ఆంధ్రప్రదేశ్ కు రాజధానిగా అమరావతినే ఉంచాలని ఆ ప్రాంత రైతులు సాగిస్తున్న ఉద్యమం 1200 రోజులకు చేరింది. రాజకీయ పార్టీల నేతలు వారికి మద్దతు తెలిపేందుకు వస్తూనే ఉన్నారు. శుక్రవారం (మార్చి 31) నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ సీపీ నుంచి సస్పెండ్ అయిన నేత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అమరావతి రైతులకు మద్దతు పలికారు. అమరావతి ఉద్యమం 1200 రోజులకు చేరిన సందర్భంగా "దగా పడ్డ రైతులు, దోపిడీకి గురవుతున్న ఆంధ్రా పౌరులు' అనే పేరుతో మందడం శిబిరంలో అమరావతి ఐకాస ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఆయన ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో అమరావతి వ్యతిరేక శక్తులు కొట్టుకుపోవడం ఖాయం అని అన్నారు.
రాజధాని అమరావతి 29 గ్రామాల ప్రజలది కాదని, ప్రపంచంలోని కోట్లాది తెలుగువారందరిదీ అని అన్నారు. అప్పట్లో అమరావతి ముద్దు అన్నారని, ఇప్పుడెందుకు వద్దంటున్నారో సీఎం జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ అమరావతికి జై కొడితే ప్రజలు తప్పకుండా స్వాగతిస్తారని అన్నారు. ప్రధాని మోదీ ఒక్కమాట చెబితే రాజధాని అమరావతి ఇక్కడి నుంచి కదిలే అవకాశం ఉండబోదని అన్నారు. దేశంలోని ప్రధాన నగరాలతో పోటీపడే శక్తి అమరావతికి ఉందని చంద్రబాబు నమ్మినట్లుగా కోటంరెడ్డి గుర్తు చేశారు.
1200 రోజులుగా అమరావతి రాజధాని పరిరక్షణ కోసం వెనక్కి తిరగకుండా, మాట తప్పకుండా, మడమ చూపకుండా, లాఠీలకు వెరవకుండా ధైర్యసాహసాలు ప్రదర్శించిన వారికి కోటంరెడ్డి అభినందనలు తెలిపారు. అమరావతి రాజధాని నుంచి మట్టి పెళ్ళ కూడా ఎవరూ తీసుకువెళ్ళలేరని, అమరావతికి మద్దతుగా నిలిచిన పార్టీలకు సునామీ లాంటి మద్దతు వస్తుందని చెప్పారు. మూడు రాజధానులు అన్న పార్టీ అమరావతి రాజకీయ రథచక్రాల కింద నలిగిపోతుందని అన్నారు. అమరావతి కోసం నెల్లూరు జిల్లా ఇప్పుడు బ్రహ్మరథం పట్టేందుకు సిద్ధంగా ఉందని, సీఎం జగన్ తన నిర్ణయాన్ని మార్చుకోవాలని కోటంరెడ్డి సూచించారు.
శ్రీరాముడి రాజధాని అయోధ్య, శ్రీకృష్ణుడుది ద్వారకా, దేవతల రాజధాని అమరావతి అంటూ వ్యాఖ్యానించారు. అమరావతిపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు తీసుకున్న నిర్ణయం సముచితమైనదని అన్నారు. ఆనాడు ఏపీ రాజధాని అమరావతి అని చంద్రబాబు ప్రకటన చేస్తే, ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ మద్దతు పలికిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. నెల్లూరులో రైతులను పరామర్శ చేసిన నాటి నుంచి పార్టీలో తనకు కష్టాలు ప్రారంభం అయ్యాయని అన్నారు. ఇప్పుడు స్వేచ్ఛగా తన అభిప్రాయాలు చెప్పే అవకాశం వచ్చిందని అన్నారు. అమరావతి ఏకైక రాజధానిగా ఉంటుందని స్పష్టం చేశారు. తన మనవలు తనను చరిత్ర హీనుడు అనుకోకుండా ఉండాలనే అమరావతికి మద్దతు ఇస్తున్నానని అన్నారు.
‘‘అమరావతి ఉద్యమం కొన్ని గ్రామాల సమస్యో, కొంతమంది రైతుల సమస్యో, కొన్ని వేల ఎకరాల సమస్యో కాదు. అమరావతి ఉద్యమం ప్రపంచంలో ఉండే కోట్లాది తెలుగు ప్రజల ఆకాంక్ష, గుండె చప్పుడు. వచ్చే ఎన్నికల్లో అమరావతి రాజధాని అనుకూల ప్రభుత్వం కోట్లాది ప్రజల అశీసులు వచ్చిన వెంటనే కాబోయే ముఖ్యమంత్రిని నేను కోరేది ఒక్కటే. తొలి అడుగు ఎక్కడ వేయాలంటే అమరావతి ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన భారతజాతి ముద్దు బిడ్డల గుర్తుగా ప్రపంచంలోనే అతిపెద్ద స్మారక చిహ్నం అమరావతిలో శంకుస్థాపన జరగాలి’’ అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.
ఈ ఆందోళనలో బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్, మాజీ మంత్రి అది నారాయణ రెడ్డి, కాంగ్రెస్ నుంచి ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మ శ్రీ, టీడీపీ నుంచి మాజీ మంత్రి కన్నా లక్ష్మినారాయణ, ఎమ్మెల్సీ పంచుమార్తి అనురాధ తదితరులు పాల్గొన్నారు.