TDP MLC Ashok Babu Arrested: అమరావతి: టీడీపీ నేత, ఎమ్మెల్సీ అశోక్‌బాబుకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఏపీ హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు శుక్రవారం మధ్యాహ్నం 2:15 గంటలకు విచారణకు అనుమతించింది. గురువారం రాత్రి ఎమ్మెల్సీ అశోక్‌బాబును సీఐడీ అధికారులు ఆయన నివాసం వద్ద అదుపులోకి తీసుకున్నారు. అనంతరం గుంటూరులోని సీఐడీ ఆఫీసుకు తరలించారు. అశోక్ బాబు అరెస్టును టీడీపీ నేతలు ఖండించారు. ఏపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే నేతలపై కక్ష సాధింపు చర్యలకు దిగిందని ఆరోపిస్తున్నారు.


ఏపీ ఎన్జీవో మాజీ అధ్యక్షుడు, టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబును నిన్న రాత్రి సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. పదోన్నతి కోసం నకిలీ సర్టిఫికెట్లు, నకిలీ విద్యార్హతలను చూపించారన్న ఆరోపణలపై విజయవాడలో అశోక్ బాబును అదుపులోకి తీసుకున్నారు. వివాహ వేడుకకు హాజరై పటమటలంకలోని తన నివాసానికి చేరుకున్న ఆయనను సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో వాణిజ్య పన్నుల శాఖలో ఏసీటీవోగా పని చేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. డిగ్రీ చదవకుండానే చదివినట్లుగా చూపించారని ఉమ్మడి రాష్ట్రంలో సైతం అశోక్ బాబుపై ఆరోపణలు వచ్చాయి.


తాను ఏ తప్పు చేయలేదని ఉమ్మడి రాష్ట్రంలోనే శాఖాపరమైన జరిగిన సమయంలో అశోక్ బాబు వివరణ ఇచ్చుకున్నారు. విజిలెన్స్ విచారణ సైతం జరిగింది. చివరికి ఏపీ ఎన్జీఓ మాజీ అధ్యక్షుడు అశోక్ బాబుపై నమోదైన అభియోగాలను ఉపసంహరించారు. కానీ ఏపీలో ప్రస్తుతం పీఆర్సీ వివాదం కొనసాగుతున్న క్రమంలో అశోక్ బాబుపై ఓ ఉద్యోగి ఫిర్యాదు చేయడంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. లోకాయుక్త ఈ కేసును సీఐడీకి అప్పగించగా రిపోర్టులు పరిశీలించిన అనంతరం అధికారులు గురువారం రాత్రి అశోక్ బాబును అదుపులోకి తీసుకున్నారు.


ఉద్యోగులు సమ్మెకు నోటీసులు ఇచ్చిన రోజే సాయంత్రం నాటికి అశోక్ బాబుపై సీఐడీ కేసు నమోదు చేసిందని టీడీపీ నేత పట్టాభి రామ్ తెలిపారు. పీఆర్సీ వివాదాన్ని పక్కదారి పట్టించేందుకు ఉద్యోగులకు అండగా ఉంటాడనే భయంతో ఏపీ ఎన్జీఓ మాజీ అధ్యక్షుడు అశోక్ బాబుపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. గుంటూరు సీఐడీ ఆఫీసుకు వెళ్లిన మాజీ మంత్రి దేవినేని ఉమను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడ ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టారు.


Also Read: TDP leader Pattabhi On Ashok Babu Arrest: వైఎస్ జగన్‌గారు మీ టైమింగ్ సూపర్, అందులో మిమ్మల్ని మించినోళ్లు లేరు


Also Read: MLC Ashok Babu Arrest: టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు అరెస్ట్, సీఐడీ ఆఫీసుకు తరలించిన అధికారులు