వైసీపీలో మంగళగిరి సీటెవరికి... ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికలకు ఇంకో ఏడాది సమయం ఉన్నప్పటికీ అప్పుడే సీట్ ఎవరికి అనే విషయంపై చర్చ మెదలైంది.
ఎమ్మెల్యే ఆర్కే హాట్ కామెంట్స్...
2019లో పసుపు కుంకుమ ఇచ్చినప్పటికీ చంద్రబాబు నాయుడు ఏపీలో ప్రజల నమ్మకాన్ని ఎందుకు పొందలేకపోయారని.. నారా లోకేష్ మంగళగిరిలో ఎందుకు ఓటమి పాలయ్యారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) ప్రశ్నించారు. పెద్ద కోనేరు అభివృద్ధి పనులను ఆయన మంగళవారం ఉదయం అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే ఆర్కే మీడియాతో మాట్లాడారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా 2024 లో దానికి కట్టుబడి పని చేస్తానని స్పష్టం చేశారు. మంత్రిగా ఉండి లోకేష్ పని చేయలేదనే ప్రజలు మంగళగిరిలో ఓడించారని అన్నారు. 
2024 ఎన్నికల్లోను మంగళగిరిలో వైసీపీ జెండాను ఎగరవేస్తామని అన్నారు. వచ్చే ఎన్నికల్లో శాసన సభ్యుడు ఆర్కే కు టికెట్ కేటాయించడం లేదు, అందువల్లనే ఆయన పార్టీ కార్యక్రమాలకు... మా నమ్మకం నువ్వే జగన్ పేరిట నిర్వహించే కార్యక్రమానికి దూరంగా ఉంటున్నారు అంటూ ప్రతిపక్ష తెలుగుదేశం నేతలు చేస్తున్న ఆరోపణలపై మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే కామెంట్స్ చేశారు. జగనన్నను, ఆర్కేను ప్రజలు నమ్మారు కాబట్టే అండగా నిలిచారని తెలిపారు. మంగళగిరిలో 2014-19 కి ముందు 2019 తర్వాత మధ్య జరిగిన అభివృద్ధి లో వ్యత్యాసం అందరికీ తెలుసని చెప్పారు. వర్షాకాలం ప్రారంభమయ్యే లోపు పెద్ద కోనేరు అభివృద్ధి పనులను పూర్తి చేసి తీరుతామని అన్నారు.
ముఖ్యమంత్రి సమావేశానికి ఆర్కే డుమ్మా...
వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణారెడ్డి గతంలో ఇలానే వార్తల్లో వ్యక్తిగా మారారు. ఇటీవల శాసనసభ్యులతో ముఖ్యమంత్రి జగన్ సమావేశం అయ్యారు. అయితే ఈ సమావేశానికి హజరు కాని ఎమ్మెల్యేలలో ఆర్కే కూడా ఉన్నారు. ఆయన నియోజకవర్గంలోనే ముఖ్యమంత్రి నివాసం ఉంటున్నారు. అయినా ఈ సమావేశానికి ఆళ్ళ హజరు కాకపోవటం చర్చకు తెరతీసింది. అయితే ఈ విషయంపై పార్టీ నేతలు ఆళ్లరామక్రిష్ణారెడ్డి వద్ద ప్రస్తావించగా, తన నియోజకవర్గంలోనే ఉంటున్న ముఖ్యమంత్రి జగన్ నిత్యం అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని, వాటన్నింటికి తాను వెళ్ళటం లేదు కదా అని నవ్వుతూ ప్రశ్నించారంట. అంటే అసలు విషయాన్ని అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నది తన అభిప్రాయంగా మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే లైట్ తీసుకున్నారని చెబుతున్నారు.
తాజాగా భారీ చేరికలు..
మంగళగిరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి బీసీ వర్గాలకు చెందిన నేతలకు భారీగా చేరికలు జరిగాయి. ఎమ్మెల్సీగా మురుగుడు హనుమంతరావును ఎంపిక చేశారు. అంతే కాదు తెలుగు దేశంలో కీలకంగా ఉన్న గంజి చిరంజీవిని సైతం పార్టీలోకి తీసుకువచ్చి, చేనేత విభాగ రాష్ట్ర అద్యక్షుడిగా బాధ్యతలు అప్పగించారు. ఇక మాజీ శాసన సభ్యురాలు కాండ్రు కమలతో పాటుగా పద్మశాలీ సామాజిక వర్గానికి చెందిన నేతలు, బీసీ నేతలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టిలోకి తీసుకువచ్చారు. స్థానికంగా తెలుగు దేశం నుండి పోటీ చేసే నారా లోకేష్ కు పూర్తిగా చెక్ పెట్టేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి బీసీ వర్గాలకు ప్రాధాన్యత ఇస్తారని ప్రచారం జోరందుకుంది.