విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పదో తరగతి ప్రశ్నా ప్రత్రాల లీకేజీ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి ఫోన్ లను ట్యాప్ చేశామంటూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. దీంతో విపక్షాలకు అవకాశం ఇచ్చినట్లయింది. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంశంపై నారా లోకేశ్ సహా టీడీపీ నేతలు మండిపడుతున్నారు.



ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంపై శనివారం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కూడా స్పందించారు. ఏకంగా మంత్రి రికార్డెడ్‌గా ఈ విషయం చెప్పడం ఆశ్చర్యం కలిగించిందని లోకేశ్ అన్నారు. టీడీపీ నేతలపై కక్ష సాధించేందుకు వైసీపీ ప్రభుత్వం చట్టాలను విస్మరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి ఫోన్లను పడితే వారి ఫోన్లను ట్యాప్ చేసి ప్రజా స్వామ్యాన్ని తుంగలో తొక్కుతున్నారని విమర్శించారు. ఆ అధికారం ప్రభుత్వానికి ఎవరు ఇచ్చారని నిలదీశారు. ప్రతిపక్షాలపై అసత్య ఆరోపణలు చేస్తూ తమ తప్పులను కప్పి పుచ్చుకుంటున్నారని అన్నారు. దీనికి సంబంధించి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. దాంతో పాటు మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడిన వీడియోను కూడా జత చేశారు.






ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి - వర్ల రామయ్య
ప్రత్యర్థుల ఫోన్ ట్యాపింగ్ ద్వారా జగన్ ప్రభుత్వం అత్యంత నేరపూరిత చర్యకు పాల్పడిందని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య మండిపడ్డారు. ప్రత్యర్థులను సాధించడం కోసం టెలిఫోన్ ట్యాపింగ్ ను జగన్ ప్రభుత్వం ఉపయోగించడం నిత్యకృత్యంగా మారడం నిజం కాదా? అని వర్ల రామయ్య ప్రశ్నించారు. 3 ఏళ్ల తన పాలనలో జగన్ ఎంతమంది నేతల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడ్డారో అని అనుమానం వ్యక్తం చేశారు. ఎంత మంది ఫోన్లు ట్యాప్ చేశారో చెప్పాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు. చంద్రబాబు, లోకేష్ ఇతర టీడీపీ ముఖ్యనేతల ఫోన్లు ఎప్పటి నుంచి ట్యాప్ చేస్తున్నారో ముఖ్యమంత్రి బయటపెట్టాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఫోన్ ట్యాపింగ్ వ్యవహరంపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే రంగంలోకి దిగాలని వ రామయ్య కోరారు. ఫోన్ ట్యాపింగ్ కు నైతిక బాధ్యత వహిస్తూ జగన్ ముఖ్యమంత్రి పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.