Janasena PAC Chairman Nadendla Manohar:


వేతనాల పెంపుతో పాటు మినీ అంగన్వాడీ వ్యవస్థ రద్దు చేయాలని అంగన్వాడీలు ‘చలో విజయవాడ’కు పిలుపునిచ్చారు. దాంతో అన్ని జిల్లాల నుంచి అంగన్వాడీలు విజయవాడకు వస్తుంటే మార్గం మధ్యలో వారిని అడ్డుకున్నారు. మారు వేషాల్లో వస్తున్న వారిని సైతం గుర్తించిన పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుని పోలీస్ స్టేషన్లకు తరలించారు. అంగన్వాడీల నిరసన, ఆందోళకు జనసేన పార్టీ మద్దతు తెలిపింది. ఎన్నికల సమయంలో అంగన్వాడీలకు హామీలిచ్చిన జగన్ అధికారంలోకి వచ్చాక మాట తప్పారు, మడమ తిప్పారంటూ సీఎంపై విమర్శలు గుప్పించారు.


పేద మహిళలు, చిన్నారులకు సేవ చేసే అంగన్వాడీ వ్యవస్థను సమర్థంగా నిర్వహించడంలో జగన్ నేతృత్వంలోని వైసీపీ సర్కార్ విఫలమైందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. గర్భవతులు, బాలింతలు, బిడ్డలు ఆరోగ్యంగా ఉండేలా చూడటంలో అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్లు ఎంతో కీలకం అన్నారు. 2019 ఎన్నికల ముందు వీరికి జగన్మోహన్ రెడ్డి ఎన్నో హామీలిచ్చారు. కానీ అధికారంలోకి వచ్చాక ఆ హామీలను విస్మరించారని నాదెండ్ల విమర్శించారు. తమకు ఇచ్చిన హామీలను వైసీపీ నేతలకు గుర్తు చేస్తూ, వాటిని నెరవేర్చాలని అడుగుతుంటే- అంగన్వాడీ మహిళలను అరెస్టులు చేసి భయపెట్టడం అప్రజాస్వామికం అన్నారు


ప్రజాస్వామ్య దేశంలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు రాష్ట్ర ప్రజలకు లేదా అని ప్రశ్నించారు. నిరసనకు సిద్ధపడితే రాష్ట్రవ్యాప్తంగా అరెస్టులు చేస్తున్నారని, జగన్ ప్రభుత్వ వైఖరిని జనసేన పార్టీ ఖండిస్తుందన్నారు. మాట ఇచ్చి మడమ తిప్పిన జగన్ అంగన్వాడీ మహిళలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ వ్యవస్థను బలోపేతం చేయాల్సిన వైసీపీ ప్రభుత్వం తిరోగమన దిశలో ఆలోచనలు చేస్తుందంటూ ఎద్దేవా చేశారు. మినీ అంగన్వాడీలను రద్దు చేయడం దురదృష్టకరం అన్నారు. వైసీపీ పాలకులకు ఈ వ్యవస్థపైనా, నిర్వహణపైనా చిన్న చూపు ఉందని... అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్ల పోరాటానికి జనసేన పార్టీ మద్దతు ఇస్తుందన్నారు. ఈ మేరకు నాదెండ్ల మనోహర్ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 


వివిధ ప్రాంతాల నుండి అంగన్వాడీ టీచర్ లు విజయవాడకు వస్తుండగా వారిని అడ్డుకున్న పోలీసులు 3 బస్సుల్లో గన్నవరం పోలీస్ స్టేషన్ కి తరలించారు. అక్రమ అరెస్టు లు ఖండించాలి,  సీఎం డౌన్ డౌన్ అంటూ గన్నవరం పోలీస్ స్టేషన్ లో అంగన్వాడీల నినాదాలు చేశారు. సాధ్యమైనంత త్వరగా తమ సమస్యలు పరిష్కాలని, లేకపోతే ఉద్యమానికి వెళతామని ఏపీ ప్రభుత్వాన్ని అంగన్వాడీలు హెచ్చరించారు.


తాము నక్సలైట్లమా, గూండాలమా, నేరస్తులమా, హత్యలు చేశామా? తమను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలని పోలీసులను అంగన్వాడీలు ప్రశ్నించారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని తాము కోరుతున్నాం అన్నారు. తమ యూనియన్ నేతలను ఒక్కసారి కూడా పిలిచి చర్చలు జరపలేదని వారు తెలిపారు. తెలంగాణ కంటే అదనంగా వెయ్యి ఇస్తామని చెప్పారు కానీ తెలంగాణలో అంగన్వాడీలకు రూ.13,600 ఇస్తుంటే.. ఏపీలో రూ.11,500 ఇస్తున్నారు. ఈ జీతాలకు ఓ కుటుంబం బతుకుతుందా, మరోవైపు ధరలు ఆకాశంలో ఉన్నాయంటూ జగన్ ప్రభుత్వాన్ని అంగన్వాడీ మహిళలు నిలదీశారు.