలకు పోలీసులు సూచించారు. మాచర్ల నియోజకవర్గం ఇన్‌ఛార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డిని పోలీసులు అక్కడి నుంచి పంపించేశారు. మాచర్ల పట్టణంలో 144 సెక్షన్‌ విధించారు. ఇద్దరు వైసీపీ కార్యకర్తలకు గాయాలు కావడంతో వారిని స్థానికి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


బ్రహ్మారెడ్డి ఇంటికి నిప్పు పెట్టిన అల్లరి మూకలు 


మాచర్లలో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. వైసీపీ కార్యకర్తలు టీడీపీ నేత బ్రహ్మారెడ్డి ఇంటికి నిప్పు పెట్టారు. టీడీపీ కార్యకర్త ఇంటిని ధ్వంసం చేశారు. అల్లరి మూకలను పోలీసులు అడ్డుకుంటున్నాారు. టీడీపీ నేతల వాహనాలకు నిప్పుపెట్టారు. పోలీసులు బ్రహ్మారెడ్డిపై లాఠీ ఎత్తడంతో టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు వైసీపీ నేతలకు కొమ్ముకాస్తున్నారని ఆరోపిస్తున్నారు. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారడంతో భారీగా పోలీసులను మోహరించారు.