National Handloom Day 2023: మన దేశం పేరు చెప్పగానే విదేశాలకు గుర్తొచ్చే విషయాలలో చేనేత కళ ఒకటి. తెలుగు రాష్ట్రాల్లోనూ పలు పట్టణాలు చేనేతకు పేరు గాంచాయి. ఆంధ్రప్రదేశ్‌లో చేనేత రంగం పేరు చెబితే ఠక్కున్న గుర్తొచ్చే పట్టణం మంగళగిరి. ఇక్కడి చేనేత కళాకారులు, చేనేతన్నలు తయారు చేసే చీరలు, ఇతర ఉత్పత్తులకు జాతీయ స్థాయిలో ఎంతో గుర్తింపు ఉంది. ఈ క్రమంలో మంగళగిరి చేనేతకు మరో అరుదైన గౌరవం దక్కనుంది. మంగళగిరి చేనేతకు జీఐ గుర్తింపు (GI Tag for Mangalagiri Sarees) సైతం లభించింది.
చేనేతరంగంలో విశిష్ట కృషి చేసిన చేనేత కార్మికులను గౌరవిస్తూ 2012నుంచి ఏటా చేనేత కార్మికులకు సంత్‌కబీర్ అవార్డులను జాతీయస్థాయిలో అందిస్తున్నారు. ఆగస్టు 7న చేనేత కార్మికులకు పెద్ద పండగ లాంటిది. ఎందుకంటే ఆరోజు దేశ వ్యాప్తంగా జాతీయ చేనేత దినోత్సవం (National Handloom Day 2023) ఘనంగా నిర్వహించుకుంటున్నాం. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ చేనేత కార్మికులతో ఆన్ లైన్ వేదికగా మాట్లాడనున్నారు. ఇందుకోసం కేంద్ర జౌళి శాఖ ఆధ్వర్యంలో 3 ప్రత్యేక బృందాలు దేశ వ్యాప్తంగా చేనేతకు ఫేమస్ అయిన ప్రాంతాల్లో పర్యటించాయి. దేశంలోని 75 మంది చేనేత కార్మికులు, ఉత్పత్తిదారులతో ప్రధాని మోదీ ఇంటరాక్ట్ కానున్నారు.
చేనేత కార్మికులు, ఉత్పత్తిదారులను ఎంపిక చేయడంలో భాగంగా ఓ టీమ్ మంగళగిరికి వచ్చింది. చేనేత కార్మికులు కోసం నిర్మిస్తున్న మగ్గం షెడ్లు, చేనేత భవన సముదాయాన్ని కేంద్ర జౌళి శాఖ నుంచి వచ్చిన టీమ్ క్షుణ్ణంగా పరిశీలించింది. చేనేత కార్మికులకు ఏపీ ప్రభుత్వం అందిస్తున్న చేనేత నేస్తం పథకం అమలు, లబ్ది జరిగే తీరుపై అధికారులు ఆరా తీశారు. మంగళగిరిలో పెద్ద సంఖ్యలో చేనేత కార్మికులు ఉండటం, ప్రాచీన కళ, సంప్రదాయాన్ని కాపాడే ప్రయత్నం జరుగుతుందని భావించిన టీమ్ మంగళగిరి నేతన్నను ప్రధాని మోదీతో ఇంటరాక్షన్ కోసం ఎంపిక చేయడం విశేషం. దేశంలోని మిగతా నియోజకవర్గాల తరహాలోనే మంగళగిరికి సంబంధించి చేనేతన్నలతో ప్రధాని మోదీ వర్చువల్ భేటీ గురించి కేంద్ర జౌళి శాఖ స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి సమాచారం అందించింది. కార్యక్రమం వివరాలు తెలిపింది.
తన నియోజకవర్గానికి చెందిన నేత కార్మికులతో ప్రధాని మోదీ ఆన్ లైన్‌లో మాట్లాడేందుకు మగ్గం షెడ్ల ప్రాంగణాన్ని రెడీ చేయాలని ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి యోచిస్తున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. మంగళగిరిలోని చేనేత కార్మికులను ఎంపిక చేసి ప్రధాని మోదీతో మాట్లాడేందుకు పేర్లు కేంద్ర జౌళిశాఖకు పంపించాలని అధికారులకు సూచించారు. ఏపీ చేనేత కార్మికుడు, అందులోనూ తన నియోజకవర్గానికి చెందిన వ్యక్తితో రాష్ట్రానికి గుర్తింపుగా భావిస్తున్నారు.
2015లో ఆగస్టు 7న చెన్నైలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ జాతీయ చేనేత దినోత్సవాన్ని ప్రారంభించారు. జాతీయ చేనేత లోగోను ఆవిష్కరించడంతో పాటూ ఆగస్టు 7వ తేదీని జాతీయ చేనేత దినోత్సవంగా ప్రకటించి ప్రతి ఏడాది ఘనంగా నిర్వహిస్తున్నారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial