అమరావతి: భారత ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. రాజధాని అమరావతి రానున్న ప్రధాని మోదీ దాదాపు లక్ష కోట్ల రూపాయల పలు అభివృద్ధి పనులకు ప్రారంభం, శంకుస్థాపన చేయనున్నారు. పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ అమరావతి పునఃప్రారంభ పనులకు శ్రీకారం చుట్టనున్నారు. దాదాపు రూ.49,040 కోట్ల అమరావతి ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. 

పైలాన్ ఆవిష్కరించనున్న ప్రధాని మోదీ 

ఏపీ రాజధాని అమరావతి పునఃప్రారంభ కార్యక్రమానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. చరిత్రలో నిలిచిపోయేలా అమరావతి పునః ప్రారంభ కార్యక్రమం నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా శుక్రవారం మధ్యాహ్నం 3.25 నిమిషాలకు కార్యక్రమం ప్రారంభం కానుంది. అమరావతి పనుల పునః ప్రారంభానికి సూచికగా ప్రధాని మోదీ పైలాన్  ఆవిష్కరించనున్నారు. 

రాష్ట్రం నలుమూలల నుంచి ప్రధాని మోదీ పాల్గొనే సభకు 5 లక్షల మంది హాజరయ్యేలా విస్తృత ఏర్పాట్లు చేశారు.  ఈ సభకు 29 గ్రామాల ప్రజలు, రైతులను ఏపీ ప్రభుత్వం ఆహ్వానించింది. గురువారం రాత్రి 10 గంటలకు సభా వేదిక వద్ద ఏర్పాట్లను మంత్రి నారాయణ మరోసారి పరిశీలించారు. నేటి కార్యక్రమాన్ని చూసేందుకు తరలి వచ్చే వారి కోసం 3531 ఆర్టీసీ బస్సులు, 4050 ప్రైవేటు వాహనాలు ఏర్పాటు చేసినట్లు సమాచారం. దూరప్రాంతం నుంచి వచ్చే వాహనాలకు ఇద్దరు డ్రైవర్లు ఉండేలా చర్యలు తీసుకున్నారు. 

అసలే వేసవికాలం కావడంతో ప్రధాని మోదీ సభకు వచ్చే వారి కోసం ఆహారం, తాగునీరు, ORS సిద్ధం చేశారు. మొత్తం 8 మార్గాల ద్వారా రాజధాని అమరావతి ప్రాంతానికి చేరుకునేలా రూట్ మ్యాప్ రూపొందించారు. 11 చోట్ల విశాలమైన పార్కింగ్ ప్రాంతాలు ఏర్పాటు చేశారు. ఒకవేళ నేడు అనుకోకుండా వర్షం పడినా, వచ్చిన ప్రజలు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ పార్కింగ్ ప్రాంతాలు కూడా అందుబాటులో ఉంచారు. 

ప్రధాని మోదీ అమరావతి పర్యటన షెడ్యూల్-  ప్రధాని మోదీ నేటి మధ్యాహ్నం 2.55 గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. ప్రధాని మోదీకి ఏపీ మంత్రులు, కూటమి నేతలు ఘన స్వాగతం పలకనున్నారు. 

-  ఎయిర్‌పోర్ట్ నుంచి హెలికాప్టర్ లో అమరావతి సచివాలం వద్ద ఉన్న హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. ప్రధాని మోదీకి ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘన స్వాగతం పలుకుతారు.

- మధ్యాహ్నం 3.30 గంటలకు అమరావతి పునర్ నిర్మాణ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొని పలు ప్రాజెక్టుల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. 

- గంటా 15 నిమిషాల పాటు బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొంటారు. అనంతరం సాయంత్రం 4.55 గంటలకు హెలికాప్టర్ ద్వారా గన్నవరం విమానాశ్రయానికి  చేరుకుంటారు.

- గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి ప్రధాని మోదీ ఢిల్లీకి బయలుదేరతారు.

అమరావతి: ఏపీ పర్యటనకు రానున్న ప్రధాని మోదీ రాష్ట్ర అసెంబ్లీ, శాశ్వత సచివాలయం, హైకోర్టు భవనాలకు శంకుస్థాపన చేస్తారు. వాటితో పాటు మంత్రులు, రాష్ట్ర ఎమ్మెల్యేల గృహ సముదాయాలకు, ఆలిండియా సర్వీసెస్ అధికారుల నివాస సముదాయానికి సైతం ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. అమరావతి పనులతో పాటు ఇతర రూ.57,962 కోట్ల కేంద్ర ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టనున్నారు.  

నాగాయలంకలో మిసైల్ టెస్ట్ రేంజ్‌కు, విశాఖలో యూనిటీ మాల్‌కు శంకుస్థాపన, రూ.3,680 కోట్ల నేషనల్ హైవే పనులను తన పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. వీటితో పాటు ఖాజీపేట–విజయవాడ 3వ లైన్ ప్రారంభం, గుంటూరు–గుంతకల్ డబ్లింగ్ ప్రాజెక్టు పనులు ప్రారంభించనున్నార. ప్రధాన మోదీ అమరావతి పర్యటన సందర్భంగా విజయవాడ సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి తెచ్చారు. ఎవరు ఏ రూట్‌లో వెళ్లాలి అనేది విజయవాడ సీపీ వాహనదారులకు సూచించారు.