చంద్రబాబుకి తాటి చెట్టులా 75 ఏళ్ళు వచ్చాయని, అయినా ఏం ఉపయోగం లేదని వైఎస్ఆర్ సీపీ నేత, తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీ పార్వతి ఎద్దేవా చేశారు. ప్రభుత్వ ఖజానాని తన సొంత డబ్బుల్లా  దోచుకున్న వ్యక్తి చంద్రబాబు అని తీవ్ర ఆరోపణలు చేశారు. తాడేపల్లి గూడెంలో వైఎస్ఆర్‌ మేధావుల వేదిక, ఏపీ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో ‘సుపరిపాలన దిశగా ఆంధ్రప్రదేశ్ రూపాంతరం’ అనే అంశంపై సదస్సు జరిగింది. ఈ సదస్సులో లక్ష్మీ పార్వతి పాల్గొని మాట్లాడారు. 


ఈ సందర్భంగా చంద్రబాబు అరెస్టుపై మాట్లాడారు. ఎవరో అమెరికాలో కనిపెట్టిన సెల్ ఫోన్‌ను చంద్రబాబు తానే కనిపెట్టానని, ఎవరో తెచ్చిన ఐటీ రంగాన్ని హైదరాబాద్‌కు తానే తెచ్చానని చెప్పడం చంద్రబాబుకి అలవాటు అని ఎద్దేవా చేశారు. 


ప్రభుత్వ ఖజానాని కూడా తన సొంత డబ్బులా అనుకుని దోచుకున్న వ్యక్తి చంద్రబాబు అంటూ తీవ్ర విమర్శలు చేశారు. అధికారంలోని వచ్చిన మూడు నెలల్లోనే రూ.371 కోట్లు, ఆరు నెలల్లో వేల కోట్లు దోచేసిన వ్యక్తి చంద్రబాబు. రాజధాని పేరుతో లక్ష కోట్లు దోచుకున్నాడు. అల్లుడి గురించి చెప్పాలంటే అత్తగారే చెప్పాలి కదా అని కామెంట్స్‌ చేశారు. 


ప్రపంచ స్థాయి వేదిక అయిన ఐక్యరాజ్యసమితికి ఏపీకి చెందిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు వెళ్లడం మాములు విషయం కాదని అన్నారు. సీఎంగా వైఎస్ జగన్ ఉన్నందునే ఇది సాధ్యం అయిందని అన్నారు. విద్య, వైద్యం సమపాళ్లలో అందితేనే వ్యవస్థ బాగుంటుందని సీఎం జగన్ నమ్మేవారని అన్నారు. గతంల్ టీడీపీ ప్రభుత్వం 3 వేల ప్రభుత్వ పాఠశాలలు పడేలా చేసిందని అన్నారు. ప్రస్తుతం గవర్నమెంట్ స్కూళ్లలో సీట్లు అన్ని నిండుతున్నాయని.. అంటే విద్యకు ఎంత ప్రాధాన్యత ఉందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. నాడు - నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చిన వ్యక్తి సీఎం జగన్‌ అని అన్నారు.


ప్రజలు తెలివైన వారు కాబట్టే 23 సీట్లతో పోయిన ఎన్నికల్లో చంద్రబాబుని పక్కన కూర్చోపెట్టారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్‌ 175కి 175 సీట్లలో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా సీఎం జగన్ పరిపాలన అందిస్తున్నారని.. దాని వల్లే అది సాధ్యం అవుతుందని అన్నారు. ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను కూడా సీఎం జగన్ అమలు చేస్తున్నారని అన్నారు. ఈ సదస్సులో ఏపీ మీడియా అకాడమీ ఛైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు, తెలుగు భాష అకాడమీ ఛైర్‌ పర్సన్‌ లక్ష్మీ పార్వతి, స్టేట్ అగ్రికల్చర్ మిషన్ వైస్ ఛైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, ఏపీ లైబ్రరీ కమిటీ ఛైర్మన్‌ మండపాటి శేషగిరి రావు పాల్గొన్నారు.