పవన్ కల్యాణ్ (Pawan Kalyan) భీమ్లా నాయక్ సినిమాకు మద్దతుగా టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu), నారా లోకేశ్ (Nara Lokesh) స్పందించడంపై ఈ సినిమా రాజకీయ పరంగా మరింత చర్చనీయాంశం అవుతోంది. భీమ్లా నాయక్ (Bheemla Nayak) సినిమాపై జగన్ ప్రభుత్వం తీవ్ర ఆంక్షలు మోపిందని, సీఎం మూర్ఖత్వం వీడాలని చంద్రబాబు ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఎన్నో ప్రజా సమస్యలు ఉండగా, ఉక్రెయిన్‌లో తెలుగువారు చిక్కుకొని ఉన్న సమస్య ఉండగా భీమ్లా నాయక్ సినిమాపై ఆంక్షలు పెట్టడం ఏంటని చంద్రబాబు ప్రశ్నించారు. అయితే, ఈ ట్వీట్లకు మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు సినిమాలను కూడా రాజకీయాలకు వాడుకుంటున్నారు.. ఒక సినిమా రిలీజ్ ఉంటే దాని కోసం తండ్రి, కొడుకులు పిల్లిమొగ్గలు వేస్తున్నారని ఎద్దేవా చేశారు. 


‘‘మహేష్, ప్రభాస్, చిరంజీవి సినిమాల గురించి చంద్రబాబు నారా లోకేశ్ (Nara Lokesh) ఎందుకు ఇలా ఎందుకు ట్వీట్లు చేయలేదు? జూనియర్ ఎన్టీఆర్ సినిమా బాగుందని ఎప్పుడైనా మీరు అన్నారా? పవన్ కల్యాణ్ సినిమాకు మద్దతు పలకడం ఏంటి? అంటే మీది వన్ సైడ్ లవ్వా? గతంలో కుప్పం పర్యటనలో వన్ సైడ్ లవ్ ఉండదని అన్నారుగా. పవన్ కల్యాణ్ (Pawan Kalyan) గురించి మేం ఎప్పుడూ పట్టించుకోం. ఆయన ఎప్పుడూ వాస్తవానికి దూరంగా ఉంటారు. సినిమా బాగుంటే ఎవరు మాత్రం ఆగుతారు? సినిమా ఏదైనా బాగుంటే జనం ఎప్పుడైనా ఆదరిస్తారు. లేదంటే చూడరు. అలాంటప్పుడు దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ - జనసేన - టీడీపీకి లింకులు పెట్టడం ఏంటి?’’


‘‘నిజంగా మీరు గతంలో ప్రభుత్వమే నడిపారా? ఇంకేమైనా నడిపారా? చంద్రబాబు ప్రతిసారి మా స్థాయికి మించి దిగజారుతున్నారు. ప్రభుత్వంలో ఒక మంత్రి మరణించడం వల్ల ఆ దు:ఖంలో ఉండడం వల్ల జీవో రావడం లేటయింది. ఆ మాత్రానికే నిందలు వేస్తారా?’’ అని విమర్శించారు.


బాలయ్య (Balakrishna) అపాయింట్ మెంట్ కోరారు
‘‘ఎవరో ప్రొడ్యూసర్లకు అపాయింట్ మెంట్ కావాలంటే ఇచ్చా. వారు నన్ను విజయవాడ ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్‌లో కలిశారు. ఆ టైంలో మా హీరో మీతో మాట్లాడతానని రింగ్ ఇచ్చి వదిలారు. ఆయన బాలక్రిష్ణ. సీఎంగారిని కలవాలి అని అపాయింట్ మెంట్ కావాలి అడిగారు. నేను ఈ విషయాన్ని సీఎం గారికి ఈ చెప్తే ఎందుకు అన్నారు. అఖండ సినిమా గురించి ఏదో మాట్లాలట అని చెప్పా. అప్పుడు జగన్.. వద్దు నేను అపాయింట్ మెంట్ ఇచ్చి, ఆయన నన్ను కలిస్తే బాలయ్య పెద్దరికం పోతుంది అన్నారు’’


హైకోర్టు తీర్పులంటే లెక్కలేదా? (Perni Nani)
‘‘జీవో 35 పై ప్రతి సినిమాకి జాయింట్ కలెక్టర్ దగ్గరకి వెళ్ళి రేట్లు ఫిక్స్ చేసుకుని ప్రదర్శించుకోవాలని హైకోర్టు ఆదేశించింది. హై కోర్టు తీర్పులన్నా, ప్రభుత్వం అన్నా వీళ్ళకి లెక్క లేదు. ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు బ్లాక్ టికెట్స్ ని ప్రోత్సాహిస్తున్నాయని ఆరోపించారు. కొత్త జీవో విడుదల చేయడానికి ప్రక్రియ జరుగుతుంది. లీగల్ ఒపీనియన్‌కి వెళ్ళింది. అన్ని సక్రమంగా జరిగి ఉంటే 24వ తేదీన జీవో రావాల్సి ఉంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ ని వాయిదా వేసుకున్నారు.. సినిమాని ఇంకో రెండు రోజులు వాయిదా వేసుకోలేరా.. జీవో వచ్చే వరకూ ఆగలేరా? ఏపీలో సినిమాని ఫ్రీగా చూపిస్తాను అన్న పవన్ బ్లాక్ టికెట్లపై ఆశ ఎందుకు? అసలు జనాలు పవన్ సినిమా ఒక్కటే కాదు.. బాగుంటే అందరి సినిమాలు చూస్తారు’’ అని మంత్రి నాని అన్నారు.