Kodela Sivaram Comments on YS Jagan:  తాడేపల్లిలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసం వద్ద డబుల్ లేన్ రహదారి, ప్రభుత్వ ఫర్నీచర్ వినియోగం తదితర అంశాలు తాజాగా వివాదాస్పదంగా మారాయి.  ముఖ్యమంత్రిగా పదవిలో ఉన్నప్పుడు వైఎస్ జగన్ ఎక్కవగా తన క్యాంప్ ఆఫీస్ నుంచే పరిపాలన చేసేవారు. సెక్రటేరియట్ కు కేవలం మంత్రి వర్గ సమావేశాలు ఉన్నప్పుడు మాత్రమే వెళ్లేవారు. తాడేపల్లిలోని తన ఇంటి పక్కనే ఆనుకుని మరో భవనం నిర్మించారు. దాన్ని క్యాంప్ ఆఫీసుగా ఉపయోగిస్తుండేవారు. సీఎం అయిన తర్వాత ప్రభుత్వ పరంగా జీవోలు విడుదల చేసి ఆ ఇంటికి అదనపు సౌకర్యాలు, ఫర్నీచర్ కల్పించారు. అందంతా ప్రజాధనంతోనే కల్పించుకున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. 


జగన్ పై కూడా కేసు పెట్టొచ్చు
ఈ విషయంపై దివంగత టీడీపీ నేత కోడెల శివప్రసాద్ కుమారుడు కోడెల శివరామ్ స్పందించారు. ఆనాడు తన తండ్రి, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై అన్యాయంగా కేసు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆలాగే ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై కూడా పెట్టొచ్చు కదా అని ఆయన ప్రశ్నించారు.  ఆ రోజు ప్రభుత్వ ఫర్నిచర్ తన వద్ద ఉందని కోడెల శివప్రసాద్ చెప్పకపోతే ఎవరికీ తెలిసేది కాదన్నారు. ఫర్నిచర్ తీసుకెళ్లాలని స్పీకర్ కు లేఖ రాసిన తర్వాతనే తన తండ్రి కోడెలపై వైసీపీ ప్రభుత్వం కేసు పెట్టిందని శివరాం వెల్లడించారు. అప్పటి నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి ఫిర్యాదుతో ఐపీసీ 409 సెక్షన్‌ కింద పదేళ్లు శిక్షపడే కేసు పెట్టారు. 
 
మానసిక క్షోభ అనుభవించలేక ఆత్మహత్య 
ఏపీ స్పీకరుగా పని చేసిన కోడెల శివప్రసాదరావుపై ప్రజాధనంతో ఏర్పాటు చేసిన ఫర్నిచర్‌ను సొంతానికి ఉపయోగించుకున్నారని గత వైసీపీ  ప్రభుత్వం కేసు పెట్టి వేధింపులకు గురిచేసింది. ఈ మానసికక్షోభను అనుభవించలేకనే  కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నారని కోడెల శివరాం ఆరోపించారు. ఇపుడు ఏపీలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం స్థానంలో టీడీపీ ప్రభుత్వం కొలువుదీరింది. అదే జగన్మోహన్ రెడ్డి నేడు.. తాడేపల్లి, హైదరాబాదులోని లోటస్‌పాండ్‌లో ఇళ్ల మరమ్మతుల నిమిత్తం ఏకంగా  రూ.18 కోట్లు ఖర్చు పెట్టారు. ప్రజలను కలవటానికి చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసిన ప్రజావేదికను వైసీపీ అధికారంలోకి రాగానే అక్రమ కట్టడం అంటూ కూల్చి వేశారు. ప్రస్తుతం జగన్‌ తన నివాసంలో సీఎంవో కింద తెచ్చిన ఫర్నిచర్‌ ఇచ్చేస్తానని కనీసం లేఖ రాయలేదు. ఇప్పటిదాక ఫర్నిచర్‌ ఇవ్వనందుకు కోడెలపై పెట్టిన కేసు జగన్ మీద కూడా పెట్టవచ్చు కదా!  అని కోడెల శివరాం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 


జగన్మోహన్ రెడ్డి పై వినిపిస్తున్న ఇతర ఆరోపణలు ఇవే...
* క్యాంప్ ఆఫీసు పరిధిలో 1.5 కిలోమీటర్ల డబుల్ లైన్ రోడ్డుకు రూ.5 కోట్ల వ్యయం
* ప్రకాశం బ్యారేజ్ నుంచి రేవేంద్రపాడు రోడ్డుకు మంజూరైన నిధులతో క్యాంపు ఆఫీసు రోడ్డు నిర్మాణం
* ముఖ్యమంత్రిగా ఉన్నప్పడు క్యాంపు ఆఫీసు కోసం రూ.కోట్ల ఖర్చుతో మరమ్మతులు 
* ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు చేసి కొనుగోలు చేసిన ఫర్నిచర్ నే ఉపయోగిస్తున్న  జగన్
* ఇంటి చుట్టూ ప్రహరీ పై ఇనుప కంచె ఏర్పాటుకు కోట్లాది రూపాయల ఖర్చు
* సోలార్ ఫెన్సింగ్, ట్రాన్స్ ఫార్మర్లు, యూపీఎస్ వ్యవస్థల ఏర్పాటుకు ఏకంగా రూ.3.63 కోట్ల ఖర్చు