Legality for AP capital Amaravati : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం, 2014లోని 5(2) సెక్షన్‌ను సవరించే ప్రతిపాదనకు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ఇప్పటికే ఆమోదం తెలిపింది. ఈ సవరణ బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదం తర్వాత పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. పార్లమెంట్ ఆమోదం అనంతరం అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటిస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఈ ప్రక్రియ రెండు వారాల్లో పూర్తి కావచ్చని తెలుస్తోంది.
ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ఏపీ విభజన చట్టం సవరణ ప్రక్రియ
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 5(2) సెక్షన్ ప్రకారం, హైదరాబాద్‌ను 10 సంవత్సరాలు రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా పేర్కొన్నారు. అయితే, విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రాజధాని పేరు ఎక్కడా పేర్కొనలేదు, కేవలం "రెసిడ్యువరీ ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్" అని మాత్రమే పేర్కొన్నారు. ఈ లోపం వల్ల రాజధాని విషయంలో చట్టపరమైన అస్పష్టత ఏర్పడింది. 2015లో టీడీపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించినా, గెజిట్ నోటిఫికేషన్ జారీ కాలేదు. అసెంబ్లీలో అమరావతిని ప్రతిపక్ష నేతగా జగన్ కూడా ఆమోదించడంతో ఇక రాజధాని సమస్య ఉండదనుకున్నారు.
అమరావతిని రాజధానిగా చేరుస్తూ బిల్లు రెడీ - ఆమోదం తర్వాత గెజిట్ జారీ
కానీ 2019-2024 మధ్య జగన్ సీఎం అయ్యాక మూడు రాజధానుల విధానం తెరపైకి తెచ్చారు. అమరావతి ప్రాజెక్టును నిలిపివేశారు. దీనికి వ్యతిరేకంగా అమరావతి రైతులు తీవ్ర పోరాటం చేశారు. న్యాయపరంగా కూడా జగన్ ప్రయత్నాలు సాధ్యం కాలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించడంతో, చట్టబద్ధత కల్పించాలని కేంద్రాన్ని కోరింది. మే 8, 2025న ఏపీ కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అమరావతిని రాజధానిగా చట్టంలో చేర్చాలి అనే ప్రతిపాదన ఆమోదించారు. ఈ ప్రతిపాదనను కేంద్రానికి పంపారు. తాజా సమాచారం ప్రకారం, కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ఈ సవరణకు ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు ప్రక్రియ వేగవంతం చేస్తున్నారు.
రెండో ద శ ల్యాండ్ పూలింగ్ కు ముందుకు రైతులకు భరోసా
కేంద్ర కేబినెట్ సమావేశంలో ఆమోదం తర్వాత, సవరణ బిల్లును వింటర్ సెషన్‌లో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. బిల్లు రెండు సభల్లో ఆమోదం పొందిన తర్వాత, అమరావతిని రాజధానిగా ప్రకటిస్తూ గెజిట్ విడుదల చేస్తారు. ఈ ప్రక్రియ రెండు వారాల్లో పూర్తి కావచ్చని అంచనా. అమరావతిలో రెండో విడత భూసమీకరణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో అమరావతికి గెజిట్ వస్తే రైతులు మరితం ధైర్యంగా భూములు ఇచ్చే అవకాశం ఉంది.