YS Jagan On DSC 2025: ఆంధ్రప్రదేశ్‌లో గత ఏడాది జరిగిన మెగా డీఎస్సీ 2025లో అనేక అక్రమాలు జరిగాయని వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు జగన్ మరోసారి ఆరోపించారు. దీనిపై మండలిలో ప్రభుత్వం చర్చ పెట్టకుండా శాసనసభలో చర్చ పెట్టడాన్ని తప్పు పట్టారు. అయితే అక్కడ తాము చేసిన తప్పులను ఒప్పుకున్నారని, అక్రమాలు జరిగాయని వారే అంగీకరించారని అన్నారు. అందుకే దీనిపై సమగ్ర విచారణ జరిపేందుకు సీబీఐ ఎంక్వయిరీని డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్న లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.  అసెంబ్లీకి హాజరుకాని వైఎస్‌ జగన్, వారానికో అంశంపై మీడియాకు వివరిస్తానని తెలిపారు. అందులో భాగంగా ఈవారం డీఎస్సీ, ఏపీపీఎస్సీపై మాట్లాడతాననిపేర్కొన్నారు. " DSC, APPSC అంశాలపై ఇవాళ మాట్లాడతాను. వీటికి సంబంధించి సాక్ష్యాలు, ఆధారాలు మీద్వారా ప్రజలముందు ఉంచుతాను. డీస్సీ విషయంలో లీకేజీ, అక్రమాలపై మేం ఇప్పటివరకూ ఏ అంశాలను అయితే ప్రజలముందు ఉంచామో, అవన్నీ వాస్తవేమని క్రమంగా ప్రభుత్వమే అంగీకరించే పరిస్థితిలోకి వచ్చింది. తప్పు చేశారు కాబట్టి, గింజుకుంటారే తప్ప, సీబీఐ విచారణకు మాత్రం ముందుకు రావడంలేదు." అని అన్నారు. 

Continues below advertisement

అలాంటివి సభలో ప్రశ్నిస్తామని గ్రహించే తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని అన్నారు జగన్. "ఇవన్నీ గట్టిగా లేవనెత్తుతామనే మాకు ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపు ఇవ్వడంలేదు. చివరకు ప్రతిపక్షం లేకుండానే సభను  నడుపుతున్నారు. ప్రత్యర్థి జట్టు లేనిచోట, బౌలింగ్‌, పీల్డింగ్‌ లేకుండా, తండ్రీ కొడుకులు ఇద్దరూ బ్యాటింగ్‌ చేస్తున్నారు. తాము అద్భుతంగా చేశామని చెప్తున్నారు. DSC లీకేజీ, అక్రమాలపై చర్చకావాలంటూ నాలుగు రోజులపాటు శాసనమండలిని మా MLCలు స్తంభింపచేశారు. కాని, అక్కడ డిస్కషన్‌ చేయడానికి ముందుకు రావడంలేదు. ఎందుకు councilలో చర్చకు ఒప్పుకోలేదంటే, కారణం డీఎస్సీలో తప్పులు జరిగాయి కాబట్టి, సీబీఐ విచారణ చేయాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది కాబట్టి, జరిగిన దానికి బాధ్యత వహిస్తూ లోకేష్‌ రాజీనామాచేసి తప్పుకోవాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి." అని అన్నారు.   డీఎస్సీ పరీక్షల ప్రశ్నల తయారీ–పరీక్ష నిర్వహణ రెండూ ఒకే అధికారి చేతిలో పెట్టినట్టు లోకేష్‌ స్వయంగా అంగీకరించారని జగన్ వీడియో ప్లే చేసి చూపించారు. తాము ప్రశ్నించిన కీలక అంశాల్లో ఇది కూడా ఒకటని గుర్తు చేశారు. తాము లేవనెత్తిన అంశాన్ని అంగీకరించడమే కాకుండా, తప్పేముంది అని దబాయించారని మండిపడ్డారు. "డీఎస్సీ పరీక్షలకు అవసరమైన ప్రశ్నల తయారీ అనేది SCERT డైరెక్టర్‌ బాధ్యత, డీఎస్సీ పరీక్షను నిర్వహించే బాధ్యత డీఎస్సీ కన్వీనర్‌ది. ఈ రెండూ, ఒకే వ్యక్తికి అప్పగించడం ద్వారా పారదర్శకతకు పాతరవేసి, లీకేజీకి స్వయంగా ద్వారాలు తెరిచారు. స్కాం ఇక్కడ నుంచే మొదలుపెట్టార్నది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ప్రశ్నలు తయారుచేసే వ్యవస్థకు, పరీక్ష నిర్వహించే వ్యవస్థకు మధ్య ఉండాల్సిన చెక్స్ అండ్‌ బ్యాలెనెస్‌ ఎందుకు తొలగించారో దర్యాప్తు జరగాలి, అంతేకాదు, ఒకే వ్యక్తి చేతిలో రెండు కీలక బాధ్యతలు ఎందుకు పెట్టారో తేలాలి? అందుకే సీబీఐ విచారణకు డిమాండ్‌ చేస్తున్నాం." అని అన్నారు. 

డీఎస్సీ ప్రశ్న పత్రాలు తయారు చేసే విభాగంలో ఉన్న అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి నవీన్‌కు ఫస్ట్ ర్యాంక్ ఎలా వచ్చిందని జగన్ ప్రశ్నించారు. ఆయనికి ఉద్యోగం ఇవ్వకుండా, ఆయన లాగిన్ ఐడీని ఎందుకు బ్లాక్ చేశారని నిలదీశారు. అంతేకాకుండా ఆ వ్యక్తి సర్టిఫికెట్స్‌ వెరిఫికేషన్‌కు రాలేదని బుకాయిస్తున్నారని అన్నారు. లీకేజీ ఆయనతోనే ఆగిపోయిందా ఆయన ద్వారా ఇంకా ఎవరికైనా చేరిందా అనేది తేలాలని డిమాండ్ చేశారు. అందుకే సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్నట్టు పేర్కొన్నారు.

Continues below advertisement

" ఫస్ట్‌ ర్యాంకు వచ్చిన నవీన్‌కు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు? ఫస్ట్‌ మెరిట్‌ లిస్టులో నవీన్‌ పేరు ఉంది, ఆ తర్వాత మళ్లీ దీన్ని మార్చి, నవీన్‌ పేరు తీసేసి, రెండో మెరిట్‌లిస్ట్‌ ఎందుకు తెచ్చారు?మరి నవీన్‌కు ఎందుకు  ఉద్యోగం ఇవ్వలేదంటే, తండ్రీ కొడుకులిద్దరూ ఒకే విషయాన్ని చెప్పారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు క్యాండిడేట్‌ రాలేదు కాబట్టి, పోస్టు ఇవ్వలేదని చెప్పారు. ఇదే విషయాన్ని కోర్టులో కూడా ఫైల్‌ చేశారు. గతంలో అధికారులచేత ఇదే చెప్పించారు. మరి నేను వారిద్దరినీ అడుగుతున్నా, ఐడీని బ్లాక్‌చేసి, కాల్‌లెటర్‌ పంపనప్పుడు, ఆ నవీన్‌ సర్టిఫికెట్‌ల వెరిఫికేషన్‌కు ఎలా రాగలుగుతాడు? ఇదే విషయాన్ని ఆధారాలతో అతను హైకోర్టులో అఫిడవిట్‌ వేశాడు కదా? వీటికి అసెంబ్లీలో అబ్బా, కొడుకులిద్దరూ ఎందుకు సమాధానం చెప్పలేదు. మరి నవీన్‌ అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగి అని, ఆయకు క్వశ్చన్‌ బ్యాంకు యాక్సెస్‌ ఉందని, పరీక్షల్లో ఫస్ట్ ర్యాంకు వచ్చిందని, తేటతెల్లంగా కనిపిస్తా  ఉన్నప్పుడు, లీకేజీ జరిగింది కాబట్టి, దాన్ని దాచిపెట్టాలి కాబట్టి, అతనికి ఉద్యోగం ఇస్తే గోల అవుతుంది కాబట్టి, ముందస్తుగానే తెలివిగా మెరిట్‌ లిస్ట్‌ మార్చి, పక్కనపెట్టేశారు. మరి ఇన్ని తప్పులు కనిపిస్తున్నప్పుడు సీబీఐ దర్యాప్తు జరగాలా? వద్దా?" అని నిలదీశారు.