Nara Lokesh Reacts Over Prattipati Pulla Rao Son Arrest: మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడిని మాచర్ల పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. పుల్లారావు తనయుడును శరత్ ను తీసుకెళ్లింది పోలీసులా లేక సైకో జగన్ ముఠానా అంటూ ఆరోపించారు. ఆయన అరెస్టును అంత రహస్యంగా ఎందుకు ఉంచుతున్నారని.. ఆయనేమైనా టెర్రరిస్టా అని నిలదీశారు. శరత్ కు ఏమైనా హాని తలపెడతారేమోననే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని అన్నారు.


‘‘మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు త‌న‌యుడు శరత్‍ను తీసుకెళ్లింది పోలీసులా? సైకో జ‌గ‌న్ తాడేప‌ల్లి ముఠానా?  టెర్ర‌రిస్టుని అరెస్టు చేసిన‌ట్టు ఎందుకు ర‌హ‌స్యంగా ఉంచుతున్నారు? శ‌ర‌త్‌కి ఏమైనా హాని త‌ల‌పెట్టారా అనే అనుమానాలు క‌లుగుతున్నాయి. ఈ అక్ర‌మ అరెస్టుని తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్ర‌త్తిపాటి పుల్లారావు గారి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండ‌గా ఉంటుంది. ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ప్ప‌ద‌ని, బ‌ల‌మైన టిడిపి నేత‌లే ల‌క్ష్యంగా సైకో జ‌గ‌న్ ప‌న్నుతున్న కుతంత్రాల‌ను తిప్పికొడ‌తాం. శ‌ర‌త్‌ని త‌క్ష‌ణ‌మే విడుద‌ల చేయాలి. త‌ప్పుడు కేసులు, అక్ర‌మ అరెస్టుల‌పై న్యాయ‌పోరాటం చేస్తాం. జ‌గ‌న్ దిగిపోయే ముందైనా ఇటువంటి సైకో చేష్ట‌లు ఆప‌క‌పోతే, చాలా భారీ మూల్యం చెల్లించాల్సి వ‌స్తుంది’’ అని నారా లోకేశ్ ఓ ప్రకటన విడుదల చేశారు.


ఓటమి భయం వల్లనే - ప్రత్తిపాటి
ఓటమి భయం నిలువెల్లా కమ్మేసిన ముఖ్యమంత్రి జగన్ రోజురోజుకీ మరింత దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని  మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు.  రాజకీయ క్షేత్రంలో నేరుగా ఎదుర్కోలేక తనకు అలవాటైన తప్పుడు కేసులతో ప్రత్యర్థులపై వేధింపులకు పాల్పడుతున్నారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కంపెనీలో డైరెక్టర్‌గా గానీ, కనీసం షేర్ హోల్డర్ కూడా లేని తమ అబ్బాయిపై కక్షతో జీఎస్టీ ఎగవేతల ఉల్లంఘనల కేసులు పెట్టడమే అందుకు తార్కాణమని నిప్పులు చెరిగారు. కంపెనీలో లేని, కంపెనీలతో సంబంధం లేని వ్యక్తికి  జీఎస్టీ ఎగవేతలకు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. గతంలోనూ ఇలానే బురదజల్లాలని చూశారని, ఇప్పుడు మరోసారి అదే పన్నాగం పన్నినట్లు కనిపిస్తోందని మండిపడ్డారు ప్రత్తిపాటి. తమకు సంబంధం లేని కంపెనీ పేరుతో దుష్ప్రచారానికి ఒడిగట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీఎస్‌డీఆర్‌ఐ ద్వారా తప్పుడు కేసులు బనాయించారని, వాటికి భయపడేది లేదన్నారు ప్రత్తిపాటి.