అమరావతి: రాష్ట్ర భవిష్యత్తు రాజధాని నిర్మాణంతోనే ముడిపడి ఉంటుందని.. ఇకపై మూడు ముక్కలాటలు ఉండవు.. ఒకే రాష్ట్రం - ఒకే రాజధాని అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అమరావతిని వ్యతిరేకించే శక్తులను ఇక్కడ అడుగుపెట్టనివ్వకూడదని, హైదరాబాద్‌ను మించిన నగరంగా అమరావతిని తీర్చిదిద్దుతామని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం (మార్చి 29న) తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 

దేశానికే రోల్ మోడల్‌గా టీడీపీ సంస్కరణలు, నిర్ణయాలు..

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు అమరావతి ప్రాధాన్యతను నొక్కి చెప్పారు. రాజధాని అమరావతి కోసం రైతులు ఒక్క పైసా ఆశించకుండా భూములు ఇచ్చారని, అది తెలుగుదేశం పార్టీపై వారికి ఉన్న అచంచలమైన నమ్మకానికి నిదర్శనమని చంద్రబాబు పేర్కొన్నారు. 2019లో టీడీపీ విజయం సాధించి ఉంటే, ఈపాటికే అమరావతి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రపంచ స్థాయిలో ఉండేవని ఆయన అభిప్రాయపడ్డారు. గతంలో తాము తెచ్చిన విద్యుత్ సంస్కరణలు, డ్వాక్రా సంఘాల ఏర్పాటు దేశానికే మోడల్‌గా నిలిచాయని, ఇప్పుడు అమరావతి కూడా అదే తరహాలో ఒక గమ్యస్థానంగా మారుతుందని చంద్రాబు చెప్పారు.

పార్టీకి కార్యకర్తలే కీలకం

పార్టీ కోసం ఆస్తులు పోగొట్టుకుని, ప్రాణ త్యాగాలు చేసిన కార్యకర్తలే టీడీపీకి అసలైన బలం అని సీఎం చంద్రబాబు కొనియాడారు. సమర్థంగా పనిచేసే కార్యకర్తలకే పార్టీలో గుర్తింపు ఉంటుందని, వారి త్యాగాలను విస్మరించడం ప్రమాదకరమం అన్నారు.  బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళల జీవితాల్లో వెలుగులు నింపిన పార్టీ ఇదని, సామాన్యులను చట్టసభలకు పంపిన ఘనత స్వర్గీయ ఎన్టీఆర్‌దేనని గుర్తు చేశారు. తెలుగుజాతి ఆత్మగౌరవం కోసం పుట్టిన ఈ పసుపు జెండా నిరంతరం ఎగురుతూనే ఉంటుందని, రాష్ట్రం బలంగా ఉండాలంటే టీడీపీ బలంగా ఉండాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ ఏపీ అసెంబ్లీ తీర్మానం..

ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి పూర్తిస్థాయి చట్టబద్ధత కల్పిస్తూ రాష్ట్ర శాసనసభ చారిత్రక తీర్మానాన్ని మార్చి 28న ఆమోదించింది. గత ప్రభుత్వ హయాంలో వచ్చిన 'మూడు రాజధానుల' ప్రతిపాదనకు స్వస్తి పలుకుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం "ఒకే రాష్ట్రం - ఒకే రాజధాని" విధానాన్ని అధికారికంగా ఖరారు చేసింది. ఈ తీర్మానం ద్వారా అమరావతి కేవలం పరిపాలనా కేంద్రం మాత్రమే కాకుండా, రాష్ట్ర గౌరవానికి చిహ్నమని ప్రభుత్వం స్పష్టం చేసింది.

సభలో తీర్మానాన్ని ప్రవేశపెడుతూ, రాజధాని కోసం భూములిచ్చిన అమరావతి రైతుల త్యాగాలను ప్రభుత్వం కొనియాడింది. హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులను గౌరవిస్తూ, రాజధాని నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తామని హామీ ఇచ్చింది. ఈ తీర్మానం ఆమోదం పొందడంతో, అమరావతిపై నెలకొన్న అనిశ్చితి తొలగిపోయి, పెట్టుబడిదారులకు, ప్రజలకు భరోసా లభించింది. భవిష్యత్తులో రాజకీయ మార్పులు సంభవించినా రాజధాని విషయంలో ఎలాంటి మార్పులు ఉండకూడదనే ఉద్దేశంతో ఈ చట్టబద్ధతకు ప్రాధాన్యత ఇచ్చారు. విభజన చట్టం ప్రకారం ఏపీకి అమరావతే శాశ్వత రాజధాని అని ఈ తీర్మానం ద్వారా పునరుద్ఘాటించారు.