Pawan Kalyan Reacts On ACB Court Remands Chandrababu for 14 days:


ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు తన మద్దతు ఎప్పటికీ ఉంటుందన్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. గతంలో విశాఖలో నోవాటెల్ లో తనను ఉంచిన ఘటనపై చంద్రబాబు మద్దతు తెలిపారని, అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేసిన సమయంలో తాను మద్దతు తెలిపానన్నారు. అది తన సంస్కారం అన్నారు. మంగళగిరి కార్యాలయంలో పవన్ మీడియాతో మాట్లాతుడూ.. తాను పార్టీ పనులు, మీటింగ్ కోసం ఏపీకి వస్తుంటే పోలీసులు తనను అడ్డుకోవడంపై మండిపడ్డారు. చంద్రబాబుకు తాను మద్దతు తెలిపితే, నేరుగా వెళ్లి టీడీపీ అధినేతను కలుస్తానని వాళ్లే ఊహించుకుని తనకు అడ్డంకులు కలిగించడం తప్పు కాదా అని ఏపీ ప్రభుత్వాన్ని, పోలీసులను ప్రశ్నించారు.



పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమలాపురంలో కోనసీమలో తన వారాహి యాత్రలో 2 వేల మంది కిరాయి సైన్యాన్ని , క్రిమినల్స్ ను సీమ జిల్లాల నుంచి రప్పించారని ఆరోపించారు. జనంలో కలిసిపోయి కనీసం 50 మందిని చంపాలని వారికి టార్గెట్ ఇచ్చారని సంచలన విషయాలు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఇంటెలిజెన్స్ కు సమాచారం తెలియడంతో.. ఇలాంటి పనులు మానుకోవాలని హెచ్చరించడంతో వాళ్లు కొంతమేరకు తగ్గారని చెప్పారు. అయినప్పటికీ తణుకులో, భీమవరంలో ఇలాంటి అవాంఛనీయ ఘటనలు చేశారని చెప్పారు. వారాహి యాత్ర జరుగుతున్నన్ని రోజులు కిరాయి గూండాలు తమను, ప్రజల్ని టార్గెట్ చేశారని చెప్పుకొచ్చారు. ప్రశ్నించే గొంతు ఉండొద్దని వైసీపీ శ్రేణులు ఈ దారుణమైన చర్యలకు దిగుతున్నాయని మండిపడ్డారు.


వారాహి నాల్గో విడత కృష్ణా జిల్లాలో ప్రారంభిస్తామన్నారు. తన సభలకు లక్షలాది మంది వచ్చినా, రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయలేదన్నారు. ఓ పార్టీ అధ్యక్షుడిని అయినా, తనను పోలీసులు అడ్డుకున్నారని.. ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లిందన్నారు. 16 నెలలు జైల్లో ఉన్న జగన్, రిచెస్ట్ సీఎం తమను పరిపాలిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. నేర చరిత్ర ఉన్న వ్యక్తులు, ఇతర నేతల్ని అరెస్ట్ చేయాలని ఆశపడతారని ఎద్దేవా చేశారు. పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేశారని, వాళ్లపై ఒత్తిడి ఉంటుందన్నారు. 


అమెరికా లాంటి అగ్రదేశాల నేతలు హాజరైన జీ20 సదస్సు ఢిల్లీలో జరుగుతున్న సమయంలో చంద్రబాబును ఉద్దేశపూర్వకంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు. ప్రతిపక్ష నేతల్ని అరెస్ట్ చేపిస్తుంటే, మన గడ్డ మీదకే నేతల్ని రాకుండా చేయడం ఏపీలో పాలనకు నిదర్శనం అన్నారు. ఓ విషయంపై ప్రశ్నించిన లాయర్ పై సైతం హత్యాయత్నం కేసు పెట్టారని గుర్తుచేశారు. చిన్నాన్న హత్య కేసులో సైతం ప్రత్యక్షంగా విచారణకు హాజరుకాకుండా వారికి పర్మిషన్ లభిస్తుందని, కానీ మనకు మాత్రం సాక్ష్యాలు లేకున్నా అరెస్ట్ చేపిస్తారండూ మండిపడ్డారు. 


దశాబ్దాల పాటు రాజకీయాలు చేసిన చంద్రబాబును అడ్డుకుంటారు, సెలబ్రిటీ అయిన తను విమానంలో రానివ్వరు, రోడ్డు మార్గంలో అడ్డుకుంటారు. హోటల్లోనే కూర్చోవాలని ఎందుకు శాసిస్తున్నారని ప్రశ్నించారు. మద్యపాన నిషేధం చేయడం లేదని ప్రభుత్వాన్ని నిలదీయాలని సూచించారు. రూపాయి కోసం జనం ఇంత కష్టపడుతుందే వీళ్లు మద్యపానంతో కోట్లు సంపాదిస్తున్నారని, రాష్ట్రానికి ఇవి చీకటి రోజులన్నారు.  వైసీపీ వ్యతిరేక ఓటు చీల్చాలని, లేకపోతే అధికారం కోల్పోతామని భయపడుతున్నారని చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం హోం మంత్రి అమిత్ షాతో సైతం తాను మాట్లాడనని, మన సమస్యలపై పోరాటం కొనసాగించాలని వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు.