ఆంధ్రప్రదేశ్ సీఐడీ చీఫ్ సంజయ్, అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డిపై చర్యలు తీసుకొనేలా ఆదేశించాలని ఏపీ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు అయింది. వారు ఇద్దరి తీరుపైన ఓ ఎన్‌జీవో నిర్వహకుడు కోర్టుకు వెళ్లారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసు దర్యాప్తు దశలో ఉండగా సంజయ్, పొన్నవోలు సుధాకర్ రెడ్డి పలుసార్లు ప్రెస్ మీట్లు పెట్టారని స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు సత్యనారాయణ ఆరోపించారు. ఈ ప్రెస్ మీట్ ల వల్ల ప్రజాధనం దుర్వినియోగం అయిందని సత్యనారాయణ తరఫు న్యాయవాది కోర్టులో వాదించారు. ఆర్టీఐ ద్వారా వివరాలు అడిగినా ఇవ్వట్లేదని కోర్టుకు వెల్లడించారు. కోర్టు పర్మిషన్ తో మరోసారి ఆర్టీఐ ద్వారా వివరాలు సేకరించాలని.. వారి ప్రెస్ మీట్ ల వల్ల ఎంత మేర ప్రజాధనం ఎంత వృథా అయిందో బయటకు చెప్పాలని హైకోర్టు ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను హైకోర్టు వచ్చే వారానికి వాయిదా వేసింది.
చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టు అయిన తర్వాత ఆ కేసు వివరాల గురించి ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్, అడిషనల్ అడ్వకేట్ జనరల్ కలిసి మీడియా సమావేశాలు నిర్వహించారు. అమరావతిలోనే కాక, హైదరాబాద్‌లో, ఢిల్లీలో కూడా ప్రెస్ మీట్లు పెట్టారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబుపై ఉన్న ఆరోపణలను వివరించారు.