Just In





NTR Vaidya Seva Scheme: ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్, నేటి నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలు పునఃప్రారంభం
Andhra Pradesh News ఆషా కార్యవర్గంతో ఏపీ సీఎం చంద్రబాబు జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. ఏపీలో మంగళవారం నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలు క్యాష్ సేవలు తిరిగి ప్రారంభం కానున్నాయి.

Dr Nandamuri Taraka Rama Rao Vaidya Seva Trust | అమరావతి: ఏపీలో ఎన్టీఆర్ వైద్య సేవలు (ఆరోగ్య శ్రీ సేవలు) నేటి నుంచి యథాతథంగా కొనసాగనున్నాయి. బకాయిలు రూ. 500 కోట్ల తక్షణం విడుదలకు ఏపీ ప్రభుత్వం అంగీకారం తెలిపింది. దాంతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, నెట్‌వర్క్ హాస్పిటల్స్ సమ్మె విరమించాయి. ఎన్టీఆర్ వైద్య సేవలు మంగళవారం నుంచి ఏ ఆటంకం లేకుండా కొనసాగుతాయని పేద ప్రజలకు శుభవార్త చెప్పారు. ఆశా ( ASHA) కార్యవర్గం సోమవారం నాడు రాష్ట్ర ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. దాంతో సమ్మె విరమిస్తున్నట్లు ఆషా టీం ప్రకటించింది.
ఎన్టీఆర్ వైద్య సేవ కింద క్యాష్‌లెస్ సేవలు పునఃప్రారంభం అవుతాయని, ఆపత్‌కాల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చలు ఫలించాయని ఆషా టీమ్ ఓ ప్రకటనలో తెలిపింది. బిల్లులు వేల కోట్లు బకాయి ఉండటంతో నెట్ వర్క్ హాస్పిటల్స్ ఎన్టీఆర్ వైద్య సేవలు అందించడం కుదరంటూ మెడికల్ సర్వీసెస్ నిలిపివేశాయి. దాంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, అత్యవసర పరిస్థితిగా గుర్తించారు. తన బిజీ షెడ్యూల్ మధ్యలోనూ సోమవారం నాడు ఆశా( ASHA) కార్యవర్గంతో చంద్రబాబు అత్యవసర సమావేశం నిర్వహించారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉందని, అయినా పేదలకు వైద్య సేవలు అందిస్తున్న ఆసుపత్రుల పాత్రను గౌరవిస్తూ, ఎన్టీఆర్ వైద్య సేవ కింద పెండింగ్ బకాయిలు చెల్లింపులలో భాగంగా వెంటనే రూ. 500 కోట్లు విడుదల చేయడానికి చంద్రబాబు ఆమోదం తెలిపారు. మిగిలిన పెండింగ్ బకాయిల చెల్లింపులకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని, త్వరలోనే మరో సమావేశాన్ని నిర్వహించి ఎన్టీఆర్ వైద్యసేవలపై ఇతర అంశాలపై చర్చిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని ఆషా సంఘం తెలిపింది.
ఈ సమావేశం అనంతరం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు ఆశా (ASHA) కార్యవర్గంతో మాట్లాడారు. మిగిలిన బకాయిల విడుదల కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ నెల 10 తర్వాత ఆరోగ్యశాఖ మంత్రితో ప్రత్యేక సమావేశం సైతం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో చర్చించబోయే అంశాలు:
- పెండింగ్ బకాయిలు
- భవిష్యత్ చెల్లింపు షెడ్యూల్
- ప్యాకేజీ రివిజన్లు
- మెరుగుదల, ఇతర నిర్వహణ సమస్యలు
ఆశా (ASHA) కార్యవర్గం తీర్మానం:
ప్రస్తుతం విడుదల చేస్తున్న నిధులు మొత్తం బకాయిలకు సరిపడవు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీని గౌరవిస్తూ, రాష్ట్ర ఆర్థిక స్థితిని పరిగణనలోకి తీసుకుని ఏ.ఎస్.హెచ్.ఎ. కార్యవర్గం ఏప్రిల్ 8 (మంగలశారం) నుండి ఎన్టీఆర్ వైద్య సేవ కింద క్యాష్‌లెస్ సేవలు మళ్లీ ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. అన్ని ఆసుపత్రులు క్యాష్ లెస్ సేవలను మళ్లీ ప్రారంభించి, ప్రజలకు వైద్యసేవలలో అంతరాయం కలగకుండా చూడాలని ఆశా ( ASHA) అధ్యక్షుడు డా. విజయ్ కుమార్ కె సూచించారు.
ముఖ్య గమనిక
డా. ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ నుంచి హాస్పిటల్ ఎంపానెల్, నెట్వర్క్ హాస్పిటల్ బిల్లులు చేయిస్తామని, జరిమానాలు విధించకుండా, తనిఖీలు లేకుండా చూస్తామని కొంతమంది ఆగంతుకులు అధికారుల పేర్లు చెప్పుకొని హాస్పిటల్స్ వారిని సంప్రదిస్తున్నారు. దీనిపై డా. ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ వారు పోలీసులకి ఫిర్యాదు చేశాం. హాస్పిటల్ యజమాన్యము ఇలాంటి ఫేక్ కాల్స్ వస్తే ఈ క్రింది హెల్ప్ లైన్ నెంబర్ కు సమాచారం ఇవ్వవలసినదిగా డా. ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ముఖ్య కార్య నిర్వహణాధికారి కోరారు.
హెల్ప్ లైన్ నెంబర్: 9281074745