బెజవాడ తెలుగు దేశం పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యుడు కేశినేని శ్రీనివాస్ (నాని) వ్యవహరం తీవ్ర స్థాయిలో చర్చనీయాశంగా మారింది. వరుసగా ఆయన చేస్తున్న కామెంట్స్‌తో ఆయన పార్టీ మారతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. 


కేశినేని నాని బెజవాడ నుంచి వరుసగా రెండు సార్లు తెలుగు దేశం పార్టీ తరఫున పార్లమెంట్ సభ్యుడిగా విజయం సాధించారు. ఆయన వ్యవహరం ఆది నుంచి రాజకీయాల్లో చర్చకు దారితీస్తోంది. తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడును ఉద్దేశించి గతంలో ఆయన హాట్ కామెంట్స్ చేశారు. అవి కూడా వైరల్ అయ్యాయి. అంతే కాదు ఢిల్లీ వెళ్ళిన చంద్రబాబుకు స్వాగతం చెప్పే క్రమంలో కూడా ఆయన అనుచితంగా ప్రవర్తించారు. 


టీడీపీ పార్లమెంట్ సభ్యులంతా చంద్రబాబును కలసి పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం చెప్తే కేశినేని నాని మాత్రం తిప్పి కొట్టారు. అప్పట్లో అదో సంచలనంగా మారింది. అధినేత ముందే అసహనం వ్యక్తం చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో నాని చుట్టూ ప్రచారాలు కమ్ముకున్నాయి. అధినేత అంటే లెక్కలేకుండాపోయిందంటూ, నానిని కేంద్రంగా చేసుకొని సొంత పార్టీకి చెందిన నాయకులే పోస్ట్‌లు పెట్టారు. అప్పుడే పార్టీని వీడుతున్నారంటూ ప్రచారం జరిగింది. అయితే ఆ తరువాత చంద్రబాబు కేశినేని నాని కుమార్తె వివాహ కార్యక్రమంలో పాల్గొనటంతో అంతా సైలెంట్ ఐపోయింది.


వైసీపీ ఎమ్మెల్యేలతో టచ్‌లోకి
కేశినేని నాని ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన శాసన సభ్యులతో టచ్‌లోకి వెళుతున్నారు. సాధారణంగా రాజకీయాల్లో ప్రజాప్రతినిదులు ఎదురు పడినప్పుడు పలకరించుకోవటం సహజం. అయితే అధికారిక కార్యక్రమాల్లో మాత్రం అధికార పార్టీ, ప్రతిపక్ష నేతలు దూరంగా ఉంటారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యుడు కేశినేని నాని అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు .అంతే కాదు తాను పార్లమెంట్ సభ్యుడిగా నిధులు ఇచ్చాను కాబట్టి పాల్గొంటున్నాను అంటున్నారు. 


అధికారి కార్యక్రమాల్లో ప్రతిపక్షం నేతలు పాల్గొనటం పెద్ద నేరం కాదు. అదో సంప్రదాయం. ఇందులో తప్పుపట్టాల్సిన పని లేదు. కానీ రాజకీయలపై సొంత పార్టీ నేతలపై చేస్తున్న కామెంట్సే దుమారాన్ని రేపుతున్నాయి. పార్లమెంట్ సగ్మెంట్ పరిధిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో రాజకీయంగా నాని క్లోజ్‌గా ఉంటున్నారు. నందిగామ ఎమ్మెల్యే మెండితోక అరుణ్ కుమార్‌తో అధికారిక కార్యక్రమంలో పాల్గొని నాని కామెంట్స్ చేశారు. పనిలో పనిగా మైలవరం నియోజకవర్గానికి చెందిన శాసన సభ్యుడు వసంత కృష్ణ ప్రసాద్‌తో కూడ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో తాను స్వతంత్రంగా పోటీ చేస్తానేమో అంటూ నాని వ్యాఖ్యలు చేయటం తీవ్ర దుమారాన్ని రాజేశాయి.


వైసీపీలోకి నాని వెళ్తారా?


పార్లమెంట్ సభ్యుడు కేశినేని నాని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో రాసుకొని తిరగడంతో పార్టీ మార్పుపై పుకార్లు మొదలయ్యాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బెజవాడ పార్లమెంట్ స్దానం నుంచి నాని పోటీ చేస్తారంటూ పొలిటకల్ వాట్సాప్ గ్రూపుల్లో తిరుగుతోంది. మరి కొందరైతే ఆదివారం తన అభిమానులతో సమావేశం పెట్టారని, ఆ రోజే తేలిపోతుందంటున్నారు. వీటిపై నానిని సంప్రదించేందుకు ప్రయత్నిస్తే బిగ్గరగా నవ్వారు. చాలా బాగుందంటూ స్పందించారు.