Janasena Party Meeting | మంగళగిరి: ‘ప్రజా ప్రతినిధులుగా అందరం యువత, మహిళల ఆకాంక్షలను అర్థం చేసుకోవడం చాలా అవసరం. ఆయా వర్గాల అభివృద్ధి, సంక్షేమం, రక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి’ అని జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) స్పష్టం చేశారు. ఉపాధి, ఉద్యోగావకాశాల కల్పన, రహదారుల నిర్మాణం, అభివృద్ధి, రక్షిత తాగునీటి సరఫరా, పారిశుధ్య నిర్వహణ, డంపింగ్ యార్డుల ఏర్పాటు అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వీటికి అవసరమైన ప్రాజెక్టులు సాధన, నిధులు సమీకరణపై ప్రతి శాసన సభ్యుడు అధ్యయనం చేసి ప్రభుత్వం ముందుకు రావాలని సూచించారు. శనివారం రాత్రి మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన పార్టీ శాసన సభా పక్ష సమావేశాన్ని నిర్వహించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. పాలన, రాజకీయపరమైన అంశాలపై దిశానిర్దేశం చేశారు.
ప్రజా ప్రతినిధులు 5 నియోజకవర్గాల చొప్పున..
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ “ప్రతి ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ 5 నియోజకవర్గాల చొప్పున బాధ్యత తీసుకొని పార్టీ శ్రేణులతో మమేకం కావాలి. జన సైనికులు, వీర మహిళలకు భరోసా కల్పించే దిశగా అడుగులు వేయండి. ఈ క్రమంలో వారితోపాటు ఆయా నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించండి. తద్వారా ప్రభుత్వ పథకాల అమలు, లబ్ధిదారులకు సంక్షేమం ఏ విధంగా చేరుతుందీ, అక్కడి యువతకు స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఏ విధంగా కల్పించాలి, మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడం లాంటి విషయాలపై దృష్టి సారించండి. అదే సందర్భంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కల్పిస్తున్న రహదారుల కల్పన, ఇతర మౌలిక సదుపాయాలను పరిశీలించాలి. కూటమి ప్రభుత్వం ద్వారా చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తెలియచేయాలి. ఉపాధి, ఉద్యోగావకాశాల కల్పన, రహదారుల అభివృద్ధి, రక్షిత తాగునీటి సరఫరా, పారిశుధ్య నిర్వహణ, డంపింగ్ యార్డుల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించాలి. ఇందుకోసం శాసన సభ పక్షం నుంచే ఒక్కో అంశంపై ఒక్కో కమిటీ వేసుకొందాము. ఆరు వారాల్లోగా ఆయా కమిటీలు నివేదికలు అందించాలి.
నవతరం రాజకీయ, సామాజిక ఆలోచనలు తెలుసుకోవాలి జనసేన పార్టీకి మిలీనియల్స్ బలంగా నిలిచారు. అదే క్రమంలో వారి ఆకాంక్షలు గ్రహించాలి. వారితోపాటు ‘జెన్ జీ’ తరంతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ, చర్చిస్తూ ఉండండి. ఈతరంవారి రాజకీయ, సామాజిక ఆలోచనలు అర్థం అవుతాయి. వారు తీసుకొస్తున్న ఆవిష్కరణలు తెలుస్తాయి. వాళ్ళు ప్రతి విషయాన్ని గమనిస్తూనే ఉంటారు. గత ప్రభుత్వం రుషి కొండ ప్యాలెస్ ను ఎలా నిర్మించి, ఎన్ని వందల కోట్లు ప్రజా ధనాన్ని ఖర్చుపెట్టిందీ కూడా నవ తరాన్ని స్పష్టంగా తెలుసు. మనం కచ్చితంగా రుషి కొండ ప్యాలెస్ ను సద్వినియోగపరచడంపై బలంగా దృష్టిపెట్టాలి. నిర్ధుష్ట కాల వ్యవధిలో రుషి కొండ ప్యాలెస్ ను వినియోగంలోకి తీసుకురావడం చాలా అవసరం. ఆ దిశగా ప్రభుత్వానికి మన పార్టీ తరఫున ఆలోచనలు తెలియచేయాలి. జెన్ జి తరం అభివృద్ధికి, వారి ఉపాధి ఉద్యోగావకాశాలకు అవసరమైన వాతావరణాన్ని సృస్టించాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధులపై ఉంది.
మీ నియోజకవర్గాలలో ఉన్న ప్రధాన సమస్యలపై కూలంకషంగా పరిశీలన చేయండి. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో వాటిని చర్చించేందుకు సిద్దంగా ఉండండి. అదే విధంగా మీ నియోజకవర్గాల్లో మీరు అనుసరించిన బెస్ట్ ప్రాక్టీసెస్, సక్సెస్ స్టోరీస్ ను పార్టీ కేంద్ర కార్యాలయానికి తెలియచేయండి. వాటిని సభ ముందుకు తీసుకువెళ్దాము. నియోజకవర్గ, జిల్లా కేంద్రాల్లో జనవాణి కార్యక్రామాన్ని చేపట్టే దిశగా చర్యలు మొదలుపెట్టండి. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలు, వారి బాధలు మరింతగా తెలుస్తాయి.
స్థానిక సంస్థల ఎన్నికల బాధ్యతలుకూటమి పార్టీలపరంగా మీమీ నియోజకవర్గాల్లో మూడు పార్టీల సమన్వయ సమావేశాలు ప్రతి నెలా నిర్వహించాలి. ఆ సమావేశాల్లో కూటమి నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకొనేలా ముందుకు వెళ్ళాలి. ఈ క్రమంలో సమష్టిగా ఆలోచనలు చేసి, ఒక్కటిగా గళం వినిపించాలి. కూటమిని బలపరుస్తూనే మన పార్టీని బలోపేతానికి ప్రణాళికాబద్ధంగా అడుగులు వేయాలి. ఇందుకోసం మన పార్టీ తరఫున త్రిశూల్ వ్యూహాన్ని అమలు చేయాలి. ఇందుకు సంబంధించిన విధివిధానాలు త్వరలోనే మీకు తెలియచేస్తాను. వాటిని ప్రతి ఒక్కరూ క్షేత్ర స్థాయిలో అమలు చేయాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బాధ్యతల విషయంలో చిత్తశుద్ధితో వ్యవహరించాలి. సార్వత్రిక ఎన్నికల్లో మనకు బలం ఉన్న నియోజకవర్గాల్లోనూ పొత్తు ధర్మం ప్రకారం పోటీకి దూరంగా ఉన్నాము. అక్కడి మన కార్యకర్తల మనోభావాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఒక్కొక్కరి అప్పగిస్తున్న అయిదు నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించాలి. పార్టీ శ్రేణులతో మమేకం కావాలి. స్థానిక ఎన్నికల్లో యువతకు, కొత్త నాయకత్వానికి ప్రోత్సాహం ఇవ్వాలి” అన్నారు.
శాసన సభలో అధ్యయనంతో మాట్లాడాలి వర్షా కాల సమావేశాలపై ఈ సందర్భంగా సమీక్షించారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, పౌర సరఫరా శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “ప్రతి శాసన సభ్యుడు తమ నియోజకవర్గ పరిధిలో సమస్యలు, చేపట్టాల్సిన అభివృద్ధి ప్రాజెక్టులపై పక్కగా అధ్యయనం చేయండి. ప్రశ్నోత్తరాలతోపాటు, వేర్వేరు చర్చల్లో వాటిని ప్రస్తావించి సభ ముందుకు తీసుకువచ్చే అవకాశం ఉంటుంది. మన అధ్యక్షులవారు ప్రతి నెలా రెండుమార్లు శాసన సభా పక్ష సమావేశం నిర్వహిద్దాము అని చెప్పారు. ఈ సమావేశాలు మనకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. శాసన సభలో మనం ప్రస్తావించే అంశాలపై ముందుగా మాట్లాడుకొంటే మరిన్ని విషయాలు తెలుస్తాయి” అన్నారు.