Pawan Kalyan As AP CM | " నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలి " ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో గట్టిగా వినపడుతున్న డిమాండ్ ఇది. పాలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డితో మొదలుపెట్టి పిఠాపురం వర్మ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, లాంటి వాళ్ళు ఈ డిమాండ్ ను గట్టిగా వినిపించారు. ఒకవైపు హై కమాండ్ ఈ విషయంపై సైలెంట్ గా ఉండమని కూటమి లో చర్చించుకున్నాకే ఎలాంటి నిర్ణయం అయినా ఫైనల్ అవుతుందని నేతలకు సంకేతాలు పంపింది. అయితే అలాంటి సంకేతాలు వెళ్లి కనీసం రెండు మూడు గంటలన్నా గడవక ముందే మంత్రి భరత్ ఏకంగా నారా లోకేష్ భవిష్యత్తు సీఎం అంటూ దావోస్ పర్యటనలో ఉన్న చంద్రబాబు సమక్షంలోనే సంచలన కామెంట్స్ చేశారు. దీనితో కథ మళ్ళీ మొదటికే వచ్చింది అన్న ప్రచారం ఏపీ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. దీనిపై జనసేన తొలిసారి తన అభిప్రాయాన్ని వెళ్ళిబుచ్చింది.
లోకేష్ కు డిప్యూటీ సీఎం.. పవన్ కు సీయం పదవి.. ఇచ్చేయండి సార్ : కిరణ్ రాయల్ అయితే ఈ చర్చ పై సైలెంట్ గా ఉన్న జనసేన ఒక కొత్త మెలికను తెరపైకి తీసుకువచ్చింది. లోకేష్ డిప్యూటీ సీయం ఇస్తే తమకు ఓకే.. కానీ పవన్ కళ్యాణ్ ని సీఎంగా చూడాలని జనసేన కార్యకర్తలు గట్టిగా కోరుకుంటున్నారు కాబట్టి పవన్ ను సీఎం చేయాలంటూ జనసేన నేత కిరణ్ రాయల్ తన అభిప్రాయాన్ని తెలిపారు. నిజానికి ఆయన మాటల్లో సెటైర్ ఎక్కువగా వినిపిస్తోంది. "లోకేష్- డిప్యూటీ సీఎం " చర్చ ను అవసరంగా హైలెట్ చేసి రాజకీయ ప్రత్యర్థుల మాటలకు ఊపిరి పోయొద్దని కిరణ్ రాయల్ తెలిపారు. దీనితో ఈ అంశంపై జనసేన ఎలాంటి స్టాండ్ తో ఉంది అన్నదానిపై కొంతమేర స్పష్టత వచ్చింది.
జనసేన అభిప్రాయం ప్రకారం సీఎంగా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ సమన్వయంతో ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ డిప్యూటీ సీఎం పదవి రచ్చ కూటమి సమన్వయాన్ని దెబ్బతీస్తుందనే ఆలోచన జనసేన నుండి ఎక్కువగా వినిపిస్తోంది. ఒకవైపు అలాంటి పరిస్థితి ఏదైనా తప్పనిసరి అయితే చంద్రబాబు,పవన్ కళ్యాణ్, బీజేపీ కలిసి ఒక నిర్ణయం తీసుకుంటారని అంతవరకు సైలెంట్ గా ఉంటేనే బెటర్ అని జనసేన నేతలు అభిప్రాయపడుతున్నారు. ఒకవైపు చంద్రబాబు, లోకేష్ దావోస్ పర్యటనలో బిజీగా ఉన్న సమయంలో ఈ డిప్యూటీ సీఎం పదవి చర్చ మంచిది కాదనే టిడిపిలోని కాస్త పెద్దతరం నాయకులు అభిప్రాయ పడుతున్నారు. ఇంతకూ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మనసులో ఏముంది అన్నది ప్రస్తుతానికి గుంభనం గా ఉంది.
అన్ని పరిణామాలు గమనిస్తున్న బిజెపి
కూటమిలో మరో భాగంగా ఉన్న బిజెపి ఏపీలో జరుగుతున్న పరిణామాల్ని సైలెంట్ గా గమనిస్తోంది. ఒకవేళ లోకేష్ కి డిప్యూటీ సీఎం పదవి ఖరారు అయితే తమకు చెప్పకుండా నిర్ణయం తీసుకోరు కదా అని రాష్ట్ర బిజెపి నేతలు భావిస్తున్నారు. ఈ చర్చలు అన్నిటికీ సమాధానం ఉగాది నాటికి రావచ్చనేది ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో తాజాగా మొదలైన మరో ప్రచారం.
Also Read: Chandrababu at Davos 2025: దావోస్‌లో రెండో రోజు దిగ్గజ కంపెనీల అధిపతులతో చంద్రబాబు బిజీ బిజీ