Janasen Chief Pawan Kalyan: జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ (Pawan Kalyan) మంచి జోష్‌లో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పోటీచేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించడంతో... సినీ, రాజకీయ రంగ ప్రముఖులు శుభాకాంక్షలు చెప్తున్నారు.  ఎవ్వరూ ఊహించని విధంగా... 100 శాతం స్ట్రైక్‌ రేటుతో పోటీ చేసిన అన్ని స్థానాల్లో జనసేన (Janasena) జయకేతనం ఎగురవేసింది. 21 ఎమ్మెల్యేలకు 21 ఎమ్మెల్యేలు... 2 ఎంపీ స్థానాలకు... రెండు ఎంపీ స్థానాలు గెలుచుకుని... చరిత్ర  తిరగరాశారు. దీంతో రాజకీయాల్లో ఆయన స్టార్‌ తిరిగిపోయింది. గత ఎన్నికల్లో పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓడిపోయారన్న విమర్శల నుంచి విముక్తి పొంది... ఏపీలో తిరుగులేని శక్తిగా జనసేన ఎదిగిందనే ప్రశంసలు అందుకుంటున్నారు పవన్‌  కళ్యాణ్‌. ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌లోనే కాదు... కేంద్ర కేబినెట్‌లో కూడా జనసేన భాగం కాబోతోంది. దీంతో... పవన్‌ కళ్యాణ్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఏర్పాటులో కూడా.. పవన్‌ చొరవే కారణమని అందరూ  భావిస్తున్నారు. దీంతో.... ఆయనకు అభినందనల వర్షం కురుస్తోంది. 


పవన్‌ కళ్యాణ్‌కు సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు, మహిళలు, యువత, సామాజివేత్తలు, విద్యావంతులు, మేధావులు ఇలా... అన్ని వర్గాల ప్రజలు అభినందనలు తెలుపుతున్నారు. ట్వీట్ల రూపంలో శుభాకాంక్షలు  అందిస్తున్నారు. వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు జనసేనాని. తనపై అభిమానంతో... అభినందనలు తెలిపిన వారందరికీ కృతజ్ఞతలు చెప్పారు. రాష్ట్రాభివృద్ధి కోసం అన్ని వర్గాలను కలుపుకుని ముందుకు వెళ్తానని చెప్పారు పవన్‌ కళ్యాణ్‌.  అందుకు ప్రజలందరి సహకారం కావాలన్నారు. కేంద్ర కేబినెట్‌లో కూడా జనసేనకు చోట దక్కబోతోందని సమాచారం. జనసేన నుంచి గెలిచిన ఇద్దరు ఎంపీల్లో ఒకరికి... కేంద్ర మంత్రిపదవి వస్తుందని భావిస్తున్నారు. దీనిపై ఒకట్రెండు రోజుల్లో క్లారిటీ రానుంది. 


జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ అద్భుత విజయాన్ని... మెగా ఫ్యామిలీ కూడా సెలబ్రేట్‌ చేసుకుంది. పవన్‌ కళ్యాణ్‌... నిన్న (గురువారం) చిరంజీవి ఇంటికి వెళ్లారు. కుటుంబ సభ్యులంతా... పవన్‌ కళ్యాణ్‌కు ఘనస్వాగతం పలికారు. ఆయనపై పూల వర్షం కురిపించారు. పవన్‌ కళ్యాణ్‌... తల్లి అంజనాదేవి, అన్న చిరంజీవి, వదిన సురేఖ కాళ్లకు నమస్కరించి పాదాభివందనం చేశారు. వారి ఆశీస్సులు తీసుకున్నారు. ఆ తర్వాత... కుటుంబసభ్యులంతా... ఆయన్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కేక్‌ కట్‌ చేసి... సంతోషం పంచుకున్నారు. టపాసులు కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు. పవన్‌ కళ్యాణ్‌.. చిరంజీవి ఇంటికి రావడంతో... మెగా అభిమానుల్లో కూడా జోష్‌ పెరిగింది. పెద్దసంఖ్యలో ఫ్యాన్స్‌... చిరంజీవి దగ్గరకు చేరుకున్నారు. దీంతో నిన్నంతా... చిరంజీవి ఇంటి దగ్గర సందడి వాతావరణం కనిపించింది.


మొన్న (బుధవారం) ఫ్యామిలీతో పాటు ప్రధాని మోడీని కలిశారు జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌. ప్రధాని మోడీకి పుష్పగుచ్చం సమర్పించారు పవన్‌ కుటుంబసభ్యులు. తనయుడు అకీరా నందన్‌ను ప్రధాని మోడీకి పరిచయం చేశారు పవన్‌  కళ్యాణ్‌. ఆ ఫొటోలను నిన్న (గురువారం) విడుదల చేశారు. అకీరా ప్రధానికి నమస్కరించారు. మోడీ కూడా అకీరాపై చేయి వేసి ఆప్యాయంగా పలకరించారు. అకీరా భవిష్యత్‌ గురించి కూడా ప్రధాని మోడీ సలహాలు, సూచనలు ఇచ్చినట్టు  సమాచారం. ఈనెల 5న తేదీ సాయంత్రం.. ఢిల్లీలోని ప్రధాని అధికారిక నివాసంలో... ఎన్డీయే మిత్రపక్షాల సమావేశం జరిగింది. ఆ సమావేశం అయిపోయిన తర్వాత... కుటుంబసభ్యులతో పాటు ప్రధాని కలిశారు పవన్‌ కళ్యాణ్‌.