TDP Membership Program | అమరావతి: అధికార కూటమిలోని తెలుగుదేశం పార్టీ రికార్డు నమోదు చేసింది. టీడీపీ (TDP) సభ్యత్వ నమోదులో మంగళగిరి చరిత్ర సృష్టించింది. రికార్డు స్థాయిలో మంగళగిరి నియోజకరవర్గంలో సభ్యత్వ నమోదు లక్ష మార్క్ దాటింది. నియోజకవర్గ చరిత్రలోనే ఇది సరికొత్త రికార్డ్ అని టీడీపీ నేతలు చెబుతున్నారు. టీడీపీ శాశ్వత సభ్యత్వాలలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మొదటి స్థానంలో నిలిచింది నారా లోకేష్ ప్రాతినిథ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గం. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేనల కూటమి అఖండ విజయం సాధించిన తరువాత టీడీపీ సభ్యత్వ నమోదు మొదలుపెట్టింది.
మంగళగిరి ప్రజలు స్వచ్చందంగా ముందుకొచ్చి టీడీపీ సభ్యత్వం తీసుకుంటున్నారని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. సభ్యత్వాలు తీసుకున్న సభ్యులకు టీడీపీ నేతలు అభినందనలు తెలిపారు. ఇటీవల 75 వేల సభ్యత్వాలు నమోదు అయిన తరువాత పార్టీ విస్తృత సమావేశంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు ఆయన తనయుడు మంత్రి నారా లోకేష్ ను అభినందించారు. ఈ క్రమంలో రికార్డు స్థాయిలో మంగళగిరిలో టీడీపీ సభ్యత్వాలు తీసుకున్న వారి సంఖ్య లక్ష దాటింది.