ఏపీలో రివర్స్ పాలన నడుస్తోందని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణ రాజు ఆరోపించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ విశాఖ నగరంలో కబ్జాలు పెరిగిపోయాయని ఆరోపించారు. అలాగే ఏపీ నుంచి హైదరాబాద్‌కు వలసలు సైతం పెరిగాయన్నారు. రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు విడిచి పోతున్నాయని, కొత్తగా పరిశ్రమలు వచ్చే పరిస్థితి లేదన్నారు. ఏపీలో శాంతిభద్రతలు లేవని ఎంపీ రఘురామ కృష్ణ రాజు ఘాటుగా వ్యాఖ్యానించారు. రాజకీయ నేతల మెప్పు కోసం అధికారులు తప్పు చేస్తే శిక్ష అనుభవించక తప్పదని ఎంపీ రఘురామ కృష్ణ రాజు అన్నారు. ఢిల్లీలో మాట్లాడిన ఆయన కర్నూలు జిల్లాలోని ఓ పాఠశాల ఆవరణలో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం నిర్మించిన అంశంలో ఐఏఎస్ అధికారులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయాన్ని ఆయన ప్రస్తామించారు. అధికారులు తప్పును తప్పుగా చెప్పాలన్నారు. అలా కాకుండా అత్యుత్సాహం వ్యవహరిస్తే భవిష్యత్ తప్పనిసరిగా శిక్ష తప్పదని హెచ్చరించారు.
విజయసాయి బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణ వాయిదా
విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని ఎంపీ రఘురామ కృష్ణరాజు వేసిన పిటిషన్‌పై హైదరాబాద్ సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. జగన్ అక్రమాస్తుల కేసులో విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని ఎంపీ రఘురామకృష్ణరాజు ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులకు సంబంధించి కౌంటరు దాఖలు చేయాలని ఎంపీ విజయసాయిరెడ్డిని సీబీఐ కోర్టు ఆదేశించింది. కౌంటరు దాఖలు చేయడానికి కేంద్ర దర్యాప్తు సంస్థ గడువు కోరింది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను ఈనెల 13 వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని ఎంపీ రఘురామకృష్ణరాజు తరఫు న్యాయవాది సీబీఐ కోర్టును కోరారు.
విజయసాయి రెడ్డి ఎంపీ హోదాలో కేంద్ర హోంమంత్రి, ఆర్థిక మంత్రిత్వశాఖ కార్యాలయాల్లో అధికారులను తరచూ కలుస్తూ, తనకు కేంద్ర మంత్రులతో సంబంధాలున్నాయనే విధంగా సాక్షులను ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావితం చేస్తు్న్నట్లు పిటిషన్‌లో పేర్కొన్నారు. విజయసాయిరెడ్డి ఎంపీ కాగానే జగన్ లెక్కకు మించిన ఆదాయం కేసులో ప్రధాన దర్యాప్తు అధికారి ఉన్న అధికారిని సీబీఐ జేడీగా నియమించవద్దని అభ్యంతరం వ్యక్తంచేశారని పిటిషన్ లో పేర్కొన్నారు. ఇది విచారణ ప్రక్రియలో జోక్యం చేసుకోవడమేనని ఎంపీ రఘురామ తన పిటిషన్‌లో ఆరోపించారు.