పల్నాడు జిల్లాలోని రొంపిచర్ల మండల టీడీపీ అధ్యక్షుడు వెన్నా బాలకోటి రెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. ఆ దాడికి కారణం వైఎస్ఆర్ సీపీ నాయకులే అని ఆరోపించారు. నిందితుడు వైఎస్ఆర్ సీపీ ఎంపీపీ భర్త అని చెప్పారు. వైఎస్ఆర్ సీపీ రౌడీ మూకలు బాగా బరితెగించాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవేళ బాలకోటి రెడ్డికి ఏదైనా జరిగితే ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని హెచ్చరించారు. ఈ మేరకు అధికార పార్టీని, నేతలను విమర్శిస్తూ నారా లోకేట్ ఘాటు ట్వీట్ చేశారు.
‘‘హత్యలు, దాడులతో టీడీపీ కేడర్‌ని భయపెట్టాలనుకుంటున్న జగన్ రెడ్డి గారూ! శిశుపాలుడిలా మీ పాపాలు పండిపోయాయి. ప్రజా వ్యతిరేకత తీవ్రం కావడంతో, రాజకీయ ఆధిపత్యం కోసం మీరు చేయిస్తోన్న హత్యలు, దాడులే మీ పతనానికి దారులు. రొంపిచర్ల మండల టిడిపి అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ వెన్నా బాలకోటిరెడ్డిపై హత్యాయత్నం ముమ్మాటికీ మీ వైసీపీ గూండాల పనే. బాలకోటిరెడ్డికి ఏమైనా జరిగితే వైసీపీ సర్కారుదే బాధ్యత. దాడిలో ఏకంగా వైసీపీ ఎంపీపీ భర్త పాల్గొన్నాడంటే.. మీ రౌడీమూకలు ఎంతగా బరితెగించాయో అర్థం అవుతోంది. ఫ్యాక్షన్ మనస్తత్వం బ్లడ్‌లోనే వున్న మీ పాలనలో పల్నాడు ప్రాంతం రక్తసిక్తమవుతోంది. ఇకనైనా హత్యారాజకీయాలు, దాడులు ఆపండి. లేదంటే ఇంతకి నాలుగింతలు మూల్యం చెల్లించేందుకు సిద్ధంగా వుండండి. జగన్ రెడ్డి అధికారం, పోలీసులు అండగా వున్నారని రెచ్చిపోతున్న వైసీపీ నేతలకి ఇదే చివరి హెచ్చరిక. మేము తిరగబడితే, మీ వెంట వచ్చేది ఎవరు? వైసీపీ అధికారం కోల్పోతే మిమ్మల్ని కాపాడేదెవరు?’’ అని నారా లోకేశ్ ట్వీట్ చేశారు.
మార్నింగ్ వాక్ కి వెళ్లిన సమయంలో దాడి
పల్నాడు జిల్లాలో రాజకీయ కక్షలు భగ్గుమన్నాయి. రొంపిచర్ల మండల టీడీపీ అధ్యక్షుడు వెన్నా బాలకోటిరెడ్డి పై హత్యాయత్నం జరిగింది. అలవల గ్రామంలో మార్నింగ్ వాక్ కు వెళ్లిన సమయంలో ప్రత్యర్థులు ఆయనపై గొడ్డళ్లతో దాడి చేశారు. ప్రత్యర్థుల దాడిలో తీవ్రంగా గాయపడిన బాలకోటిరెడ్డిని చికిత్స నిమిత్తం నరసరావుపేట ఆస్పత్రికి తరలించారు. గతంలో రొంపిచర్ల ఎంపీపీగా పని చేసిన వెన్న బాల కోటిరెడ్డి ప్రస్తుతం రొంపిచర్ల మండలం పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. బాలకోటిరెడ్డిపై దాడిని టీడీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ డా.చదలవాడ అరవింద బాబు నరసరావుపేట ఆసుపత్రికి వెళ్లి బాలకోటిరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
బాలకోటిరెడ్డిపై వైసీపీ రౌడీ ల దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. సీఎం జగన్ రెడ్డి ఫ్యాక్షన్ భావాల్ని నరనరనా నింపుకున్న వైసీపీ కార్యకర్తలు.. మృగాల కంటే హీనంగా ప్రవరిస్తున్నారంటూ మండిపడ్డారు. సామాన్యుల నుంచి ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలు, మహిళలపై దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఇదే వైసీపీ ప్రభుత్వం అన్నారు.