ఉగ్రనరసింహుని సన్నిధి సాక్షిగా జనసేన అధినేత యుద్ధం ప్రకటించారు. చావో రేవో తేల్చుకుంటానని శపథం కూడా చేశారు. అధికారంలోకి రాగానే అభివృద్ధి ఆ తర్వాత వైసీపీ గుండాల తాట తీసే పనిలో ఉంటానని ప్రకటించారు. పవన్‌లోని ఆ ఫ్రస్టేషన్‌కి కారణమేంటి ? ఈ ఆగ్రహం అధికారపార్టీకి ఆయుధమా లేదంటే అశనిపాతమా అన్నదే ఇప్పుడు రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.


పవన్‌ మాటల్లో చేతల్లో ఆవేశం కనిపించడం మాములే. కానీ ఈసారి మాత్రం పక్కగా డిసైడ్‌ అయి రంగంలోకి దిగినట్లు కనిపిస్తోంది. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో పవన్‌ కల్యాణ‌్‌లో ఆవేశం కన్నా ఆగ్రహం అంతకుమించిన కసి కనిపించాయి. ముఖ్యంగా వైసీపీలోని కొంత మంది నేతల తీరుపై పవన్‌ ఉగ్రరూపం చూపించారు. బూతు రాజకీయాలు చేసే వారికి బూతులతో సమాధానం చెప్పాలనుకున్న జనసేన అధినేత కూడా సన్యాసుల్లారా, వెధవల్లారా అని మాట్లాడటమే కాదు యుద్ధానికి రెడీ అని ప్రకటించారు కూడా.


ఉత్తరాంధ్ర, రాయలసీమ వెనకబాటు తనానికి రాజకీయనేతలే కారణమని ఆరోపిస్తూనే కులాలు, మతాల గురించి సరిగ్గా తెలియని వెధవలంతా కులాలను అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు పవన్.  పవన్‌కి క్లారిటీ లేదు..పవన‌్‌కి రాజకీయం తెలియదు, పవన్‌కి నిబద్ధత లేదు, పవన్‌ ఓ ప్యాకేజీ స్టార్‌, మూడు పెళ్లిళ్ల నిత్య పెళ్లికొడుకు, పావలా స్టార్‌ అన్న వైసీపీ విమర్శలపై తీవ్రంగా స్పందించారు. తాను మూడు పెళ్లిళ్లు చేసుకుంటే మీరు 30మందిని స్టెపినీలుగా ఉంచుకున్నారని ఎద్దేవా చేశారు. తాను విడాకులు తీసుకొని వాళ్లకి కోట్ల రూపాయల భరణం ఇచ్చి మళ్లీ మూడు పెళ్లి చేసుకుంటే మీకొచ్చిన బాధేంటని ప్రశ్నించారు. 


బీజేపీతో పొత్తుపై వస్తున్న విమర్శలకు కూడా క్లారిటీ ఇచ్చారు. బీజేపీతో స్నేహం ఉన్నా కలిసి పోటీ చేసే ఆలోచన లేదని స్పష్టం చేశారు.  వచ్చే ఎన్నికల్లో జనసేన ఏపీలోనే కాదు తెలంగాణలో కూడా బరిలోకి దిగుతుందని ప్రకటించారు. నిన్నటి వరకు సహనం, మంచితనం చూసిన పవన్‌లోని మాస్‌ యాంగిల్‌ ఎలా ఉంటుందో ఏపీలోని వైసీపీ గుండాలు, క్రిమినల్స్‌, ఎమ్మెల్యేలకు చూపిస్తానని హెచ్చరించారు. రాడ్‌ కి రాడ్‌ తో, కర్రకి కర్రతోనే బదులిస్తామని ఇక అధికారపార్టీ అంతుచూస్తామని పవన్‌ యుద్ధానికి సమరసంఖం పూరించారు.


ఈ రోజు నుంచి జనసేన వ్యూహం, జనసేన దెబ్బ ఎలా ఉంటుందో అధికారపక్షానికి చూపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వైసీపీ నిర్వహించే సమావేశాలకు వెళ్లి తప్పుని ప్రశ్నించమని సూచించారు. అధికారపార్టీ నేతలు చేయి చేసుకుంటే చెప్పుతో సమాధానం చెప్పాలని హింట్‌ ఇస్తూనే మరోవైపు పోలీసులకు కూడా హెచ్చరిక చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అటు వైసీపీ నేతల తాట తీయడమే కాదు ఖాకీల కండకావరాన్ని కూడా తగ్గిస్తానని హెచ్చరించారు.


వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ కాకుండా చేయడానికి జనసేన సిద్ధంగా ఉందని అయితే ఉద్యోగులు ముందుకు రావడమే కాదు అనుకున్నది సాధించే వరకు పోరాటాన్ని కొనసాగించాలన్నారు. అధికారానికి భయపడో, పార్టీలు ప్రలోభపెడితేనో మధ్యలో పోరాటం నుంచి తప్పుకుంటే మాత్రం జనసేన మద్దతు ఉండదని ముందుగానే స్పష్టం చేశారు.


ఏపీలో ఎన్నికలకు దాదాపు రెండేళ్ల సమయం ఉండగానే జనసేన అధినేత యుద్ధానికి సై అని ప్రకటించడం రాజకీయవర్గాల్లో ఆసక్తిని రేపుతోంది.