Amaravati Latest News: అమరావతి రాజధాని విస్తరణలో భాగంగా రెండోదశ పూలింగు నోటిఫికేషన్ జనవరి 3న విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2014-19 మధ్య NDA పాలనలో రాజధాని ప్రక్రియ జనవరిలోనే మొదలైందని, అందుకే సెంటిమెంట్‌గా ఈ దఫా కూడా జనవరిలోనే ల్యాండ్ పూలింగ్ ప్రారంభించాలని భావిస్తున్నట్లు సమాచారం. దీనిలో భాగంగా పల్నాడు జిల్లా అమరావతి, గుంటూరు జిల్లా తుళ్లూరు పరిధిలో ఏడు గ్రామాల నుంచి భూసమీకరణ ప్రక్రియ మెదలు కానుంది.
ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన క్యాబినెట్
2025 నవంబరు 27న జరిగిన ఏపీ క్యాబినెట్ సమావేశంలో ఏడు గ్రామాల్లో భూ సమీకరణ అధికారాన్ని సిఆర్డీఏ కమిషనర్‌కు అప్పగించారు. తాజా నోటిషికేషన్ ద్వారా 16,562.56 ఎకరాల పట్టా భూమి, 104.01 ఎకరాలు అసైండ్ భూమి మొత్తం 16,666.57 ఎకరాలు సమీకరించనున్నారు. దీంతోపాటు ప్రభుత్వ భూమి 3828.56 ఎకరాలు తీసుకోనున్నారు. దీనికి సంబంధించి కాంపిటెంట్ అథారిటీకి అవసరమైన అధికారులను ఎంపిక చేసింది. కార్యాలయాలూ తీసుకుంది.
మొదట్లో డిసెంబర్‌లోనే నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయించినా వేర్వేరు కారణాలతో ఆలస్యమైంది. తుళ్లూరు మండలంలోని పెదపరిమి, వడ్డమాను, హరిశ్చంద్రాపురం, అమరావతి మండలంలోని వైకుంఠపురం, పెదమద్దూరు, యండ్రాయి, కర్లపూడి లేమల్లెలో భూసమీకరణకు సంబంధించిన వివరాలను రెవెన్యూ అధికారులు సేకరించి నివేదికలు తయారుచేసి ఆయా జిల్లాల కలెక్టర్లకు పంపించారు. రాజధాని ప్రాంతంలో కొన్ని గ్రామాల్లో రైతులు ఇప్పటికే భూములు ఇస్తామని చెప్పి వారి భూముల పట్టాలను మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకు అందజేశారు.
వడ్డమానులో రైతులతో సమావేశం సందర్భంగా వచ్చే నాలుగేళ్లలో అభివృద్ధి చేసి ఇవ్వాలని లేనిపక్షంలో రైతుకు ఐదు లక్షలు పరిహారం ఇచ్చేలా ఒప్పంద పత్రంలో చేర్చాలని రైతులు కోరారు. దీనిపై గతంలోనే గ్రామసభలూ నిర్వహించారు. రైతుల నుంచి కూడా సమ్మతి లభించడంతో 2026 జనవరి మూడో తేదీన నోటిఫికేషన్ ఇచ్చి ఫిబ్రవరి 28వతేదీలోపు ప్రక్రియను ముగించేలా అధికారులు ఏర్పాటు చేస్తున్నారు, అయితే రైతులు తమకు డెవలప్ చేసి ఇచ్చే భూములను బురద గుంటల్లో కాకుండా రహదారి పక్కన ఇవ్వాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. మరి వారి డిమాండ్ లను CRDA అధికారులు ఎలా తీరుస్తారో చూడాలి.