Lokesh Latest News: తెలుగు రాష్ట్రాల్లో ఉగాది పండుగను ప్రజలందరూ ఎంతో ఉత్సాహంగా చేసుకున్నారు. కొత్త సంవత్సరం మనందరికీ మంచి జరగాలని కోరుకుంటూ సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు పూజలు నిర్వహించారు. వాటి ఫొటోలను స్టాటస్‌లు, సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ఏపీ మంత్రి నారా లోకేశ్ కూడా తన ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి ఉగాది వేడుకలను ఎంతో వైభవంగా జరుపుకున్నారు. ఆ ఫొటోలను షేర్ చేసుకున్నారు. వాటిలో కొన్ని తీవ్ర దుమారం రేపాయి. లోకేష్ షేర్ చేసిన ఫొటోలతో పవిత్రమైన పూజ గది ఫోటో కాస్తా రాజకీయ విమర్శలకు దారితీసింది. చివరకు ఆ వివాదంపై లోకేశ్ స్వయంగా స్పందించాల్సి వచ్చింది. జరుగుతున్న ప్రచారంపై క్లారిటీ ఇచ్చారు.
వివాదం ఎలా మొదలైందంటే?
ఉగాది సందర్భంగా నారా లోకేశ్ తన కుమారుడు దేవాన్ష్‌తో కలిసి ఇంటి పూజ గదిలో కూర్చుని ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అందరికీ తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు చెప్పారు. తండ్రీకొడుకులు పద్ధతిగా పంచె కట్టుకుని, భక్తిశ్రద్ధలతో దేవుడికి నమస్కరిస్తున్న ఆ ఫొటోలు చూడటానికి చాలా బాగున్నాయి. అక్కడితో ఆగిపోతే సోషల్ మీడియాతో సమస్యలు ఎందుకు వస్తాయి. దాన్ని జూమ్ చేసి అక్కడ ఏమేమి ఉన్నాయో చూశారు. అలా చూసిన ప్రత్యర్థులకు అక్కడ ఒక విచిత్రమైన బొమ్మ కనిపించింది. అంతే దాన్ని పట్టుకొని వైరల్ చేశారు.
లోకేష్ పూజ గదిలో ఉన్న వింత బొమ్మ ఏంటీ అనే రచ్చ మొదలైంది. ఇలాంటివి క్షద్ర పూజల్లో వాడతారని కొందరు అంటే, ఇదేదో చేతబడికి ఉపయోగించిన బొమ్మలా ఉందని మరికొందరు చర్చకు పెట్టారు. దేవుడి గదిలో అనుమానాస్పద బొమ్మలు ఉండటం ఏంటని మరికొందరు నిలదీశారు. పవిత్రమైన పూజ మందిరంలో క్షద్ర పూజలు చేస్తున్నారా అంటూ ప్రత్యర్థులు హేళన చేశారు.
స్పందించిన లోకేష్
గంటల వ్యవధిలోనే ఇది వైరల్‌గా మారింది. దీంతో లోకేష్ స్పందించాల్సి వచ్చింది. ఆ బొమ్మ వెనుక ఉన్న అసలు రహస్యాన్ని, దానికి ఉన్న ఎమోషనల్ కనెక్షన్‌ను వివరిస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ఆయన ఏమన్నారంటే..." ఆ బొమ్మ ఏదో క్షద్ర పూజల కోసం తెచ్చింది కాదు. అది దేవాన్ష్ తన నాలుగేళ్ల వయసులో తయారు చేసిన శివుని బొమ్మ. దేవాన్ష్‌కు చిన్నప్పటి నుంచి శివుడు అంటే చాలా భక్తి, ఆ భక్తితోనే స్వయంగా ఒక చిన్న శివలింగాన్ని, శివుడి బొమ్మను తయారు చేశాడు." అని లోకేష్ వివరించారు.
గుర్తుగా దాచుకున్న జ్ఞాపకం
పిల్లలు చిన్నతనంలో చేసే పనులు తల్లిదండ్రులకు ఎంతో ప్రత్యేకమని లోకేష్ అభిప్రాయపడ్డారు. వారు చేసే చిన్న చిన్న బొమ్మలు లేదా గీసే చిత్రాలను జ్ఞాపకాలుగా దాచుకోవడం సహజమని వెల్లడించారు. తమ కుమారుడు ఎంతో ఇష్టంగా తయారు చేసిన ఆ శివుడి బొమ్మను పారేయకుండా, భక్తితో తమ పూజ గదిలోనే ఒక జ్ఞాపకంలా భద్రపరుచుకున్నామని తెలిపారు."కొందరికి విశ్వాసం అర్థమవుతుంది, మరికొందరికి అర్థం కాదు. కానీ ఇలాంటి భక్తికి ఎలాంటి వివరణలు ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు" అంటూ లోకేష్ కౌంటర్ ఇచ్చారు. తన ట్వీట్ చివరలో "హరహరమహాదేవ్" అని పేర్కొంటూ ఈ వివాదానికి ముగింపు పలికారు.
