వినాయక చవితి ఉత్సవాలపై నిషేధం ఎందుకు విధించారో చెప్పాలంటూ అడుగుతున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఈ నిర్ణయం నిజంగా తనకు అర్థం కావడం లేదన్నారాయన. కొన్ని వేల సంవత్సరాలుగా సంస్కృతి సంప్రదాయాలు, ధర్మానికి ముడిపడి ఉన్న వినాయక చవితి పండగకు అడ్డంకులేంటని నిలదీస్తున్నారు. కోవిడ్ నిబంధల వల్ల అనుమతులు ఇవ్వలేకపోతున్నాం అని చెప్పడం నమ్మశక్యంగా లేదంటూ అనుమానం వ్యక్తం చేశారు. కోవిడ్ నిబంధనలు కేవలం వినాయక చవితి పండగకు మాత్రమే వర్తిస్తాయా? వైసీపీ ప్రజా ప్రతినిధులు, వారి కుటుంబ సభ్యుల పుట్టిన రోజులకు, పండగలకు, పబ్బాలకు వర్తించవా? అంటు ప్రశ్నించారు పవన్ కల్యాణ్. 


ప్రతిపక్షంపైనే కేసులా?


ప్రతిపక్షాలు ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తామంటే మాత్రం కోవిడ్ నిబంధనలు గుర్తొస్తాయా? కోవిడ్ నిబంధనలు దేనికి వర్తిస్తాయి? దేనికి వర్తించవు అనేది ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వమే డిసైడ్ చేస్తోందని ఘాటుగా విమర్శించారు పవన్‌. పక్క రాష్ట్రాలు వినాయక చవితి పూజలకు షరతులతో కూడిన అనుమతులు ఇస్తుంటే ఏపీలో మాత్రం పండుగే చేసుకోవద్దని చెప్పడమేంటని మండిపడ్డారు.


విగ్రహాలు అమ్మేవారిపైన కేసులా?
గణపతి విగ్రహాలను అమ్మే వ్యక్తులను అరెస్టు చేయడం, విగ్రహాలు తీసుకుపోవడం చూస్తుంటే పాలకులు దేని మీద దాడి చేస్తున్నారో ఆలోచించుకోవాలన్నారు జనసేన అధినేత. భారతదేశంలో ఏ పని మొదలుపెట్టినా ముందుకు నమస్కరించేంది గణపతికేనన్న సంగతి మర్చిపోతే ఎలా అని గుర్తు చేశారు. విఘ్నాధిపతికి నమస్కారం చేసుకొనే  ఏ పనైనా మొదలుపెడతామని అలాంటి గణపతి పండగను జరుపుకోవద్దు అంటున్నారంటే ఎలా అర్థం చేసుకోవాలని అసహనం వ్యక్తం చేశారు.


ఆ దోషులనే పట్టుకోలేదు


 గతంలో కూడా విగ్రహాలను అపవిత్రం చేసినా, రథాలను కాల్చేసినా, శ్రీరాముడి విగ్రహానికి తలతీసేస్తే ఇప్పటి వరకు దోషులను పట్టుకోలేదని పవన్ కల్యాణ్ విమర్శించారు. వారిని పట్టుకోకపోగా, కొత్తగా వినాయక చవితి జరుపుకోవద్దు అని నిబంధనలుపెట్టడం దేనిని సూచిస్తున్నాయని ప్రశ్నించారు. 


ఆంక్షలు వెనక్కి తీసుకోండి


జగన్ ప్రభుత్వానికి సలహాలు చెప్పేది ఎవరని నిలదీశారు జనసేనాని. దేని మీద దాడి చేస్తున్నాయో అర్ధమవుతుందా? అని ప్రశ్నించారు. ఒక్కసారి వైసీపీ పెద్దలు అందరూ కూర్చొని ఆలోచించుకోవాలని పవన్ సలహా ఇచ్చారు. ఎవరి సలహాలు ఎలా ఉన్నా.. వినాయక చవితిపై విధించిన ఆంక్షలు వెంటనే వెనక్కి తీసుకోవాలని పవన్ కల్యాణ్ డిమాండ్‌ చేశారు. పక్క రాష్ట్రాలు ఎలాంటి పరిమితులతో అనుమతులు ఇచ్చాయో ఆంధ్రప్రదేశ్‌లో కూడా అదే పరిమితులతో పర్మిషన్లు ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. ఇది విశ్వాసానికి సంబంధించినది కాబట్టి అలా ఇస్తేనే మంచిదని... జరిగిన తప్పు ఏదో జరిగిపోయింది ఇంతకుమించి గొడవ చేయకుండా పర్మిషన్లు ఇవ్వాలని సలహా ఇచ్చారు. 


రోడ్లు పట్టించుకోరుగానీ.. ఎయిర్‌పోర్టులు బాగు చేస్తారా?


రాష్ట్రంలో రహదారుల అధ్వాన్న పరిస్థితిపై ప్రజల నుంచి ఉవ్వెత్తున నిరసన రావడంతో దాని నుంచి తప్పించుకోవడానికి మేకపోతు గాంభీర్యంతో ఎయిర్ పోర్టులు, పోర్టులను అభివృద్ధి చేస్తున్నాం అంటూ సమీక్షలో కలిపారు తప్ప ఇంకేం లేదని ఎద్దేవా చేశారు పవన్ కల్యాణ్. జనసేన పిలుపు మేరకు లక్షల మంది స్పందించి రోడ్ల దుస్థితి కళ్లకట్టినట్టు తెలిపారని తెలిపారు. ఇప్పుడు ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఒకటైన రోడ్ల దుస్థితిపై మాట్లాడాలని డిమాండ్ చేశారు. సొంతిల్లు చిమ్ముకోవడానికి చీపురు లేదుగానీ పక్కిళ్లు చిమ్మేస్తాం.. కల్లాపు చల్లేస్తాం.. ముత్యాల ముగ్గులు పెట్టేస్తాం అన్న చందంగా జగన్ ప్రభుత్వం పరిస్థితి ఉందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు పవన్. పోర్టులు, ఎయిర్ పోర్టులు మెజార్టీ శాతం ప్రైవేటుపరం అయిపోయాయని... ఆంధ్రప్రదేశ్‌లోని దాదాపు ప్రతి పెద్ద పోర్టు కూడా ప్రైవేటు కంపెనీల చేతుల్లోనే ఉందని గుర్తు చేశారు. అక్కడ బెర్తులు నిర్మించాలన్న, అభివృద్ధి చేయాలన్నా వాళ్లు చూసుకుంటారని.. వాటి అభివృద్ధిలో రాష్ట్ర ప్రభుత్వం పాత్ర నామ మాత్రమేనని గుర్తు చేశారు. ఎయిర్ పోర్టులను కూడా దాదాపు ఎయిర్ పోర్టు అథారటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నడుస్తాయని.. లేదా ప్రైవేటు సంస్థలు నడుపుతాయని పేర్కొన్నారు. అక్కడ రన్‌వేలు వాళ్లు చూసుకుంటారు. అంతే తప్ప రాష్ట్రప్రభుత్వానికి ఏం సంబంధమని నిలదీశారు. ముందు రాష్ట్రంలోని రోడ్లపై దృష్టి పెట్టాలని హితవుపలికారు. 


ట్యాక్స్‌, సెస్‌ వసూళ్లు ఏమవుతున్నాయి?


రోడ్ల దుస్థితిపై చేస్తున్న సమీక్షలో ఎయిర్‌పోర్టులు, ఓడరేవులు దూర్చడం చాలా నవ్వు తెప్పించే అంశంగా పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ప్రజల వద్ద వసూలు చేస్తున్న ట్యాక్సులు, సెస్‌లు ఎక్కడికి వెళ్తున్నాయని.. రోడ్ల అభివృద్ధికి వెళ్లాల్సిన నిధులు ఏ కార్యక్రమాలకు ఖర్చు చేస్తున్నారని నిలదీశారు. రోడ్లు బాగాలేక వైసీపీ లీడర్లే ప్రజల వద్దకు వెళ్లడం లేదని ఎద్దేవా చేశారు.  మంత్రులు చెప్పినట్టు అద్భుతాలే చేసిందీ ప్రభుత్వం.. చిన్న గోతులను పెద్ద గొయ్యిలుగా... గొయ్యిల్ని కాలువలుగా మార్చేశారంటూ సెటైర్లు వేశారు పవన్. 


అప్పుడే ఎందుకు చేయలేదు?


ఇంత సమస్య ఉంటే.. వచ్చే వర్షాకాలం నాటికి రోడ్లు వేస్తామంటూ మరో తప్పుడు ప్రకటనలు ఇస్తున్నారని.. అదేదో గత అక్టోబర్‌లోనే చేసి ఉండొచ్చు కదా అని నిలదీశారు జనసేన అధినేత. రోడ్లు సమస్య కొత్తగా ఇప్పుడొచ్చింది కాదని... నివర్ తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనకు వెళ్లినప్పుడే రోడ్లు ఎంత దారుణంగా దెబ్బ తిన్నాయో చూశానన్నారు. గ్రామాల్లో లింకు రోడ్లు చూస్తే పరిస్థితి ఎంత దిగజారిందో అర్ధమవుతుందన్నారు పవన్.  


రోడ్లు మృత్యుద్వారాలుగా మారాయన్న పవన్... జనాలను చంపడానికి రెడీగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బండి పది కిలోమీటర్లు వెళ్లొస్తే చాలు రిపేరు చేయించుకోవాల్సిన దుస్థితి వచ్చిందన్నారు. ఎంత ఖర్చు అవుతుందో ఆలోచించుకోవాలని.. అక్టోబర్ నెలలో టెండర్లు పిలుస్తామంటున్న ముఖ్యమంత్రి... పాత బకాయిల సంగతేంటని ప్రశ్నించారు. ఇలాంటి పరిస్థితుల్లో అక్టోబర్ నుంచి ఎలా పనులు మొదలుపెడతారో చూద్దామన్నారు. తామైతే పోరాటం ఆపబోమని... ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటామన్నారు.