HCL Company representatives Met Nara Lokesh: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత భారీగా పెట్టుబడులను ఆకర్షించే పనిలో నిగ్నమైంది. ఈ క్రమంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు, ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన సంస్థలు మరింత విస్తరణ చేసేందుకు ఆయా సంస్థలతో ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. అందులో భాగంగానే రాష్ట్ర ఐటీశాఖ మంత్రి నారా లోకేష్‌ రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులను పెట్టేందుకు ఆసక్తి ఉన్న సంస్థలతో చర్చలు జరుపుతున్నారు. తాజాగా హెచ్‌సీఎల్‌ సంస్థ ప్రతినిధులు మంత్రి నారా లోకేష్‌ తో సమావేశమై కీలక నిర్ణయం తీసుకున్నారు.


హెచ్‌సీఎల్‌ సంస్థ ప్రతినిధులు మంగళవారం ఉండవల్లిలో రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ వివాసంలో సమావేశమయ్యారు. రాష్ట్రంలో సంస్థ కార్యకలాపాలను మరింతగా విస్తరించేందుకు సంసిద్ధతను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మరో 15 వేల ఉద్యోగాలను కల్పించేందుకు అనుగుణంగా సంస్థ కార్యకలాపాలను విస్తరించేందుకు సుముఖతను వ్యక్తం చేశారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏపీలో కార్యకలాపాలు ప్రారంభించిన హెచ్‌సీఎల్‌ సంస్థలో 4500 మందికి ఉద్యోగాలు లభించాయి. విస్తరణ ద్వారా మరో 5,500 మందికి ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు సంస్థ ప్రతినిధులు మంత్రికి వెల్లడించారు. రెండో ఫేజ్‌లో భాగంగా నూతన కార్యాలయ నిర్మాణాన్ని చేపట్టి మరో పది వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని సంస్థ ప్రతినిధులు మంత్రికి హామీ ఇచ్చారు. 


ప్రస్తుత ట్రెండ్స్‌కు అనుగుణంగా సేవలు


ఐటీ రంగంలో గత కొన్నాళ్లుగా అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో మార్పులకు అనుగుణంగా సంస్థ కార్యకలాపాలను విస్తరించేందుకు హెచ్‌సీఎల్‌ సంస్థ సిద్ధమవుతోంది. ఐటీలో అంతర్జాతీయంగా చోటుచేసుకున్న ట్రెండ్స్‌కు అనుగుణంగా అధునాతన సాంకేతిక సేవలను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్టు వారు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్న స్కిల్‌ సెన్సస్‌, స్కిల్‌ డెవలప్‌మెంట్‌లో తాము కూడా భాగస్వామ్యం వహిస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి తమ వంతు సహాయ, సహకారాలు అందిస్తామని సంస్థ ప్రతినిధులు మంత్రి నారా లోకేష్‌కు హామీ ఇచ్చారు.


విస్తరణకు కావాల్సిన కొన్ని అనుమతులను, గత ప్రభుత్వం నిలిపివేసిన రాయితీలు విడుదల చేయాల్సిందిగా హెచ్‌సీఎల్‌ ప్రతినిధులు మంత్రి లోకేష్‌ను కోరారు. దీనిపట్ల మంత్రి సానుకూలంగా స్పందించారు. దీంతో విస్తరణ దశగా ప్రతినిధులు నిర్ణయం తీసుకున్నారు. తాజా నిర్ణయంతో రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఎంతో మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. వందలాది మంది నిరుద్యోగులకు మెరుగైన ఉపాధి అవకాశాలు ఈ సంస్థ విస్తరణతో లభిస్తాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. వీలైనంత వేగంగా విస్తరణ ప్రక్రియను పూర్తి చేయాలని మంత్రి ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులను కోరారు. ప్రభుత్వం నుంచి అన్ని రకాల అనుమతులు త్వరితగతిన మంజూరు చేసేందుకు ఆయన హామీని ఇచ్చారు. మంత్రితో సమావేశం పట్ల సంస్థ ప్రతినిధులు సంతృప్తిని వ్యక్తం చేశారు. 


విడతల వారీగా రాయితీలు విడుదల చేస్తాం..


మంత్రి నారా లోకేష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ గత టిడిపి హయాంలో అనేక రాష్ట్రాలు పోటీ పడగా, తాను స్వయంగా వెళ్లి హెచ్‌సీఎల్‌ ఛైర్ పర్సన్ శివ్ నాడార్ తో మాట్లాడి గన్నవరంలో క్యాంపస్ ఏర్పాటుకు ఒప్పించానని వెల్లడించారు. రికార్డు టైమ్ లో అనుమతులు, భూ కేటాయింపులు చేసి, యుద్ధ ప్రాతిపదికన కార్యకలాపాలు ప్రారంభించేలా చేయడం తనకు మంచి అనుభూతినిచ్చిందన్నారు. గన్నవరం వైపు వెళ్లిన ప్రతిసారీ యువతకు 4500 మందికి ఉద్యోగాలు కల్పించామన్న సంతృప్తి, సంతోషం కలిగేవని చెప్పారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వ అసమర్థత కారణంగా సంస్థ కార్యకలాపాలు ముందుకు సాగలేదన్నారు. 20 వేల మందికి ఉద్యోగాలు కల్పించాల్సిన సంస్థ కేవలం 4500 మంది వద్దనే ఆగిపోయిందన్నారు. పూర్తిస్థాయి అనుమతులు, రాయితీలు ఇవ్వకుండా నిలిపివేసి ఇబ్బందులు పెట్టిందని పేర్కొన్నారు.


రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటైందని, అయిదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పన తమ లక్ష్యమన్నారు. కంపెనీ పూర్తి సామర్థ్యంతో కార్యకలాపాల విస్తరణకు సంపూర్ణ సహకారం అందిస్తామని, ఇందుకు అవసరమైన అన్ని అనుమతులను త్వరితగతిన క్లియర్ చేస్తామని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో పెండింగ్ పెట్టిన రాయితీలను విడతల వారీగా చెల్లిస్తామని,  మరో 15,500 మందికి ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పని చేయాలని స్పష్టం చేశారు. అందుకు అవసరమైన పూర్తి సహకారం తాము అందిస్తామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. ఐటిలో వస్తున్న అధునాతన మార్పులకు అనుగుణంగా యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి, ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నందుకు హెచ్‌సీఎల్‌ సంస్థ ప్రతినిధులను అభినందించారు.