MLC Nagababu News: మెగా బ్రదర్, ఏపీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. శాసనమండలి ఛైర్మన్ కార్యాలయంలో ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం నాగబాబు సచివాలయంలో తన భార్యతో వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని మర్యాద పూర్వకంగా కలిశారు. 

చంద్రబాబు,పవన్ ఇచ్చిన బాధ్యత నిర్వర్తిస్తా : నాగబాబు మార్చి నెలలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన తరఫున పోటీకి దిగిన నాగబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయనతోపాటు మొత్తం ఐదుగురు ఎమ్మెల్సీలు బుధవారం ప్రమాణ స్వీకారం చేసారు.ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ మనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ అప్పచెప్పే బాధ్యతలను చిత్తశుద్ధితో పాటిస్తాను అన్నారు.

నెక్స్ట్ మంత్రి పదవే ప్రస్తుతం ఏపీ క్యాబినెట్లో ఒక్క మంత్రి పదవికి చోటు ఉంది. దానిని నాగబాబుకి ఇస్తానంటూ గతంలోనే సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఏకంగా ఒక ప్రకటన ద్వారా ఈ విషయాన్ని స్వయంగా తెలిపారు చంద్రబాబు. ఆ ప్రక్రియ ఉగాది నాటికి పూర్తవ్వాల్సి ఉన్నా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన P4 కార్యక్రమం ఆవిష్కరణ దృష్ట్యా క్యాబినెట్ విస్తరణ వాయిదా పడింది. ప్రస్తుతం ఆ పనులన్నీ పూర్తికావడంతో అతి త్వరలోనే నాగబాబుని మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నారు ఏపీ ముఖ్యమంత్రి. దానితో ఏపీ క్యాబినెట్లో జనసేన మంత్రి పదవుల సంఖ్య 4కి చేరబోతోంది. అయితే ఆయనకి ఏ శాఖ కేటాయిస్తారనే దానిపై జన సైనికుల్లో జోరుగా చర్చ సాగుతోంది.