Lokesh Counter to Jagan: వైఎస్ జగన్‌కు చెందిన సాక్షి చానల్‌లో అమరావతిపై జరిగిన డిబేట్ గురించి రచ్చ రచ్చ అవుతోంది. అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని రాజధాని మహిళలు, తెలుగుదేశం, కూటమి పక్షాలు.. అక్రమ అరెస్టులు చేశారంటూ వైఎస్సార్సీపీ గోడవ పడుతున్నాయి. సాక్షి చానల్‌లో జరిగిన ఓ డిబేట్‌లో కృష్ణంరాజు అనే విశ్లేషకుడు అమరావతి వేశ్యల రాజధాని అంటూ చేసిన కామెంట్లు అగ్గి రేపాయి. ఓ ప్రాంతంలోని మహిళల గౌరవాన్ని అగౌరవపరిచేలా సాక్షి టీవీ.. అందులో డిబేట్ నిర్వహించిన ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు, విశ్లేషకుడు కృష్ణంరాజుపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దానిపై కేసులు నమోదవ్వడం.. కొమ్మినేని అరెస్ట్ కావడం.. ఈ గొడవంతా రెండు రోజుల నుంచి నడుస్తూనే ఉంది.
ఈ ఘటనకు కొనసాగింపుగా రెండు వైపులా వాదనలు జరుగుతున్నాయి. తెలుగుదేశం నాయకులు కూడా స్థాయి దాటి వ్యాఖ్యలు చేశారని... వైఎస్సార్సీపీ చెబుతోంది. ఎవరో విశ్లేషకుడు చేసిన వ్యాఖ్యలకు పార్టీకి, చానల్‌కు ఏం సంబంధం అని వాళ్లు ప్రశ్నిస్తున్నారు. జర్నలిజానికి సంకేళ్లు వేశారంటూ సాక్షి పాత్రికేయులు నిరసన తెలిపారు. వైఎస్సార్సీపీ నేతలు వరుసగా పెస్‌మీట్లు పెడుతూ కొమ్మినేని అరెస్టును ఖండిస్తున్నారు. ఇంకోవైపు తెలుగుదేశం పార్టీ జగన్ అధికారంలో ఉండగా జరిగిన అరెస్టులు.. అర్థరాత్రి ఇంట్లోకి జొరబడి పోలీసులు దౌర్జన్యం చేయడం వంటి వాటి గురించి మాట్లాడుతున్నారు. కొమ్మినేని డిబేట్‌లో జరిగిన వ్యాఖ్యలకు తమ పార్టీకి, ఛానెల్‌కు సంబంధం లేదని జర్నలిస్టులను అక్రమంగా అరెస్ట్ చేశారని ట్వీట్ చేశారు. దీనికి నారా లోకేష్ ఓ వీడియోతో గట్టి కౌంటర్ ఇచ్చారు.
నాది కాలేజ్ లైఫ్ నీది జైలు లైఫ్- అర్థమైందా రాజా...?
జగన్‌కు కౌంటర్‌గా ట్వీట్ చేసిన లోకేష్.. అందులో వైఎస్సార్సీపీ నేతలు వివిధ సందర్భాల్లో చేసిన వ్యాఖ్యల వీడియోను ఉంచారు. “జగన్ గారు మీ హిపోక్రసీని చూస్తుంటే నాకు నవ్వొస్తోంది... నాకు కాలేజ్ లైఫ్ ఉంది...మీకు జైల్ లైఫ్ ఉంది.. నాకు క్లాస్‌మేట్స్ ఉన్నారు.. మీకు జైల్ మేట్స్ ఉన్నారు. అర్థమైందా ... రాజా..? ” అంటూ ట్వీట్ చేశారు. తాను మహిళలను గౌరవించే పెంపకంలో పెరిగానని .. కానీ జగన్ తన సొంత తల్లిని, చెల్లిని కూడా కోర్టుకీడ్చారని లోకేష్ ఆ ట్వీట్‌లో జగన్‌పై విమర్శలు చేశారు. జగన్ న్ ఐదేళ్ల పాలన అకృత్యాల మయం అని.. ప్రతీకార రాజకీయాలు దళితుల, సమాన్యులపై దాడులతో ఎవరికీ ప్రశాంతత అన్నదే లేదని లోకష్ అన్నారు.
అమరావతి ప్రాంతాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై మంటలు రేగుతూనే ఉన్నాయి. కూటమి పక్షాలు మంగళవారం రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు నిర్వహించాయి. మరోవైపు ఈ కేసుపై జాతీయ మహిళా కమిషన్ దీనిపై స్పందించింది. మహిళల గౌరవానికి భంగం కలిగేలా వ్యాఖ్యలు చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వ్యాఖ్యలు చేసిన చర్యలు తీసుకోవాలని మూడు రోజుల్లోగా దీనిపై నివేదిక ఇవ్వాలని ఏపీ డీజీపీకి లేఖ రాసింది.