ప్రేమ పేరుతో ఓ ఎస్సై యువతిని మోసం చేసిన ఘటన గుంటూరులో చోటు చేసుకుంది. మోసపోయిన యువతి ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. ఎస్సైపై కేసు నమోదు చేయడమే కాకుండా సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు.


పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. పల్నాడు జిల్లా రెంటచింతల మండలం తమృకోట గ్రామానికి చెందిన షకీనా బీఎస్సీ నర్సింగ్ చదివింది. గుంటూరు నగరానికి ఉద్యోగం కోసం వచ్చింది. నగరంలోని పట్టాభిపురంలోని ప్రైవేటు అసుపత్రిలో స్టాఫ్ నర్స్ గా ఉద్యోగం చేస్తోంది. నగరపాలెం పోలీస్ స్టేషన్ లో ఎస్సైగా పని చేస్తున్న కుంచాల రవితేజకు షకీనాతో పరిచయం ఏర్పడింది. తాను నగరంపాలెం ఎస్సైగా పని చేస్తున్నానని ఆయన పరిచయం పెంచుకున్నాడు. ఆ తర్వాత ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. ఆ తర్వాత ఇద్దరు సినిమాలకు, పార్కులకు, షాపింగ్ మాళ్ల వెంబడి తిరిగారు. పెళ్లి చేసుకుంటానని కూడా నమ్మబలికాడు. నగరంపాలెంలో ఉన్న తన రూముకు షకీనాను తీసుకెళ్తూ ఉండేవాడు. ఆ క్రమంలో ఇద్దరు మరింత దగ్గరయ్యారని బాధితురాలు, పోలీసులు తెలిపారు.


తీరా పెళ్ళి విషయానికి వచ్చేసరికి మొహం తిప్పేశాడని షకీనా పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను శారీరకంగా వాడుకొని పెళ్ళి చేసుకోమంటే బెదిరిస్తున్నాడంటూ పోలీసులకు చెప్పింది. పదే పదే పోలీసులకు చెప్పినా పట్టించుకోకపోవడంతో అతనిపై చర్యలు తీసుకోకపోవడంతో గుంటూరు ఎస్పీకి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసింది.


ఆ తర్వాత మహిళా సంఘాలతో వచ్చి యువతి షకీనా నగరంపాలెం పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగింది. దీంతో నగరపాలెం పోలీసులు బాధితురాలు షకీనా దగ్గర నుంచి ఫిర్యాదు తీసుకుని ఎస్సీ అట్రాసిటీ, రేప్, కేసు నమోదు చేశారు. అనంతరం ఎస్సైను సస్పెండ్ చేశారు. గతంలో షకీనాకు మరో వ్యక్తితో సంబంధం ఉందని పోలీసులు గుర్తించారు. ప్రసన్న కుమార్ రెడ్డి అనే వ్యక్తి తనను శారీరకంగా వాడుకొని మోసం చేశాడని పట్టాభిపురంలో షకీనా ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత ఆ యువకుడితో రాజీ చేసుకుంది. ప్రస్తుతం పోలీసులు ఎస్సై ను అరెస్టు చేసేందుకు సిద్ధమైనట్లు తెలిసింది.