Jagan Against Amaravati Land pooling: అమరావతి రాజధాని విషయంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం తాడేపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో వ్యతిరేకంగా స్పందించారు. ప్రధానంగా రైతుల సమస్యలు, రెండో దశ భూసేకరణ అంశాలను ప్రస్తావిస్తూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
అమరావతి కోసం మొదటి దశలో భూములిచ్చిన రైతులు ఒకవైపు కన్నీరు మున్నీరవుతున్నారని జగన్ పేర్కొన్నారు. గతంలో భూములిచ్చిన రైతులకు ఇచ్చిన హామీలు ఇప్పటికీ నెరవేరలేదని, అక్కడ కనీస మౌలిక సదుపాయాల కల్పన కూడా పూర్తి కాలేదని ఆయన విమర్శించారు. రైతుల భూముల్లో ఎటువంటి అభివృద్ధి చేయకుండా, వారిని రోడ్డున పడేశారని ఆరోపించారు. మొదటి దశలో సేకరించిన భూములను అభివృద్ధి చేయని ప్రభుత్వం, ఇప్పుడు రెండో దశ పేరుతో మరో 50,000 ఎకరాల భూమిని సేకరించాలని చూడటం దారుణమని జగన్ వ్యాఖ్యానించారు. ఇప్పటికే ఉన్న భూములకే దిక్కులేదు కానీ, కొత్తగా వేల ఎకరాలను సేకరించడం వెనుక రియల్ ఎస్టేట్ మాఫియా ప్రయోజనాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. ఈ అదనపు భూసేకరణ వల్ల పేద రైతులకు అన్యాయం జరుగుతుందన్నారు.
రాష్ట్రం ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, అమరావతి పేరుతో వేల కోట్లు ఖర్చు చేయడం, భారీగా అప్పులు తీసుకురావడం సమంజసం కాదని జగన్ అన్నారు. ఈ ప్రాజెక్టును నిధుల దోపిడీ కేంద్రం గా మార్చుకున్నారని, కాంట్రాక్టర్లకు మేలు చేసేందుకే ఈ హడావుడి చేస్తున్నారని విమర్శించారు. కేవలం ఒకే ప్రాంతంపై కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా వికేంద్రీకృత అభివృద్ధి జరగాలని ఆయన తన పాత డిమాండ్‌ను మరోసారి గుర్తు చేశారు.
అమరావతి విషయంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి 2014లో అసెంబ్లీలో అంగీకారం తెలిపినప్పటికీ.. 2019లో అధికారంలోకి వచ్చిన అమరావతిని పూర్తి స్థాయిలో నిలిపివేశారు. మూడు రాజధానుల విధానం తీసుకు వచ్చారు. అమరావతిలో కోర్ క్యాపిటల్ నిర్మించాలనుకున్న చోట పేదలకు సెంట్ స్థలాలను పంపిణీ చేశారు. అమరావతిని పూర్తి స్థాయిలో నిలిపివేయడంతో ఐదేళ్ల పాటు రైతులు ఇచ్చిన భూములు అడవిలాగా మారిపోయాయి. మూడు రాజధానుల విధానాన్ని ప్రజలు ఎన్నికల్లో తిరస్కరించడంతో జగన్ భారీ ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే ఆ తర్వాత రాజధాని మార్పు విషయంలో సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతినే రాజధానిగా ఉంచుతామని చెప్పారు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాత వాదననే తెరపైకి తీసుకు వచ్చి..భారీ ఖర్చు అని చెప్పడం.. ల్యాండ్ పూలింగ్, మొదటి దశలో భూములిచ్చిన రైతులకు సమస్యల గురించి మాట్లాడటం ఆసక్తి రేపుతోంది. జగన్ హయాంలో అన్నీ ఆపేయడం వల్లనే రైతులకు సమస్యలు వచ్చాయని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు.