ఏడాది క్రితం మహారాష్ట్రలో కిడ్నాప్‌నకు గురైన బాలుడు, జగ్గయ్యపేటలో పోలీసులకు చిక్కాడు. పాఠశాల వార్షికొత్సవంలో పాల్గోంటున్న ఆ బాలుడిని మహారాష్ట్ర పోలీసులు, స్దానిక పోలీసులు సహకారంతో తీసుకువెళ్లారు. 


ముంబయిలో కిడ్నాప్ అయిన బాలుడు ఏడాది తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జగ్గయ్యపేట ప్రాంతంలోని దేవుపాలెం గ్రామంలో ప్రత్యక్షమయ్యాడు. జగ్గయ్యపేటలోని ఒక ప్రైవేట్ స్కూలులో ప్రస్తుతం ఆ బాలుడు చదువుతున్నాడు. ముంబయిలో 2022లో బాలుడు కిడ్నాప్‌కు గురైనట్లుగా కుటుంబ సభ్యులు అక్కడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణలో అక్కడ పోలీసులకు విజయవాడకు చెందిన మహిళ బాలుడిని తీసుకువెళ్లినట్లుగా గుర్తించారు. ఆమె బాలుడిని జగయ్యపేటలోని ఓ మహిళకు 2లక్ష్లల రూపాయలకు అమ్మేసింది. ఆమె దేవుపాలెంలోని తమ బంధువులకు మూడు లక్షల రూపాయలకు బాలుడిని ఇచ్చేసింది. 


అప్పటి నుంచి అదే కుటుంబంలో పెరుగుతున్న ఆ బాలుడు జగ్గయ్యపేటలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నాడు. అంతా వారి పిల్లాడే అనుకుంటున్న టైంలో పోలీసులు వచ్చి ఆ బాలుడిని తీసుకెళ్లిపోయారు. మహారాష్ట్రకు చెందిన ఫ్యామిలీ బిడ్డగా చెప్పడంతో అంతా ఆశ్చర్యపోయారు. 


పాఠశాల వార్షికోత్సవంలో సందడి చేస్తున్న సదరు బాలుడిని పోలీసులు గుర్తించి తీసుకెళ్లారు. ఆధారాలతో పోల్చి చూశారు. మహారాష్ట్ర పోలీసులు, స్థానిక పోలీసులు మాట్లాడుకొని గతంలో కిడ్నాప్ అయిన బాలుడు ఈ బాలుడు ఒక్కడే అని నిర్దారణకు వచ్చారు.  దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బాలుడిని అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. ఎస్ఐ రామారావు సహకారంతో మహారాష్ట్ర పోలీసులు కేసు పత్రాలు చూపించి, బాలుడిని తీసుకెళ్లిపోయారు. 


పెంచుకున్న తల్లి ఆవేదన...


ఏడాదిగా పెంచుకుంటున్న బాలుడిని హఠాత్తుగా పోలీసులు తీసుకువెళ్ళిపోవటంతో పెంచుకున్న తల్లి, కుటుంబ సభ్యులు బోరుమంటున్నారు. ఈ వ్యవహరం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఈ కేసులో కిడ్నాప్ చేసిన విజయవాడకు చెందిన మహిళ శ్రావణి, మధ్యవర్తిగా వ్యవహరించిన జగ్గయ్యపేటకు చెందిన మరో మహిళను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వాళ్లను విచారించడంతో బాలుడి ఆచూకీ లభించిందని, పూర్తి సమాచారం సేకరించి, కేసుకు సంబందించిన ఎఫ్ఐఆర్ పత్రాలు, ఇతర వివరాలు తెలుసుకొన్న తరువాతే బాలుడిని మహారాష్ట్ర పోలీసులకు అప్పగించారు. 


మహారాష్ట్ర పోలీసుల ఇచ్చిన సమాచారంతో...


ఈ కేసు వ్యవహరం తీవ్ర సంచలనం రేకెత్తించింది. ఏడాది క్రితం మహారాష్ట్రలో బాలుడిని కిడ్నాప్ చేసి తీసుకువచ్చి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విక్రయించటం సంచలనంగా మారింది. ఈ కేసు ఆధారంగా అక్కడ పోలీసులు ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. అంతా మహిళల పేర్లు మాత్రమే ఈ కేసులో వినిపించటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. కేసుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించేందుకు రెడీ అవుతున్నారు. 


తెర వెనుక ఉన్న వారి వివరాలు ఏంటి, కేవలం మహిళలే ఈ దందా అంతా నడిపించలేరని భావిస్తున్నారు పోలీసులు. ఏడాది కాలంలో ముగ్గురు మహిళలు దాదాపుగా 5లక్షల రూపాయలు చేతులు మార్చి, బాలుడిని వేరొకరికి అప్పగించటం వెనుక అసలు సూత్రధారులు ఎవరన్నది విచారణ చేస్తున్నారు. కేవలం ఈ బాలుడు మాత్రమే ఇలా దొరికాడా... లేక ఇంకెవరయినా పిలల్లలు వీరి చేతికి చిక్కారా అన్న అంశం పై కూడా పోలీసులు కూపీ లాగుతున్నారు. తెర వెనుక ఉన్న చేతులు ఎవరివి అన్నదాని పై పోలీసులు వివరాలను సేకరించి, సెల్ ఫోన్ ఆధారంగా కేసుకు సంబందించిన పూర్తి వివరాల కూపీ లాగుతున్నారు. 


ఎన్టీఆర్ జిల్లా పోలీసులతోపాటుగా, ఉమ్మడి కృష్ణాజిల్లాకు చెందిన పోలీసు అధికారులు ఈ విచారణలో పాలుపంచుకుంటున్నారు. ప్రత్యేక టీంను ఏర్పాటు చేసి బాలుడి కిడ్నాప్ కేసులో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.  వెలుగులోకి వచ్చిన ఘటన తరువాత, అంతకు ముందు ఉన్న పరిణామాలపై విచారణ చేపట్టారు.