JanaSena PAC Chairman Nadendla Manohar:
రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి, ప్రజల్ని ఓ శక్తిగా మలిచేందుకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర చేస్తున్నారని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. కృష్ణా జిల్లాలో అవనిగడ్డలో మొదలయ్యే యాత్ర అక్టోబర్ 1 నుంచి 5 రోజులపాటు షెడ్యూల్ ఖరారు అయిందన్నారు. నాలుగు నియోజకవర్గాలు అవనిగడ్డ, మచిలీపట్నం, పెడన, కైకలూరు నియోజకవర్గాల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ యాత్రలో పాల్గొని వారాహి విజయాత్రను సక్సెస్ చేయాలని నాదెండ్ల కోరారు. అవనిగడ్డ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వారాహి వాహనంపై నుంచి పవన్ ప్రసంగిస్తారు. మరోవైపు చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ టీడీపీ చేయనున్న మోత మోగిద్దాం కార్యక్రమంలో జనసైనికులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు.
ఈ వారాహి విజయాత్రకు మద్దతు పలికిన టీడీపీ నేతలకు ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికలు దగ్గర కొస్తున్నాయి. ఎన్నికల వాతావరణం ఏర్పడుతున్న సమయంలో ప్రతిపక్షాల గొంతు నొక్కాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కుట్రలు చేస్తుందని ఆరోపించారు. స్థానిక సంస్థల్లో పోటీ చేయనివ్వలేదు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ప్రతిపక్ష నేతలపై కేసులు పెట్టి వేధింపులకు గురిచేస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా సైతం వారిపై కేసులు నమోదు చేసి వేధించారని తెలిపారు. వ్యవస్థలను ఉపయోగించుకుని, పోలీసులను ఇబ్బంది పెడుతూ ప్రతిపక్ష పార్టీ నేతలపై కక్ష తీర్చుకుంటున్నారని చెప్పారు.
చంద్రబాబు లాంటి నేతలపై కేసులు బనాయించి ఇబ్బంది పెట్టడాన్ని గమనిస్తే ఏపీకి పెట్టుబడులు ఎందుకు వస్తాయని ప్రశ్నించారు. రాష్ట్రంలో వేధింపుల పర్వం కొనసాగుతోందని, అభివృద్ధి జాడ కనిపించడం లేదన్నారు నాదెండ్ల మనోహర్. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు గమనించి ప్రజలు టీడీపీ, జనసేనకు మద్దతు తెలిపి వైఎస్సార్ సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ నిధులతో పార్టీ కార్యక్రమాలు, సీఎం జగన్ బటన్ నొక్కే కార్యక్రమాలు చేయడంపై విమర్శలు చేశారు. ఆయన తన ఆఫీసు నుంచే బటన్ నొక్కవచ్చని, కానీ జగన్ భారీ బహిరంగ సభలు నిర్వహించి ప్రతిపక్షాలపై విమర్శలు, ఆరోపణలు చేయడం సరికాదన్నారు. నువ్వే మా నమ్మకం జగన్ అని, వై ఏపీ నీడ్ జగన్, ఏపీకి జగన్ ఎందుకు అవసరమో చెప్పాలని వైసీపీ శ్రేణులు కార్యక్రమాలు చేపట్టాయి. అసలు రాష్ట్రానికి జగన్ అవసరమే లేదని అందరూ చెబుతున్నారని వ్యాఖ్యానించారు.
ఆంధ్రాకు జగన్ ఎందుకు వద్దంటే..
ప్రతి ఏడాది జవనరిలో జాబ్ క్యాలెండర్ ప్రకటించి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పి జగన్ మోసం చేశాడని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. టీచర్ల నియామకం, పోలీస్ విభాగంలో కానిస్టేబుల్స్ నియామకం జరిగిందా అని ప్రశ్నించారు. సీపీఎస్ రద్దు చేస్తానని చెప్పి జగన్ మోసం చేశాడని చెప్పారు. సమయానికి జీతాలు కూడా ఇవ్వడం లేని ప్రభుత్వం జగన్ ఘనత అన్నారు. 8 సార్లు కరెంట్ ఛార్జీలు, బస్సు ఛార్జీలు పెంచినందుకు జగన్ కావాలా? రాష్ట్రాన్ని 9 లక్షల 60 వేల కోట్లు అప్పుల్లోకి నెట్టినందుకు రాష్ట్రాన్ని జగన్ పాలించాలా అని నిలదీశారు.
రైతులకు గిట్టుబాటు ధర ఎందుకు ఇవ్వలేదు. జగనన్న ఇల్లులు ఎన్ని కట్టించి ఇచ్చారు. నిధుల దుర్వినియోగం జరిగింది. అమరావతి రాజధాని అయితే ప్రయోజనం ఉండేది, కానీ ఇప్పుడు రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు. 3 రాజధానులు అని జగన్ సాకులు చెబుతున్నారు. 2021 కల్లా పోలవరం నుంచి నీళ్లు ఇస్తామని జగన్ చెప్పారు. కానీ ఈరోజుకు ప్రాజెక్టు పూర్తి కాలేదు. పోలవరం ఎత్తు సైతం తగ్గించేందుకు ఒప్పుకుని కేంద్రం వద్ద సంతకాలు చేయడం వైసీపీ సర్కార్ వైఫల్యమని పేర్కొన్నారు. రాష్ట్రంలో మద్యం ద్వారా సమస్యలు పెరిగాయి. గంజాయి ప్రతి సందులో దొరుకుతుంది, అది కూడా జగన్ పాలనలోనే సాధ్యమైందని చురకలు అంటించారు. వైసీపీ నేతలు ప్రజల ఇంటింటికి వచ్చినప్పుడు మీకు జరిగిన అన్యాయంపై వారిని ప్రశ్నించాలని ప్రజలకు సూచించారు.