నిజం గెలిచింది కాబట్టే చంద్రబాబు జైల్లో ఉన్నారని మాజీ మంత్రి, వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని విమర్శించారు. ఆయన భార్య భువనేశ్వరి కూడా నిజం గెలవాలనుకుంటే చంద్రబాబు జీవితంలో బయటకు రారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు కుటుంబమంతా అవినీతి సొమ్ముతో మునిగిపోయిందని ఆరోపించారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులంతా ఏ స్థితిలో ఉన్నారు? భువనేశ్వరి ఏ స్థాయిలో ఉన్నారని ప్రశ్నించారు.


చంద్రబాబు ప్రస్థానం రెండు ఎకరాలతో ప్రారంభమైందని.. అలాంటిది ఆయన ఆస్తి నేడు రూ.2 వేల కోట్లు దాటిందని అన్నారు. 40 రోజుల్లో ఢిల్లీ లాయర్లకు రూ.35 కోట్లు ఏ విధంగా ఫీజులు కట్టారని నిలదీశారు. కష్టపడి పొలం దున్నగా వచ్చిన డబ్బుతోనే రూ.ఏడు కోట్లతో రూపొందించిన బస్సులో యాత్ర చేస్తున్నారా? అని ప్రశ్నించారు. లోకేష్ పప్పు అని మరోసారి రుజువైందని.. ఢిల్లీ పారిపోయి తల్లిని రోడ్లపై తిప్పుతున్నాడని కొడాలి వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు వారసుడు లోకేష్ సమర్థుడు, మగాడు అయితే ఇంట్లో మహిళలు రోడ్లపైకి ఎందుకు వస్తారని ప్రశ్నించారు.


పవన్ కల్యాణ్ గురించి మాట్లాడుతూ.. చంద్రబాబు కోసమే పవన్ ‘జన సున్నా’ పార్టీ పెట్టారని కొడాలి నాని ఎద్దేవా చేశారు. 2019 ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ తెర వెనుక టీడీపీకి మద్దతుగా ఉన్నాడ అన్నారు. ఇప్పుడు ఏకంగా ముసుగు తొలగించి బహిరంగంగానే మద్దతు పలుకుతున్నారని అన్నారు.


విజయనగరంలో బొత్స కౌంటర్


ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, చంద్రబాబు భార్య నారా భువనేశ్వరిపై బొత్స సత్యనారాయణ కౌంటర్లు వేశారు. విజయనగరంలో బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. ఓ వైపు చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా ‘న్యాయం గెలవాలి’ పేరుతో భువనేశ్వరి యాత్ర ప్రారంభించగా.. అటు ఏపీ సర్కార్‌పై కేంద్రానికి పురంధేశ్వరి ఫిర్యాదు చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు అరెస్టుపై సాక్ష్యాలు ఉన్నాయని కోర్టే చెప్పిందని అన్నారు. న్యాయస్థానం చెప్పింది కూడా తప్పు అనడం విడ్డూరం అని అన్నారు. కోర్టు మీద పోరాడుతున్నారా? న్యాయస్థానానికి తప్పు ఆపాదిస్తున్నారా? చెప్పాలని డిమాండ్‌ చేశారు. టీడీపీ, జనసేన ప్రజల్లో లేదని, తుడిచిపెట్టుకుపోయిందని అన్నారు. ఏదో బలం ఉందని చూపించుకునేందుకు టీడీపీ, జనసేన పార్టీలు తాపత్రయ పడుతున్నాయని.. తాము ఏం తప్పు చేశామో, తమను ప్రజలు ఎందుకు ఆదరించకూడదో చెప్పాలని సవాల్ చేశారు.


ఏపీలో మద్యం అమ్మకాలపై పురంధేశ్వరి బీజేపీకి, కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడంపైనా బొత్స సత్యనారాయణ స్పందించారు. మద్యం అమ్మకాలపై పురంధేశ్వరి కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారని.. దానిపై కేంద్రం ఎలాంటి దర్యాప్తు చేపట్టినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. మరోవైపు, రాష్ట్రంలో నెలకొన్న కరువుపై అన్ని చర్యలు చేపడుతున్నామని అన్నారు. అన్ని విధాలా సామాజిక న్యాయం చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదే అని.. గత ప్రభుత్వంలో సామాజిక న్యాయం జరగలేదని విమర్శించారు.