Andhra Pradesh: ముంబై సినీ నటి కాదంబరి జత్వానీ కేసు ఇప్పుడు ఏపీలో రాజకీయ సంచలనంగా మారింది. అటు పోలీస్ డిపార్ట్ మెంట్ లో కూడా ఈ వ్యవహారం పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఏకంగా ఇద్దరు అధికారులపై తాజాగా వేటు పడింది. మరో ముగ్గురు ఐపీఎస్ అధికారులపై చర్యలు తీసుకోడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పోలీసులే ఈ కేసులో కీలక నిందితులుగా మారే అవకాశముంది.
కాదంబరి జత్వానీ, వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ మధ్య ఉన్న గొడవలో చివరకు పోలీసులు బలైపోతున్నారు. ఇప్పటికే ఇద్దరిపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ ఘటన జరిగినప్పుడు విజయవాడ ఏసీపీగా పనిచేసిన హనుమంతరావు, అప్పటి ఇబ్రహీం పట్నం సీఐ సత్యనారాయణను పోలీసులు తాజాగా సస్పెండ్ చేశారు. వారిద్దరూ ఈ కేసులో కీలకంగా మారారు. కాదంబరిపై కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదు చేసిన తర్వాత.. ఆమె ఇంటరాగేషన్ లో హనుమంతరావు కీలకంగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. ఆ కేసు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా ఉన్న సత్యనారాయణ కూడా ముందూ వెనకా ఆలోచించకుండా అప్పటి ప్రభుత్వంలోని పెద్దలుచెప్పినట్టే చేశారనే ఆరోపణలున్నాయి. ఈ ఆరోపణలను ప్రాథమికంగా నిర్థారించుకుని ఇద్దరిపై పోలీస్ డిపార్ట్ మెంట్ సస్పెన్షన్ వేటు వేసింది.
ఆ ముగ్గురు..
గతంలో ఎప్పుడూ ఐపీఎస్ అధికారులు నేరుగా ఇలాంటి కేసుల్లో ఇరుక్కున్న దాఖలాలు లేవు. కానీ తొలిసారిగా ఐపీఎస్ అధికారులు సీతారామాంజనేయులు, కాంతిరాణా టాటా, విశాల్ గున్నిపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ ముగ్గురి వల్ల తాను ఇబ్బందులు పడ్డానని, తనతోపాటు తన కుటుంబ సభ్యులు కూడా ఇబ్బందులు పడ్డారని కాదంబరి చెప్పడం విశేషం. మొత్తానికి కాదంబరి వర్సెస్ కుక్కల విద్యాసాగర్ అనే కేసు.. చివరకు పోలీసుల మెడకు చుట్టుకుంది. ఏకంగా ముగ్గురు ఐపీఎస్ లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వారిపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆ ముగ్గురు వీఆర్ లో ఉన్నారు. త్వరలో ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుందని, వారిపై విచారణ కూడా జరిగే అవకాశముందని అంటున్నారు.
Also Read: బెజవాడ రైల్వే స్ఠేషన్‌కు భారీ ఆదాయం - NSG 1 హోదా - అభివృద్ధికి మరింత అవకాశం
ఇప్పటికే ఈ కేసు విషయంలో ఓసారి విజయవాడ వచ్చి వెళ్లిన కాదంబరి, తాజాగా.. ఇబ్రహీం పట్నం పోలీస్ స్టేషన్ కి వచ్చారు. తనపై తప్పుడు కేసులు పెట్టి, అరెస్ట్ చేసి, తనను ఇబ్బందులు పెట్టారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుక్కల విద్యాసాగర్ తో పాటు, ఐపీఎస్ అధికారులు సీతారామాంజనేయులు, కాంతిరాణా టాటా, విశాల్ గున్నిపై చర్యలు తీసుకోవాలని ఆమె ఇబ్రహీంపట్నం పోలీసులకు కంప్లయింట్ ఇచ్చారు. తల్లిదండ్రులు, న్యాయవాదులతో కలసి ఆమె పోలీస్ స్టేషన్ కి వచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ తో పోలీసులే తప్పుడు ఫిర్యాదు ఇప్పించారని, అప్పటికప్పుడు కేసు నమోదు చేశారని అంటున్నారు జత్వానీ. ఆ తర్వాత తనతోపాటు, తన తల్లిదండ్రుల్ని కూడా ముంబైలో అరెస్ట్ చేశారన్నారు. దీని వెనక కుట్రకోణం ఉందని ఆమె అంటున్నారు. ఆమె ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు న్యాయసలహా తీసుకుని కేసు పెడతామన్నారు. అయితే ఈ కేసులో ఇద్దరు పోలీసులపై ఆల్రడీ సస్పెన్ష్ వేటు పడగా, ముగ్గురు ఐపీఎస్ అధికారులు హిట్ లిస్ట్ లో ఉన్నారు. కేవలం శాఖాపరమైన చర్యలు తీసుకుని వదిలేస్తారా, లేక కేసులు పెట్టి వారిపై కూడా విచారణ చేపడతారా అనేది తేలాల్సి ఉంది.