Telugu Desam Party Head Office Attack Case: తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసు కీలక మలుపు తిరిగింది. ఇన్ని రోజులు వైసీపీలోని మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను విచారిస్తూ వచ్చిన పోలీసులు ఇప్పుడు కీలక వ్యక్తులకు నోటీసులు ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో కీలక వ్యక్తిగా ఉన్న సజ్జల రామకృష్ణా రెడ్డికి మంగళగిరి రూరల్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. రేపు(గురువారం) ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల లోపు విచారణకు హాజరుకావాలని ఆదేశించారు.


కేసు సీఐడీకి ఇచ్చాక మంగళగిరి పోలీసులు ఎందుకు నోటీసులు ఇచ్చారు? 


ఇప్పటికే టీడీపీ ఆఫీస్‌పై వైసీపీ నేతల దాడి కేసును సీఐడికి ప్రభుత్వం అప్పగించింది. అయితే ఇంత వరకు సీఐడీ ఈ కేసును టేకప్ చేయలేదు. సీఐడీ కేసు విచారణ బాధ్యత తీసుకునేంత వరకు విచారణ చేస్తూనే ఉంటామంటున్నారు మంగళగిరి పోలీసులు. అందుకే సజ్జల రామకృష్ణారెడ్డికి మంగళగిరి పోలీసులు నోటీసులు అందజేశారు. ఈ కేసు దర్యాప్తును సీఐడీ ఎప్పుడు తీసుకుంటుందో అనేదానిపై క్లారిటీ లేదు. 


దాడి జరిగి మూడేళ్లు


2021 అక్టోబర్ 19న గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ సెంట్రల్ ఆఫీస్‌పై వైసీపీ శ్రేణులు దాడి చేశాయి. వీడియో ఫుటేజ్ ఆధారంగా టీడీపీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాడి సమయంలో వైసీపీ అధికారంలో ఉండటంతో కేసులో ఎలాంటి పురోగతి లేకుండా పోయింది. ఒకరిద్దర్ని అరెస్టు చేసి స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. ఓవైపు పోలీసు దర్యా‌ప్తు జరుగుతుండగానే ఈ కేసు విచారణను ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. ఇంతలో మంగళగిరి పోలీసులు సజ్జల రామకృష్ణారెడ్డికి నోటీసులు ఇవ్వడం సంచలనంగా మారుతోంది. 


అరెస్టులు- బెయిల్‌


ఇదే కేసులో వైసీపీ నేతలు దేవినేని అవినాష్‌, లేళ్ల అప్పిరెడ్డి సహ పలువురు వైసీపీ నేతలు పలుమార్లు విచారణకు హాజరయ్యారు. ఇంతలో చైతన్య అనే వైసీపీ లీడర్‌ ఇదే కేసులో లొంగిపోయారు. కొందరిని పోలీసులు అరెస్టు కూడా చేశారు. వారిలో కొందరికి బెయిల్ కూడా వచ్చింది. 


సుప్రీంకోర్టు రక్షణ


కేసు దర్యాప్తు వేగం చూసిన వైసీపీ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి లాంటి వారంతా వివిధ కోర్టుల్లో స్టేలు తెచ్చుకున్నారు. విచారణ వరకు కోర్టులు అనుమతి ఇచ్చింది. అరెస్టులు లాంటివి చేయొద్దని స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాల మేరకు సజ్జల మినహా మిగతా వారంతా విచారణకు వస్తున్నారు. 


సజ్జలపై లుక్‌ అవుట్‌ నోటీసులు


ఈ కేసులోనే సజ్జలకు లుక్‌అవుట్ నోటీసులు జారీ చేశారు మంగళగిరి పోలీసులు. కేసు విచారణ వేగవంతమైనప్పటి నుంచి ఆయనకు నోటీసులు ఇచ్చేందుకు తిరుగుతుంటే కనిపించడం, స్పందించడం లేదని పోలీసులు చెప్పారు. అందుకే ఆయన పేరు మీద లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేశామన్నారు. 


సోమవారం అర్థరాత్రి క్రితం విదేశాల నుంచి వస్తున్న సజ్జలను ముంబై ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు ఆపేశారు. లుక్‌ అవుట్ నోటీసులు ఉన్నందున బయటకు వెళ్లడానికి వీల్లేదని చెప్పారు. తనకు సుప్రీంకోర్టు రక్షణ ఉందని... అరెస్టు చేయద్దని చెప్పిందని గుర్తు చేశారు. అయినా కస్టమ్స్ అధికారులు పట్టించుకోలేదు. మంగళగిరి పోలీసులకు విషయాన్ని చేరవేశారు. ఆయన స్పందించడం లేదని మాత్రమే లుక్‌ అవుట్ నోటీసులు ఇచ్చామని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నందున విడిచిపెట్టాలని పోలీసులు చెప్పడంతో విడిచి పెట్టారు. 


ఇన్ని రోజులు కనిపించకుండా విదేశాలకు వెళ్లిపోయిన సజ్జల తిరిగి రావడంతో టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో నోటీసులు ఇచ్చారు. గురువారం విచారణకు రావాలని ఆదేశించారు. ఉదయం పది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఎప్పుడైనా విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.