Margadarsi Case: మార్గదర్శి చిట్ ఫండ్స్ ఆర్థిక అక్రమాల కేసులో జులై 5వ తేదీన విచారణకు రావాలంటూ సీఐడీ నోటీసులు పంపిన విషయం అందరికీ తెలిసిందే. అయితే విచారణ ఏ1 చెరుకూరి రామోజీ రావు, ఏ2 శైలజా కిరణ్ లు గైర్హాజరు అయ్యారు. అయితే ముందుగానే వారు సీఐడీ విచారణకు హాజరు కాలేమని ఈ మెయిల్ చేసిన్లు తెలుస్తోంది. అనారోగ్య కారణాల వల్ల రామోజీ రావు రాలేని పరిస్థితిలో ఉన్నందున విచారణకు హాజరు కాలేమని చెప్పినట్లు సమాచారం.
జూన్ 22న నోటీసులు ఇచ్చిన సీఐడీ
మార్గదర్శి చిట్ ఫండ్స్ కేసులో నిందితులుగా ఉన్న రామోజీ రావు, శైలజా కిరణ్ లకు ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. 41ఏ కింద నోటీసులు ఇచ్చి జులై 5వ తేదీన గుంటూరులోని సీఐడీ రీజినల్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని పేర్కొంది. ఈ కేసులో రామోజీ రావు ఏ1గా, శైలజా కిరణ్ ఏ2గా ఉన్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లోని రామోజీరావు నివాసంలో రెండు విడతలుగా రామోజీరావు, శైలజా కిరణ్‌ను సీఐడీ అధికారులు ప్రశ్నించారు.
ఎఫ్ఐఆర్ లో రామోజీరావు, శైలజా కిరణ్ పేర్లు
మొత్తం మూడు చట్టాల కింద కేసులు నమోదు చేసింది సీఐడీ. ఐపీసీ సెక్షన్ 120(B), 409, 420, 477(A) , రెడ్ విత్ 34 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు అధికారులు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఇన్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1999 సెక్షన్ 5 ప్రకారం, అలాగే చిట్ ఫండ్ యాక్ట్ 1982లోని సెక్షన్ 76,79 ప్రకారం ఈ ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసినట్లుగా సీఐడీ తెలిపింది. నమోదైన ఎఫ్ఐఆర్‌లలో ఈనాడు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు, మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఛైర్మన్, అలాగే ఆ సంస్థ మేనేజింగ్ డైరక్టర్ శైలజా కిరణ్, అలాగే ఆయా బ్రాంచీల మేనేజర్ల పేర్లను చేర్చారు.
ఇప్పటికే ఆస్తులు అటాచ్
మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్థకు చెందిన ఆస్తులను సీఐడీ ద్వారా అటాచ్ చేశారు. మార్గదర్శికి సంబంధించిన రూ. వెయ్యికోట్ల ఆస్తులను రెండు విడతలుగా అటాచ్ చేయడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అటాచ్ చేసిన ఆస్తులను ఈ కేసు తేలేవరకూ ఎటువంటి క్రయవిక్రయాలు జరిపేందుకు అవకాశం లేదని సీఐడీ అధికారులు చెబుతున్నారు. చిట్స్‌ద్వారా మార్గదర్శి సేకరించిన సొమ్మును హైదరాబాద్‌లోని కార్పొరేట్ ఆఫీస్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టినట్లు వివరించింది. సోదాల సమయంలో తమకు లభించిన ‘రశీదు’లు నిబంధనల అతిక్రమణ జరిగిందనడానికి కీలక ఆధారాలని సీఐడీ తెలిపింది.
మార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ ను హైదరాబాద్‌లో ఆగస్టు 31, 1962న స్థాపించారు. నాలుగు రాష్ట్రాలలో మొత్తం 108 శాఖలను కలిగి ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలో శాఖలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం శాఖల సంఖ్య 37 కాగా 2,351 చిట్ గ్రూపులు ఉన్నాయి 1.04 లక్షల మంది చందాదారులు ఉన్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో వార్షిక టర్నోవర్ రూ. 9,677 కోట్లుగా ఉంది. డిపాజిట్లు మళ్లిస్తున్నారని సీఐడీ..అసలు డిపాజిట్లే తీసుకోడం లేదని మార్గదర్శి వాదిస్తోంది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial