Gudivada Amarnath Comments: ‘‘చంద్రబాబులా నేను కుర్చీ లాక్కునే రకం కాదు. సచివాలయం సమావేశ మందిరంలో కూర్చున్నాను. నేను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోలేదు’’ అని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. మంత్రి అమర్నాథ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కుర్చీలో కూర్చుని రివ్యూ చేశారంటూ మీడియాలో వస్తున్న కథనాలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై గురువారం ఆయన వివరణ ఇస్తూ, తనపై ఈ విమర్శలకు పాల్పడిన ధూళిపాళ్ల నరేంద్ర బహుశా చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి మాట్లాడినట్టు కనిపిస్తోందని అన్నారు. ఎన్టీఆర్ నుంచి పార్టీని, కూర్చుని  చంద్రబాబు లాక్కుని, అతనిపై చెప్పులు విసరించిన నైజం చంద్రబాబుదని అట్లాంటి దుర్మార్గమైన ఆలోచన తమ పార్టీలో ఎవరికీ లేదని స్పష్టం చేశారు. 


సుమారు రూ.5 వేల కోట్ల రూపాయల విలువైన పరిశ్రమలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు వర్చువల్ విధానంలో చేసేందుకు కార్యక్రమం సెక్రటేరియట్ లో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వివిధ కార్యక్రమాలలో బిజీగా ఉన్నందువలన ఆ బాధ్యతలను తనకు అప్పగించారని అమర్నాథ్ తెలియజేశారు. తాను సమావేశ మందిరంలో కూర్చున్నాను తప్ప, ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోలేదని వివరించారు. ఈ మాత్రం ఇంగిత జ్ఞానం లేని ధూళిపాళ్ల  నరేంద్ర చంద్రబాబు నాయుడుపై చేయాల్సిన విమర్శలను తనపై చేశారని అమర్నాథ్ అన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసినప్పుడు ధూళిపాళ్ల నరేంద్ర, చంద్రబాబు నాయుడు కూర్చున్న కుర్చీలోనే కూర్చో లేదా? అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు అసెంబ్లీకి వచ్చిన బాలకృష్ణ చంద్రబాబు నాయుడు కుర్చీలో కూర్చున్న విషయం ఈ దద్దమ్మ ధూళిపాళ్లకి తెలియలేదా? అని మంత్రి అమర్నాథ్ ప్రశ్నించారు.


ఇవ్వని పథకాలు ఎన్నైనా ప్రకటించచ్చు


ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న పథకాల కన్నా, మరిన్ని పథకాలు అధికంగా ఇస్తానని చంద్రబాబు నాయుడు ప్రకటించడం పట్ల విలేకరులు అడిగిన ప్రశ్నకు మంత్రి అమర్నాథ్ సమాధానం చెబుతూ ఇవ్వని పథకాలను ఎన్నైనా ప్రకటించవచ్చని, చంద్రబాబు అండ్ కో ఎన్ని చెప్పినా జనం నమ్మే పరిస్థితి లేదని, జగన్మోహన్ రెడ్డి క్రెడిబులిటీని చూసి ప్రజలు మళ్ళీ ఆయనని ముఖ్యమంత్రిని చేయడానికి సిద్ధంగా ఉన్నారని అమర్నాథ్ చెప్పారు.


జగన్మోహన్ రెడ్డి నా బాధ్యత చూసుకుంటారు


 రానున్న ఎన్నికల్లో మీకు సీటు ఎక్కడ ఇస్తారు? అని విలేకరులు మంత్రి అమర్నాధుని ప్రశ్నించగా, దానిపై ఆయన సమాధానం చెబుతూ, జగన్మోహన్ రెడ్డి నా తలరాత రాస్తారు. తనకు ఏ బాధ్యతలు అప్పగించినా చేయడానికి సిద్ధంగా ఉన్నానని మరోసారి స్పష్టం చేశారు. ఉమ్మడి విశాఖ జిల్లాలోని 15 నియోజకవర్గాలలో పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి తనకు డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్ పదవిని ఇచ్చారని ఆ బాధ్యతలను పూర్తిస్థాయిలో నిర్వర్తిస్తానని మంత్రి అమర్నాథ్ స్పష్టం చేశారు. మంత్రిగా పనిచేస్తేనే రాజకీయాల్లో ఉన్నట్టా? పదవి లేకపోతే లేనట్టా? పార్టీ కోసం పని చేయాల్సిన తన అవసరాన్ని జగన్మోహన్ రెడ్డి గుర్తించే తనకి బాధ్యతలు అప్పగించారని అమర్నాథ్ స్పష్టం చేశారు.