జనసేన పార్టీ త్రిముఖ పోటీలో బలి కావడానికి సిద్ధంగా లేదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఇంకోసారి తాను ఓడిపోవడానికి కూడా రెడీగా లేనని అన్నారు. కచ్చితంగా పొత్తు పెట్టుకుంటామని చెప్పారు. అంతా గౌరవంగా ఉండి, అన్ని పద్ధతులు బావుంటే కచ్చితంగా జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తు పెట్టుకుంటాయని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి అవుతామా లేదా అనేది ఎన్నికలు అయిపోయి ఫలితాలు వచ్చాక సంగతి అని అన్నారు. అంత బలమైన మెజారిటీ ఇచ్చి, మనం పోటీ చేసిన స్థానాల్లో అత్యధిక ఓట్లు వస్తే మనం మాట్లాడేందుకు హక్కు ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం ప్రత్యర్థిని దించడమే తన ప్రైమరీ టార్గెట్ అని అన్నారు. జనసేన పార్టీ మండల, పట్టణ, డివిజన్ అధ్యక్షులతో పవన్ కల్యాణ్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి పవన్ కల్యాణ్ ప్రసంగించారు.
పొత్తు పెట్టుకోవడం అనేది పార్టీ ఎదుగుదలకు తోడ్పడుతుందని, దాన్ని తక్కువ అంచనా వేయవద్దని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. తాను ఎమ్మెల్యేలను ఇవ్వలేనప్పుడు సీఎం పదవి అడగలేనని అన్నారు. పొత్తులో ముఖ్యమంత్రి పదవి అనేది ఫలితాల తర్వాత బలాబలాలు, సమీక్షలు చేసి అప్పుడు నిర్ణయించేదని అన్నారు. ప్రస్తుతం ముందున్న లక్ష్యం వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపి, కూటమిని గద్దె ఎక్కించడం అని చెప్పారు.
జూన్ నుంచి తిరుగుతా
డిసెంబరులో ఎన్నికలు వస్తాయని, ఇకపై తాను జూన్ నుంచి పూర్తిగా ఎన్నికలు లక్ష్యంగానే తిరుగుతానని చెప్పారు. పవన్ కల్యాణ్ సీఎం కావాలని కలల్లో ఉండొద్దని కోరారు. గాల్లో మేడలు కట్టవద్దని చెప్పారు. జనసేన ప్రభుత్వం ఏర్పడాలని తాను కలలు కన్నానని, అందరికీ ఒక అవకాశం ఇచ్చానని అన్నారు. తనను చంద్రబాబు నాయుడు మోసం చేస్తారని అంటున్నారని, ఏ వ్యూహాలు లేకుండా ఇంత దూరం వచ్చేస్తామా అని అన్నారు. కాపులను వైఎస్ఆర్ సీపీ నాయకులు తిట్టినప్పుడు కాపులు వారికి ఎందుకు ఓట్లు వేశారని ప్రశ్నించారు. ఏపీకి ఇప్పుడు కావాల్సింది మంచి నాయకులు కాదని, ప్రజల్లోనే పరివర్తన రావాలని పిలుపు ఇచ్చారు.
వైఎస్ఆర్ సీపీనే ప్రత్యర్థి
‘‘రాష్ట్రానికి ద్రోహం చేస్తున్న వ్యక్తి అధికారంలో ఉంటే అతణ్ని తీసేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉంది. అతను అడ్డగోలుగా సంపాదించి ఆ డబ్బులతో గూండాలను, అధికారులను కొనేసిన వ్యక్తి. ఇంకోసారి అతను సీఎం అయితే ఆంధ్రప్రదేశ్ జీవితంలో కోలుకోలేదు. ఇతను హెలికాప్టర్‌లో వెళ్తుంటే పచ్చని చెట్లను కొట్టించే వ్యక్తి. ఏ కులానికి మంచి చేశాడో చెప్పండి? నాకు ఏ వ్యక్తి మీదా, ఏ పార్టీ మీదా ద్వేషం లేదు. ఇప్పుడు వైఎస్ఆర్ సీపీపైన కూడా లేదు. ఆ ప్రభుత్వం రాష్ట్రానికి ద్రోహం చేస్తుంది కాబట్టి, ప్రత్యర్థి వైఎస్ఆర్ సీపీనే. అందుకే మా ముందున్న కర్తవ్యం వైఎస్ఆర్ సీపీని దింపేయడమే’’ అని పవన్ కల్యాణ్ అన్నారు.